PrajaRajyam Party
-
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ మగధీరుడు ఆయనే!
ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు.. స్థానం వేరు చిరంజీవి సినిమారంగంలో ఒక లెజెండ్. ఆయన తుపాన్‌లా రాలేదు. చిరు జల్లులా వచ్చి తుపాన్‌లా మారాడు. ఆయన 'స్వయంకృషి'తో ఎదిగిన నటుడు. తన యాక్షన్, డ్యాన్స్‌లతో ఎందరిలోనో స్ఫూర్తినింపిన 'ఆచార్యు'డు. ఇండస్ట్రీలో ఎదురైన ప్రతి 'ఛాలెంజ్' లను 'మగధీరుడు' లాగా ఎదుర్కుంటూ 'విజేత'గా నిలిచిన 'మగమహారాజు' . అభిమానుల గుండెల్లో ఆయనొక 'ఖైదీ'. బాక్సాఫీసు వసూళ్ల 'వేట'లో 'ఛాలెంజ్' విసిరితే 'రోషగాడి'లా 'జాతర' చూపించాడు. సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తున్నారు.. వస్తూనే ఉంటారు కూడా.. అలాంటి వాల్లకు ఒక్కరే స్ఫూర్తి ఆయనే మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ప్రత్యేక కథనం. చిరంజీవి సినిమాలు ఫెయిల్ అయి ఉండవచ్చు. కానీ ఇండస్ట్రీలో చిరంజీవి ఎప్పుడూ ఫెయిల్ అవలేదు. ఇప్పటి తరం ట్విటర్లో ఫ్యాన్ వార్ చేసుకునే వారికి తెలియకపోవచ్చు అప్పట్లో కవర్‌పేజీలో వచ్చే చిరంజీవి ఫోటో కోసం అభిమానుల మధ్య జరిగే వార్ గురించి. ఇప్పడు మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పుకుని తిరిగేవారికి తెలియకపోవచ్చు వాళ్ల హీరోలకు కూడా ఫేవరేట్ హీరో చిరంజీవే అని.. మా హీరో రికార్టులు ఇవి అని గొప్పలు చెప్పుకునే వారికి తెలియకపోవచ్చు ఆ రికార్డులను క్రియేట్ చేసిందే చిరంజీవి అని. ఒక రిక్షా కార్మికుడి నుంచి కలెక్టర్ వరకు.. అప్పుడే సినిమాలు చూడటం మొదలుపెట్టిన 10 ఏళ్ల బుడ్డోడి నుంచి 70 ఏళ్ల ముసలోళ్ల దాక అందరూ ఆయన ఫ్యాన్సే.. నటనలో తనకంటూ ప్రత్యేక శైలి, హాస్యంలో తనకంటూ ఒక ముద్ర..కోట్లాదిమందికి అతనొక ఆరాధ్య నటుడు అయ్యాడు. ఫిబ్రవరి 11, 1978 లో పునాదిరాళ్ళు చిత్రంతో సినీ ప్రస్థానం మెదలుపెట్టిన మెగాస్టార్. పునాదిరాళ్ళు మొదటి చిత్రం అయినప్పటికీ మొదటగా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. తొలి సినిమానే ప్లాప్ అయింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి మాత్రం అందరినీ మెప్పించాడు. తర్వాత బాపు దర్శకత్వంలో 'మన వూరి పాండవులు' సినిమాలో చిరంజీవికి ఒక చిన్న పాత్ర దొరికింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు చిరుకు మంచి గుర్తింపు తెచ్చింది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమా ఇదే మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలతో పాటు విలన్‌గా నటించిన చిరంజీవికి ఒక నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. కానీ 1980 వ దశకం నుంచి ఆయనకు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. 1980లో వచ్చిన 'మొగుడు కావాలి' సినిమా చిరంజీవికి మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డుకెక్కింది. ఈ సినిమాను తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు. ఆ సమయం నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. 'చిరంజీవి-ఎన్టీఆర్'కు ప్రత్యేకం ఆ తర్వాత వచ్చిన 'తిరుగులేని మనిషి' చిత్రం తన కెరియర్లో చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. అందులో 'చిరంజీవి-ఎన్టీఆర్' కలిసి నటించిన ఏకైకా సినిమా ఇది. ఎన్టీఆర్ ప్రధాన పాత్ర చేస్తే.. చిరంజీవి ఆయన బావమరిది పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత 'ఊరికిచ్చిన మాట' సినిమాతో చిరంజీవికి మాస్ ఇమేజ్ బీజం పడినా.. ఆ తర్వాత 'చట్టానికి కళ్లులేవు' చిత్రంతో పూర్తి మాస్ హీరోగా గుర్తింపు దక్కింది. ఈ సినిమాను తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా వచ్చింది. ఇది కూడా సిల్వర్ జూబ్లీ లిస్ట్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కట్నం అనే ఇష్యూ మీది శుభలేఖ అనే సినిమాను తీశారు. ఈ రెండు సినిమాలతో చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఓన్ చేసుకున్నారు. శుభలేఖ సినిమాతో మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును చిరు అందుకున్నారు. ఇలా చిరంజీవి నుంచి వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలుస్తున్న సమయంలో అసలు సెన్సేషన్ 1983లో మొదలైంది. ఇండస్ట్రీలో సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసిన చిరు సినిమా కోదండరామిరెడ్డి డైరెక్షన్లో ఖైదీ సినిమా 1983లో విడుదలైంది. అప్పట్లో కమర్షియల్ సినిమాలకు సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ శైలజా థియేటర్లో 80రోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో కొనసాగింది ఈ సినిమా.. హైదరాబాద్ శాంతి థియేటర్లో 365 రోజులు ఏకదాటిగా కొనసాగింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి, మాధవిలపై సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు.. ఒక యాక్టర్, స్టార్‌కు మధ్య ఉన్న గీతను చెరిపేసి చిరంజీవిని ఓవర్‌నైట్ సూపర్ స్టార్‌ను చేసింది ఈ సినిమా.. ఇందులోని చిరు లుక్‌నే రామ్‌చరణ్ మొదటి సినిమా చిరుతలో కూడా ఆ షాడో ఉండేలా చూపించాడు పూరి. ఇంతలా మెగస్టార్ జీవితంలో ఖైదీ సినిమా పాత్ర ఉంది. అక్కడి నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతుండగా 2007లో శంకర్ దాదా జిందాబాద్‌తో సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి ఎంట్రీ 2008 ఆగష్టు 26న ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించారు. తిరుపతిలో చిరంజీవి పాల్గొంటున్న మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో మెగాఫ్యాన్స్ పోటెత్తారు. ఆ సభ కోసం సుమారు పది లక్షల మందికి పైగా హాజరైనట్లు సమాచారం. ఆ సభ రాత్రి 10 గంటలకి పూర్తయితే తిరుపతి నుంచి తెల్లారే వరకూ వాహనాలు వెళుతూనే వున్నాయి. కనీవినీ ఎరుగని ట్రాఫిక్ జామ్ తిరుపతిలో ఏర్పడింది. అంతవరకు ఏ సినీ, రాజకీయ నాయకుడి సభకు రానంత జనం వచ్చారు. ఈ సభలోనే చిరంజీవి పార్టీ పేరును, అజెండాను ప్రకటించారు. ఆయన పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చే నాటికి ఉమ్మడి ఏపీలో 2004 నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి మొదటిసారి సీఎం కావడమే కాకుండా ప్రజల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వైఎస్సార్ పాలన కొనసాగింది. అలా ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ఏపీలో వైఎస్సార్ ఉన్నారు. 2009లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ పోటాపోటీగా ఉమ్మడి ఏపీలో ఉన్నాయి. అలాంటి సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటికే ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకుని మళ్లీ 2009 ఎన్నికల బరిలో ఉన్న రాజశేఖర్‌రెడ్డి గారిపైనా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన్ని దింపి చిరంజీవిని సీఎం చేయాలనే జ్వాల, కోరిక జనంలో లేవు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం నుంచి అభ్యర్థులను చిరంజీవి నిలబెట్టారు. తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి చిరు పోటీ చేయగా తిరుపతి స్థానం నుంచి మాత్రమే గెలుపొందారు. అలా మొత్తంగా కేవలం 294 స్థానాలకు గాను 18 స్థానాలకు మాత్రమే ప్రజారాజ్యం పరిమితం అయింది. 2009 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు మరోసారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2011 ఆగష్టులో భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనమయ్యింది. ఆ పార్టీ నుంచి కేంద్రమంత్రిగా కూడా చిరంజీవి కొనసాగారు. తిరుపతి సభ నుంచే చిరుకు మొదటి దెబ్బ పార్టీ ఆవిర్భావ సభరోజు పది లక్షలకు మంది పైగా వచ్చిన జనం అదే తిరుపతిలో చిరంజీవి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. బస్టాండ్‌కు దగ్గర్లో మెగాస్టార్ సభ పెడితే జనం వెయ్యి మంది కూడా లేరు. అప్పుడు ఆయన ఆకాశం నుంచి ఒక్కసారిగా నేలకు దిగారు. ఆ సమయం నుంచే చిరంజీవిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సినిమా వేరు.. రాజకీయాలు వేరని చాలామంది పొలిటికల్ విశ్లేషకులు తెలిపారు. రజనీకాంత్‌కు చిరంజీవి ఇచ్చిన సలహా సినిమా హీరోకు ఉన్న ఇమేజ్, రాజకీయ నాయకుడి ఇమేజ్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇదే విషయాన్ని చిరంజీవి గ్రహించి రాజకీయాల్లోకి రావాలనుకున్న రజీనికాంత్, కమల్ హాసన్‌కు ఒక సూచన ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ మాత్రం ఇవ్వకండని ఆయన ఇలా సూచించారు. 'రాజకీయాల్లోకి రావాలన్న మీ ఆలోచన విరమించుకోండి. సూపర్‌స్టార్‌గా అందరివాడు అనిపించుకున్న మీరు పాలిటిక్స్‌లోకి వచ్చి చెడ్డపేరు తెచ్చుకోవద్దు. మనలాంటి వారు ఈ రాజకీయాల్లో నెగ్గాలంటే చాలా కష్టం. అందుకే రాజకీయాలు వదిలేసి మళ్లీ సినిమాల వైపు వచ్చాను. ఇక నుంచి సినిమాలే నా ఫస్ట్ లవ్.' అని చిరంజీవి అన్నారు. 2017లో రీ ఎంట్రీ రాజకీయాల నుంచి చిరంజీవి పూర్తిగా దూరం అయి తన అభిమానుల కోసం 2017లో 'ఖైదీ 150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఒక హీరో సినిమా ప్రపంచానికి సుమారు 10 సంవత్సరాలు దూరం అయితే... అదే సమయంలో చాలామంది యంగ్ హీరోలు పోటీపడుతూ బ్లాక్‌బస్టర్ హిట్లు ఇస్తూ కొత్తకొత్త అభిమానులను సంపాధించుకుంటున్న తరుణంలో పదేళ్లు బ్రేక్ తీసుకున్న హీరో వెనక్కు వస్తే మునపటి ఇమేజ్ ఉండదని పలువురు కామెంట్లు కూడా చేశారు. అలాంటి వారందరికీ ఖైదీ 150 సినిమాతో చిరు సమాధానం చెప్పారు. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులను బద్ధలుచేసింది. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను నిరుత్సాహపరిచాయి. రాజకీయాల్లో చిరంజీవి ఓడిపోవచ్చు కానీ సినిమాల్లో ఎప్పటికీ మెగాస్టారే అని ఆయన సినిమా ఓపెనింగ్స్ చెప్తాయి. ఎందుకంటే నాడు చిరంజీవి ఎంట్రీతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా సమూలంగా మారిపోయింది. డ్యాన్స్‌లు, ఫైట్స్, పాటలు ఇలా అన్ని విభాగాల్లో ఆయన కొత్తదనాన్ని తీసుకొచ్చారు. తెలుగు సినిమా ఇంకెంత వృద్ధిలోకి వెళ్లిన.. ప్రపంచం గర్వించే సినిమాలు ఇంకెన్నీ తీసినా వాటి వెనుకాల చిరంజీవి అనే ఒక మహాశక్తి పాత్ర ఎంతోకొంత ఖచ్చితంగా ఉంటుంది. చివరిగా తెలుగు సినిమాలో ఎన్ని మారినా.. ఎంతమంది వచ్చినా ఆయన స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు. భవిష్యత్‌లో మరిన్ని సూపర్ హిట్ సినిమాలు చిత్రపరిశ్రమకు అందించాలని కోరుకుంటూ పద్మ విభూషణ్ చిరంజీవికి ప్రత్యేక శుభాకాంక్షలు. -సాక్షి వెబ్ డెస్క్ -
చేతకాకే కాపాడుకోలేకపోయాం
