రాజకీయ భవిష్యత్పై చిరంజీవికి బెంగ?
హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ....ఆనక కాంగ్రెస్తో చేయికలిపి కేంద్రమంత్రి పదవి దక్కించుకున్న చిరంజీవికి ప్రస్తుతం రాజకీయ భవిష్యత్పై బెంగ పట్టుకుంది. ఆటలో అరటిపండుగా మారిన ఆయన తన రాజకీయ భవిష్యత్ గురించి చెందుతున్నారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్కు నూకలు చెల్లే పరిస్థితి ఏర్పడడంతో ఇక ఆ పార్టీతో కలిసి పనిచేయద్దంటూ సన్నిహితులు ఆయనకు సలహా ఇస్తున్నారు.
మునిగిపోయే పడవలో ప్రయాణించవద్దని వారంతా చిరంజీవికు చెప్పినట్టు సమాచారం. దాంతో పునరాలోచనలో పడిన ఆయన... తిరిగి పార్టీని పునరుద్ధరించాలా? లేదా కాంగ్రెస్లోనే కొనసాగాలా? లేక మరోపార్టీలో చేరాలా అన్నదానిపై కూడా సన్నిహితుల అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూలు విడదలయ్యేలోపు దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి శుక్రవారం తన నివాసంలో పాత ప్రజారాజ్యం పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.