తిరుపతి రూరల్: దేశంలో, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీకి కొమ్ము కాయటానికి తాము సిద్ధంగా లేమన్నారు. రెండిటికీ సమదూరం పాటిస్తామన్నారు. నాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని చేతకానితనం, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కోవర్టుల వల్లే కాపాడుకోలేకపోయామని వ్యాఖ్యానించారు. తన అన్న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినా, తాను మాత్రం అటువైపు వెళ్లలేదన్నారు. ప్రధాని మోదీ మీద అభిమానంతోనే 2014లో టీడీపీకి మద్దతు తెలిపామని, అంతేకానీ ఆ పార్టీపై ప్రేమతో కాదన్నారు. గౌరవం ఇవ్వని పార్టీలకు ఎప్పుడూ దూరంగా ఉంటామన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని, శత్రువులతో కలిసిపోవటమే రాజకీయం అన్నారు. తిరుపతిలో ఆదివారం జరిగిన ‘జనవాణి–జనసేన భరోసా’ కార్యక్రమంలో 415 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ కోస్తాంధ్రలో దళితులకు సమస్య వస్తే సంఘటితంగా పోరాడతారని, సీమలో ఆ పరిస్థితుల్లేవన్నారు. ఒకటి రెండు కులాల చేతుల్లోనే అధికారం వల్ల అసమానతలు పెరుగుతున్నాయన్నారు. మునుగోడులో జనసేనకు వందో, వెయ్యో ఓట్లు తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని అడుగుతున్నారని, అక్కడ పోటీచేస్తే జనసేనకు వందో, వెయ్యో, రెండువేలో ఓట్లు రావొచ్చు.. దానివల్ల సాధించేదేమీ లేదు.. అని పవన్ వ్యాఖ్యానించారు. -
మెగా బ్రదర్స్‌కు పరాభవం
మాదీ పశ్చిమగోదావరే...మా నాన్న జిల్లాలో పనిచేశారు.మొగల్తూరు మా సొంతూరు అంటూ ఎన్నికల్లో పోటీచేసిన మెగా బ్రదర్స్‌కు డెల్టాప్రాంత ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో ఈ ప్రాంతం గురించి పట్టించుకోని కొణిదెల చిరంజీవి (ప్రజారాజ్యం పార్టీ స్థాపకులు), జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగా సోదరుడు నాగబాబుకు చేదు పరిస్థితులే ఎదురయ్యాయి. భీమవరం: మెగా సోదరులు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి జిల్లాకు మీరేమి చేశారంటూ ప్రజలు ప్రశ్నించడం, ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం సర్వసాధారణమైంది. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తానని, అవినీతిని అంతమొందించి నీతివంతమైన పాలన సాగిస్తానని 2008 ఆగస్టు 26వ తేదిన సుప్రీమ్ హీరో, మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీస్థాపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన చిరంజీవి ఎమ్మెల్యేగా జిల్లాలోని పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేయడం అవివేకమని నీతివంతమైన పాలన అందించడానికి డబ్బుతో కాకుండా నిజాయితీతో రాజకీయాలు చేయాలంటూ చిరంజీవి ఎన్నో ప్రసంగాలు చేశారు. అయితే 2009 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో తన భార్య సురేఖ పుట్టిన ఊరైన పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో గెలుపు సునాయాసమని అక్కడి నుంచి పోటీకీ దిగారు. నీతివంతమైన పాలన అంటూనే ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో ప్రభావితం చేసే విధంగా సొమ్ములు పంపిణీ చేశారు. అయినప్పటికీ అక్కడ మైనార్టీ (వైశ్య) వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంగారు ఉషారాణి చేతిలో ఘోర పరాజయం పొందారు. పాలకొల్లు ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ సభ్యులు అల్లు అర్జున్, రామ్‌చరణ్ తేజ తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. ఎంతచేసినా చిరంజీవికి ఓటర్ల నుంచి ఆదరణ దక్కలేదు. తిరిగి ప్రస్తుత ఎన్నికల్లో మెగా తమ్ముడు పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ తరపున భీమవరం నుంచి అసెంబ్లీకి, మెగా సోదరుడు నాగబాబు నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి వివిధ సామాజిక వర్గాల ప్రజలు, వివిధ సంఘాల నాయకులు, కులవృత్తుల వారితో సమావేశాలు నిర్వహించడమేగాక మెగా సోదరులతోపాటు నాగబాబు భార్య పద్మజ, కుమారై నిహారిక, కొడుకు వరుణ్‌తేజ్‌తో సహా జబర్దస్త్ టీమ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో నాగబాబు మాది మొగల్తూరు ఇక్కడి సమస్యలు మాకు బాగా తెలుసు ప్రజల కష్టాలను తీరుస్తామంటూ ఊదరగొట్టారు. పెనుగొండలో బంధువులున్నారు. మొగల్తూరులో మాకు ఇల్లు ఉండేది, మాఅన్న చిరంజీవి నరసాపురం వైఎన్ కళాశాలలోనే చదువుకున్నారంటూ చెప్పుకొచ్చారు. ప్రాంతీ యతను రాజేచి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఓటర్లకు డబ్బు పంపిణీకి తాము వ్యతి రేకమంటూనే భీమవరం అసెంబ్లీ పరిధిలో ఓటర్లకు పెద్ద ఎత్తున సొమ్ములు పంపిణీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలు నుంచే డబ్బు పంపిణీ ప్రారంభించారు. మెగా బ్రదర్స్‌పై సినిమా అభిమానంలో అన్ని వర్గాల ప్రజలు పవన్‌కల్యాణ్ సభలకు ఎటువంటి తరలింపులు లేకుండానే పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో పవన్‌కల్యాణ్ భీమవరం ఎమ్మెల్యేగా, నాగబాబు నరసాపురం ఎంపీగా గెలుపు ఖాయమంటూ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు పందేలు కూడా కాశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా అప్పులు చేసి పవన్‌కల్యాణ్, నాగబాబు విజయం సాధిస్తారంటూ పెద్ద మొత్తంలో పందేలు వేశారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో పవన్‌కల్యాణ్ వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో 8,691 ఓట్ల తేడాతో ఓడిపోగా.. నరసాపురం లోక్‌సభ అభ్యర్థి నాగబాబు మూడవ స్థానానికే పరిమితమయ్యారు. దీనితో పశ్చిమలో మెగా బ్రదర్స్‌కు ఆదరణలేదని ఓటర్లు తేటతెల్లం చేసినట్లు స్పష్టమైంది. -
కన్పించేది ఎన్నికలప్పుడే..!
కామినేని మకాం అయితే అమెరికా.. లేకుంటే హైదరాబాద్ ఓడిన ఐదేళ్లకు కైకలూరు రాక అప్పుడు అన్నయ్య..ఇప్పుడు తమ్ముడి ప్రచారం గతంలోనూ కలిసిరాని సినీనటుల ప్రచారం కైకలూరులో ఫ్యాన్ గాలి జోరు గెలుపుదిశగా రామ్‌ప్రసాద్.. సాక్షి, మచిలీపట్నం/కైకలూరు, న్యూస్‌లైన్ : పెద్దగా పనులు చేయక్కర్లేదు కనీసం అందుబాటులో ఉంటే చాలు.. పంచభక్ష పరమాన్నం పెట్టక్కర్లేదు కనిపించినప్పుడు పలుకరిస్తే చాలు.. అందరివాడిగా ఉండే వాడినే ప్రజలు ఆదరిస్తారు.. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న రసవత్తరపోరులో సరిగ్గా ఇదే సీన్ కన్పిస్తోంది. ఒకరు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఉప్పాల రామ్‌ప్రసాద్ అయితే మరొకరు శ్రీమంతుడిగా పేరొందిన కామినేని శ్రీనివాస్. వీరద్దరి పోరును నిశితంగా గమనిస్తున్న కైకలూరు ప్రజలు ఓడినా గెలిచినా కామినేని శ్రీనివాస్ తమకు అందుబాటులో ఉండడని బాహాటంగానే చెబుతున్నారు. అందరికీ అనుకూలమైన, అందుబాటులో ఉండే రామ్‌ప్రసాద్‌ను గెలిపించుకుంటే ఐదేళ్లు తమవాడే ఎమ్మెల్యేగా ఉన్నాడన్న ఆనందం కలుగుతుందని కైకలూరు వాసులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా, ఇప్పుడు బీజేపీ నుంచి పోటీకి దిగిన కామినేని శ్రీనివాస్ అయితే అమెరికా లేకుంటే హైదరాబాద్‌లో ఉంటారని కైకలూరు వాసులు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో ఓడిన తరువాత హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. తన వారసులు అమెరికాలో స్థిరపడటంతో ఎక్కువగా అమెరికా వెళ్లొస్తుంటారు. ఓటమి అనంతరం ఐదేళ్లుగా ఆయన నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు. మళ్లీ ఎన్నికలొచ్చాక బీజేపీ టికెట్ దక్కించుకుని డబ్బు సంచులతో దిగారని పలువురు పేర్కొం టున్నారు. కామినేని కోటీశ్వరుడు కాబట్టి డబ్బులు వెదజల్లుతారన్న ప్రచారం ఊపందుకుంది. సామాజి కంగా, ఆర్థికంగా బలమైన కామినేని రెండోసారి పోటీకి దిగడంతో ఆయన ఎన్నికల సమయంలో వస్తున్నారు తప్పా కైకలూరు నియోజకవర్గ వాసులను ఎప్పుడూ పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాడు అన్నయ్య.. ఇప్పుడు తమ్మయ్య ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఇప్పుడు వేర్వేరు రాజకీయ పార్టీల సేవలో తరిస్తున్నారు. రెండు ఎన్నికల్లోనూ మెగా అన్నదమ్ముల సేవలు కామినేనికి తప్పలేదు. 2009 ఎన్నికల్లో చిరంజీవి సర్వశక్తులు ఒడ్డి కామినేని కోసం ప్రచారం చేశారు. తాజా ఎన్నికల్లో పవన్ కైకలూరులో ఆదివారం ప్రచారం చేశారు. అన్నలానే సినీ డైలాగులు పేల్చారు. అయితే ఈ నియోజకవర్గంలో సినీ గ్లామర్ కలిసిరాదనే సంగతి తెల్సిన ప్రజలు పవన్ ప్రచారాన్ని సైతం పట్టించుకోలేదు. 1999 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన యర్నేని రాజారామచందర్ ఓటమి కోసం టీడీపీ తరఫున సినీనటి విజయనిర్మల ప్రచారం చేసినా యర్నేనికే ప్రజలు పట్టంకట్టారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రచారం చేసినా కామినేనికి ఓటమి తప్పలేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు తరఫున ఇటీవల చిరంజీవి, తాజాగా ఆదివారం కామినేని కోసం పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. రాజకీయ పరిణితికి నిదర్శనం జగన్ సభ రాజకీయ పరిణితికి నిలువెత్తు నిదర్శనం ఇటీవల కైకలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించిన జనభేరి అని పలువురు కొనియాడుతున్నారు. జగన్, పవన్ సభలను విశ్లేషకులు బేరీజు వేస్తున్నారు. పవన్ సభ చంద్రబాబు, మోడీల భజన సభగా మారిందని పెదవి విరిచారు. అన్న చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరి చంద్రబాబు, మోడీని ఉతికిపారేస్తుంటే, తమ్ముడు తగుదునమ్మా అంటూ అదే మోడీ, బాబును ప్రశంసించడం ఏమి రాజకీయమని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కైకలూరులో ఉప్పాల రామ్ప్రసాద్కే అనుకూల పవనాలు వీస్తున్నాయని, ఇక్కడ వైఎస్సార్ సీపీదే విజయమని విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. -
చిరంజీవి కాస్త సమయం తీసుకున్నారు, పవన్ కళ్యాణ్...
అన్న మెగాస్టార్ చిరంజీవి ఒక రకంగా రాజకీయాలలోకి వస్తే, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రకంగా రాజకీయాలలోకి వచ్చారు. అయితే అన్న కాస్త సమయం తీసుకున్నారు. తమ్ముడు అది కూడా తీసుకోలేదు. అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో కలిపేశారు. తమ్ముడు ప్రజాసేన పేరుతో మరో పార్టీని ప్రకటించారు. అన్న తిరుపతిలో బహిరంగంగా అశేష జనవాహిని, అభిమానుల మధ్య పార్టీ పేరును ప్రకటిస్తే, తమ్ముడు హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్లో ప్రకటించారు. చిరంజీవి మెగాస్టార్‌గా వెలుగొందే సమయంలో అన్ని మతాల వారు, అన్ని వర్గాలు, కులాల ప్రజలు, అన్ని వయసుల వారు అభిమానించేవారు. చిరంజీవి అంటే పడిచ్చేవారు. ఆయన రాజకీయంగా వ్యవహరించిన తీరుతో ఆనాడు అభిమానించినవారిలో ఎక్కువ మంది చీదరించుకున్నారు. దూరమయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో రెండు బలమైన సామాజిక వర్గాలకు ప్రత్యామ్నాయంగా, బిసిల పార్టీగా వచ్చామని ప్రజారాజ్యం చెప్పుకుంది. చిరంజీవిని చూసి ఈ మాటలు చాలా మంది నమ్మారు. అందుకే పార్టీ వెంట నడిచారు. తరువాత ఆయన తన స్వలాభం కోసం పార్టీ మొత్తాన్ని ఏకంగా కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలపడం వల్ల ఎవరు లబ్డి పొందారో అందరికీ తెలిసిందే. ఏ పార్టీకైతే వ్యతిరేకంగా నిలబడి పోటీ చేశారో అదే పార్టీలో కలిసిపోవడంతో అప్పటివరకు చిరంజీవిని మెగాస్టార్‌గా అపరిమితంగా అభిమానించేవారందరూ అసహ్యించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత బలమైన ఓ సామాజిక వర్గాన్ని చిరంజీవి ఎదుర్కొంటూ నిలిచారు. బిసిలకు అండగా నిలుస్తుందని చెప్పడంతో చిరంజీవిని బిసిలు ఓ రియల్ హీరోగా చూశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టున్న ఆ సామాజిక వర్గం సహజంగానే చిరంజీవిని తమ నేతగా భావించింది. వారు గట్టిగానే చిరంజీవిని సమర్ధించారు. అండగా నిలిచారు. రాష్ట్ర రాజకీయాలను దశాబ్ధాలుగా శాసిస్తున్న రెండు బలమైన సామాజిక వర్గాలకు ప్రజారాజ్యం ప్రత్యామ్నాయమని చిరంజీవి సామాజిక వర్గం భావించింది. కానీ, అడుగడుగునా ఆయన వ్యవహరించిన తీరుతో కనీసం ఆ వర్గం వారిని కూడా ఆకట్టుకోలేక పోయారు. వారి కోసం ఏమీ చేయలేకపోయారు. ప్రజారాజ్యంపై వారితోపాటు ఎందరో పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. అభిమానులు అందరూ దూరమైపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే కనీసం ఆ సామాజిక వర్గానికి కూడా ఆయన నేతగా ఎదగలేకపోయారు. ఆయనలో నాయకత్వం లోపానికి ఇది నిదర్శనం. ఈ నేపధ్యంలో తాను ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేవాడిని కాదని, తాను అందరివాడినని చెప్పుకుంటూ తమ్ముడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. రాజకీయంగా ఏదో చేస్తాడని అందరూ ఎదురు చూశారు. ఆ తరువాత తుస్‌మనిపించారు. పార్టీ ప్రకటించిన రోజున ఆయన ప్రసంగానికి చాలా మంది ఆకర్షితులయ్యారు. అవినీతి - అన్యాయం - అరాచకాలు....కు వ్యతిరేకంగా ఆవేదన - బాధ...తో రాజకీయాలలోకి వచ్చినట్లు చెప్పారు. ఆవేశంతో చాలా మాట్లాడారు. అందరూ బాగా మాట్లాడాడని అనుకున్నారు. అనేక మంది మెచ్చుకున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతోపాటు పలువురు సినీప్రముఖులు కూడా పొగిడారు. అయితే కొందరు మాత్రం తొందరపడకుండా ఆయన ప్రసంగంలో స్పష్టతలేదన్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని పవన్ కలవడంతో పవన్ ఆలోచన కొంత బయటపడింది. ఆ తరువాత విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగం - 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఆయన బండారం మొత్తం బయటపడింది. అప్పటి వరకు ఆసక్తి చూపిన వారు ఒక్కసారిగా నిరుత్సాహానికి లోనయ్యారు. చాలా మంది ఇతనిపై ఆశలు పెట్టుకోవడం వేస్ట్ అన్న అభిప్రాయానికి వచ్చారు. సినిమా ప్రముఖులు పునరాలోచనలో పడ్డారు. రాష్ట్ర విడిపోవడం బాధించిందన్నారు. రాష్ట్రం విడిపోవడానికి మద్దతుపలికిన బిజెపి నేత మోడీని కలిశారు. అంతేకాక ఆ తరువాత మోడీకి మద్దతు పలికారు. టిడిపి వ్యవస్థాపకుడు, తన సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన 9 ఏళ్ల పాలనలో ఎన్నో అరాచకాలకు సృష్టించారు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు - బహీర్‌బాగ్ కాల్పులు... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలు నరకయాతన అనుభవించిన సంఘటనలు అనేకం. అటువంటి చంద్రబాబుకు ఇంకాస్త పాలనాసమయం ఇవ్వవలసిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో పవన్ కళ్యాణ్‌కు, ఆయన పార్టీ జనసేనకు ఒక రాజకీయ విధానం లేదన్నది స్పష్టమైపోయింది. రాజకీయాలు - ఆర్థిక వ్యవస్థ - పరిపాలన ....పట్ల ఆయనకు ఏమాత్రం అవగాహనలేదని తేటతెల్లమైంది. అన్న చిరంజీవి కాస్త సమయం తీసుకొని తుస్‌మని పిస్తే, తమ్ముడు ఎక్కువ సమయం తీసుకోకుండానే తేల్చేశారు. పవన్ కళ్యాణ్ విడుదల చేసిన 'ఇజం' రాసినవారికైనా అర్ధమవుతుందా? అని రామ్‌గోపాల్ వర్మ ప్రశ్నించారు. మరో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఘాటుగా స్పందించారు. ''ఒక అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మరో అరాచకాన్ని అరువు తెచ్చుకోవడం పోరాటం అనిపించుకోదు. దీనికి సేనతో పని లేదు. ఒక వ్యక్తిని గెలిపించండి అనడానికి ఇంత ఆవేశం అక్కర్లేదు. ఈ ఆవేశం పోరాటాలకు దాచుకుందాం. కులం, మతం, ప్రాంతం పేరుతో విధ్వంసాలను రేపి, ఎన్నికల్లో గెలవాలని చూసే ఏ వ్యక్తికి గానీ, పార్టీకి గానీ మనల్ని పాలించే అర్హత లేదు...'' అంటూ ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. -
చంద్రబాబు ఓ సైకో: షర్మిల
* పిల్లనిచ్చిన ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారు * పార్టీని అమ్మేసిన చిరంజీవికి, కాంగ్రెస్‌కు అమ్ముడుపోయిన బాబుకు పెద్ద తేడా లేదు * నెల్లూరు జిల్లా ఆత్మకూరు బహిరంగ సభలో షర్మిల ధ్వజం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘ప్రజారాజ్యం పార్టీకి ఓట్లేసిన 70 లక్షల మందిని పిచ్చివాళ్లను చేసి మంత్రి పదవి కోసం చిరంజీవి తన పార్టీని బహిరంగంగా కాంగ్రెస్‌కు అమ్మేస్తే, చంద్రబాబు నాయుడు కేసుల నుంచి తప్పించుకోవడానికి చీకట్లో చిదంబరాన్ని కలసి చీకటి ఒప్పందాలు చేసుకుని అదే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు. ఈ ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు. చంద్రబాబు మంచివాడని ఎన్టీఆర్ పిల్లనిచ్చి పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇస్తే.. చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడిచి కుర్చీని, పార్టీని, అధికారాన్ని లాక్కున్నారు. చివరకు ఆయన మీద చెప్పులు కూడా వేయించారు. ఇదీ చంద్రబాబు చరిత్ర. ఇప్పుడు చెప్పండి చంద్రబాబుకు మించిన సైకో ఎవరైనా ఉన్నారా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల ప్రశ్నించారు. రాష్ర్ట విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి తెలుగుతల్లి గొంతు కోసిన చంద్రబాబునాయుడు, చివరి క్షణం వరకు సీఎం పదవి వదలకుండా విభజనకు సహకరించి తెలుగుతల్లికి వెన్నుపోటు పొడిచిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ తెలుగుజాతి ద్రోహులు, చరిత్రహీనులని విమర్శించారు. ఈ ఇద్దరు నాయకులు సీమాంధ్రలో కనపడితే తరిమితరిమి కొట్టాలన్నారు. చంద్రబాబుకు పెత్తనమిస్తే రాష్ట్రంలో మళ్లీ చంద్రగ్రహణం పడుతుందనీ, జగనన్న నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుదామని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే.. ప్రజా సంక్షేమానికి కిరణ్ పాడె కట్టారు.. * ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఎలా ఆలోచన చేయాలి.. తన ప్రజల కోసం ఎలాంటి పథకాలు రూపొందించాలని ఆలోచించిన వైఎస్సార్ అన్న ఒక్క పదం భావితరాలకు మార్గదర్శకంగా నిలిచింది. అప్పటి వరకు సుభిక్షంగా ఉన్న రాష్ర్టం ఆ ఒక్క మనిషి వెళ్లిపోవడంతో అతలాకుతలం అయ్యింది. ఆ తర్వాత ప్రభుత్వం బతికుందా చచ్చిందా అనేలా కిరణ్ వ్యవహరించారు. సంక్షేమ పథకాలకు పాడె కట్టారు. * కిరణ్ రైతులను ఏనాడూ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండా రుణాలిస్తానన్న కిరణ్ ఆ పథకం మీద తన బొమ్మ పెట్టుకుని పబ్లిసిటీ చేసుకోవడానికే వాడుకున్నారు. పేద విద్యార్థులకు ఫీజు కట్టకుండా ఆ పథకం కింద వారికి డబ్బులు ఎగ్గొట్టడానికి ఎన్నో మార్గాలు వెదుక్కున్నారు. * ఆరోగ్యశ్రీ నుంచి 133 రోగాలను, 97 ఆస్పత్రులను తొలగించారు. పక్కా ఇళ్ల పథకానికి పాడె కట్టిన కిరణ్ ఒక్క కొత్త ఇల్లు మంజూరు చేయకపోగా, వైఎస్ హయాంలో మంజూరైన ఇళ్లకే బిల్లులు చెల్లించలేదు. తొమ్మిదేళ్లూ ఏం చేశావ్ చంద్రబాబూ? * చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన రాక్షస రాజ్యాన్ని తలపిస్తుంది. అంగన్ వాడీ మహిళలు జీతాలు పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించారు. విద్యార్థులు స్కాలర్షిప్లు పెంచాలని కోరితే కనీసం మెస్‌చార్జీలు కూడా పెంచలేదు. ఊళ్లో పింఛన్ పొందుతున్న వారిలో ఎవరైనా చనిపోతేనే.. వారి స్థానంలో కొత్తవారికి పింఛన్ ఇచ్చేవారు. * చంద్రబాబు 8 సంవత్సరాల్లో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. కరువు కాలంలో తాము కట్టలేమంటూ ఎవరైనా అంటే.. చార్జీలు వసూలు చేయడానికి ప్రత్యేక కోర్టులు పెట్టి, రైతుల మీద కేసులు పెట్టారు. కరెంటు చార్జీలు కట్టలేని వారి ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోయారు. రైతులు ఇంట్లో లేకపోతే ఆడవాళ్లను పోలీసు స్టేషన్లకు తీసుకుపోతే అవమానంతో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. * కరెంటు చార్జీలు తగ్గించాలని వైఎస్ఆర్ 8 రోజులు నిరాహార దీక్షలు చేస్తే చంద్రబాబు పోలీసు కాల్పులు జరిపించారు. కాల్పుల్లో నలుగురు సామాన్యులు చనిపోతే వారి కుటుంబాలను కాకుండా కాల్పులు జరిపిన పోలీసులను పరామర్శించిన చరిత్ర చంద్రబాబుది. సోనియా.. మా ప్రజల ఉసురు తగులుతుంది * సోనియాగాంధీ తన కొడుకు భవిష్యత్తు కోసం ఆరుకోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ఆడుకున్నారు. ఈ ప్రజల ఉసురు తగిలి నీవు బాగుపడతావా? శ్రీకృష్ణ కమిటీ విభజన వద్దని చెప్పినా ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించారు? రైతులకు నీరు, యువతకు ఉద్యోగాలు, కొత్త రాజధాని ఎక్కడ ఇస్తారో కూడా చెప్పకుండా పార్లమెంటు తలుపులు వేసుకుని రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజిస్తే బీజేపీ కూడా మద్దతు పలికింది. -
సారూ.. మీరెక్కడ?
పట్టుమని ఐదు సంవత్సరాలు గడిచాయో లేదో వారి ఉనికి ఎక్కడా కనిపించడం లేదు. కిందటి సార్వత్రిక ఎన్నిక ల్లో పలు రాజకీయపార్టీల ప్రతినిధులుగా పోటీ చేసిన వారు కొందరైతే, వారి విజయం కోసం కాలికి బలపం కట్టుకుని శ్రమించిన వారు మరికొందరు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో వారి ఊసే లేదు. తెరమరుగైన నేతల్లో తిరుపతి మాజీ మున్సిపల్ చెర్మైన్ కందాటి శంకర్‌రెడ్డి, ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఎన్వీ.ప్రసాద్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్, మదనపల్లె, నగరి నియోజకవర్గాల నుంచి పీఆర్పీ అభ్యర్థులుగా పోటీ చేసిన చిన్నా వాసుదేవరెడ్డి, వర్మ సహా మరికొందరు ఉన్నారు. దాటి కనుమరుగు తిరుపతి నగరంలో కందాటి శంకర్‌రెడ్డి గతంలో ఒక వెలుగు వెలిగారు. మున్సిపల్ చైర్మన్‌గాను, తుడా చైర్మన్‌గాను ఆయన వ్యవహరించారు. అటువంటి నేత ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. కిందటి ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ తరువాత రాజకీయాలకు అంటీముట్టనట్టుగా ఉంటూ వచ్చారు. అయితే తిరుపతి శాసనసభ స్థానానికి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పంచన చేరారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా కందాటి నివాసానికి వెళ్లి మరీ పార్టీలో చేర్చుకున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్ని ఇచ్చాయి. ఇక అంతే సంగతులు. అప్పటి నుంచి కందాటి కనుమరుగయ్యారనే చెప్పాలి. కేవలం వ్యక్తిగత వ్యవహారాలకు పరిమితమయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్వీ ప్రసాద్ ఎక్కడ? హిట్ చిత్రాల నిర్మాతగా సుపరిచితుడైన ఎన్వీ.ప్రసాద్ పేరు 2009 ఎన్నికల ముందు జిల్లాలో ప్రముఖంగా వినిపించింది. చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభ తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఆ సభ ఏర్పాట్లు, నిర్వహణ మొత్తం ఎన్వీ.ప్రసాద్ కనుసన్నల్లోనే జరిగాయి. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి చిరంజీవి పోటీ చేయకపోతే ఎన్వీ.ప్రసాద్ గాని ఆయన సతీమణి మహాలక్ష్మి గాని పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల ముందు ప్రజారాజ్యం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులుగా ఎన్వీ.మహాలక్ష్మి నియామకం జరిగింది. అయితే చిరంజీవి ఇక్కడి నుంచి శాసనసభకు ఎన్నిక అయినప్పటికీ రాష్ట్రస్థాయిలో ఫలితాలు సాధించడంలో ఆ పార్టీ చతికిలపడింది. దీంతోపాటు చిరంజీవి, ఎన్వీల నడుమ స్పర్థలు వచ్చాయన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తరువాత కొద్ది రోజులకు రాజకీయ వైరాగ్యానికి గురైన ఎన్వీ వ్యాపార కార్యక్రమాలకు పరిమితమయ్యారు. ఎన్ఆర్ఐగా రంగంలోకి దిగి.. యూఎస్‌లో ఎన్ఆర్ఐగా ఉంటూ పారిశ్రామికవేత్తగా పేరుగాంచిన చిన్నా వాసుదేవరెడ్డి కిందటి ఎన్నికల్లో మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వాసుదేవరెడ్డి పేరు జిల్లాలో హల్చల్ చేసింది. ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన మదనపల్లెకు ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే వచ్చారు. అప్పుడు కూడా ప్రైవేటు వ్యవహారాలకు పరిమితమయ్యారు. కాగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్ కిందటి ఎన్నికల్లో పీఆర్పీ తర ఫున కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన జాడ కూడా కనిపించడం లేదు. అదేవిధంగా నగరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పీఆర్పీ అభ్యర్థులు కూడా రాజకీయాల్లో రాణించలేక వైరాగ్యంలో ఉన్నారు. -
రాజకీయ భవిష్యత్‌పై చిరంజీవికి బెంగ?
హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ....ఆనక కాంగ్రెస్‌తో చేయికలిపి కేంద్రమంత్రి పదవి దక్కించుకున్న చిరంజీవికి ప్రస్తుతం రాజకీయ భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది. ఆటలో అరటిపండుగా మారిన ఆయన తన రాజకీయ భవిష్యత్ గురించి చెందుతున్నారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లే పరిస్థితి ఏర్పడడంతో ఇక ఆ పార్టీతో కలిసి పనిచేయద్దంటూ సన్నిహితులు ఆయనకు సలహా ఇస్తున్నారు. మునిగిపోయే పడవలో ప్రయాణించవద్దని వారంతా చిరంజీవికు చెప్పినట్టు సమాచారం. దాంతో పునరాలోచనలో పడిన ఆయన... తిరిగి పార్టీని పునరుద్ధరించాలా? లేదా కాంగ్రెస్‌లోనే కొనసాగాలా? లేక మరోపార్టీలో చేరాలా అన్నదానిపై కూడా సన్నిహితుల అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూలు విడదలయ్యేలోపు దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి శుక్రవారం తన నివాసంలో పాత ప్రజారాజ్యం పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. -
రసకందాయంలో ‘బాలరాజ’కీయం
=అధిష్టానంపై విధేయత యత్నం =తాడో పేడోకి సిద్ధం =రసకందాయంలో ‘బాలరాజ’కీయం విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి: చాలాకాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావు లక్ష్యంగా అసమ్మతి రాజకీయం నడిపే ప్రయత్నం చేసిన మంత్రి బాలరాజు ఒక్కసారిగా తన టార్గెట్ మార్చారు. అనూహ్యంగా ఆయన సోమవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై బహిరంగ యుద్ధం ప్రకటించారు. పార్టీ విధేయులను సీఎం అణగదొక్కుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ చర్యతో బాల రాజు సీఎంతో నేరుగా సమరానికి సిద్ధమయ్యారు. కిర ణ్‌కుమార్‌రెడ్డి సీ ఎం అయినప్పట్నుంచి బాలరాజు ఆ యనకు జిల్లాలో ముఖ్యుడిగా మెలిగారు. తద్వారా తన నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల అభివద్ధి పనులు మంజూరు చేయించుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో కలసిపోవడం, ఆ పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు మంత్రి కావడంతో జిల్లాలో బాలరాజుకు కష్టాలు మొదలయ్యాయి. గంటా దూకుడుకు బాలరాజు తట్టుకోలేక పోయారు. పార్టీకి విధేయుడిగా ఉన్న తనను గంటా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనీ, పార్టీలో, జిల్లా అధికార యంత్రాంగంలో ఆయన ఆధిపత్యం తీవ్రమైందని బాలరాజు పలుమార్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ మధ్యలో గంటాకు ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి. దీంతో జిల్లా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం గంటాకు పెద్ద పీట వేస్తూ వచ్చారు. జిల్లా వ్యవహారాల్లో సైతం గంటా చెప్పిందే జరుగుతూ వచ్చింది. ఇవన్నీ బాలరాజు, గంటా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తెచ్చాయి. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో సైతం ఒకరు అవునంటే మరొకరు కాదనే తీరుకు వచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైన సమయంలో గంటా పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించే వైఖరి అందుకున్నారు. దీంతో బాలరాజు షరామామూలుగానే పార్టీ విధేయత వాదన మొదలెట్టారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా డ్రామాలు ఆడేవాడిని కాదనీ, అధిష్టానం అభీష్టం మేరకే నడుచుకుంటానని ప్రకటించారు. తన వ్యతిరేకిని ప్రోత్సహిస్తున్నారని సీఎం మీద ఎప్పట్నుంచో కారాలు, మిరియాలు నూరుతున్న ఆయన సమైక్యాంధ్ర వ్యవహారంలో సీఎం తీరును కూడా ఎండగడుతూ వచ్చారు. పార్టీ వ్యతిరేకులతో తాను చేతులు కలిపేది లేదనే నినాదంతో జిల్లాలో సీఎం ఎన్ని సార్లు పర్యటించినా డుమ్మా కొడుతూ వచ్చారు. ఇటీవల చోడవరంలో జరిగిన రచ్చబండ బహిరంగ సభకు కూడా ముఖం చాటేశారు. రచ్చబండలో తన శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ గిరిజనుడు అయినందువల్లే సీఎం కార్యాలయం తనకు కనీస సమాచారం ఇవ్వలేదని బహిరంగ విమర్శలకు దిగారు. రచ్చబండ సభలో టీడీపీ ఎమ్మెల్యే రాజు పాల్గొని సీఎంను, గంటాను వీరులు, శూరులు, విక్రమార్కులని కీర్తించడం బాలరాజుకు మండేలా చేసింది. పార్టీ వ్యతిరేకులంతా ఒక చోట చేరి ప్రభుత్వ కార్యక్రమంలో ఒకరినొకరు కీర్తించుకునేందుకే పరిమితమయ్యారని బాలరాజు విమర్శలకు దిగారు. నెలాఖరులో తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించవచ్చనే ఊహాగానాలు బయల్దేరాయి. ఇదే మంచి తరుణమనుకున్న బాలరాజు రాబోయే రోజుల్లో జిల్లా కాంగ్రెస్‌లో చక్రం తిప్పేందుకు సీఎంనే టార్గెట్ చేశారు. నాలుగైదు రోజులుగా జిల్లాలోని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన చర్చలు జరిపారు. ఆ తర్వాతే బాలరాజు మంత్రి గంటాను కాకుండా సీఎం కిరణ్‌నే లక్ష్యంగా చేసుకుని రాజకీయ యుద్ధానికి దిగడం ప్రయోజనం కలిగిస్తుందనే అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ కోణంలోనే ఆయన సోమవారం సీఎంపై నేరుగా రాజకీయ పోరాటానికి దిగినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ పరిణామాలు మరింత రసవత్తర అంకానికి తెరలేపబోతున్నాయని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.