పట్టుమని ఐదు సంవత్సరాలు గడిచాయో లేదో వారి ఉనికి ఎక్కడా కనిపించడం లేదు. కిందటి సార్వత్రిక ఎన్నిక ల్లో పలు రాజకీయపార్టీల ప్రతినిధులుగా పోటీ చేసిన వారు కొందరైతే, వారి విజయం కోసం కాలికి బలపం కట్టుకుని శ్రమించిన వారు మరికొందరు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో వారి ఊసే లేదు. తెరమరుగైన నేతల్లో తిరుపతి మాజీ మున్సిపల్ చెర్మైన్ కందాటి శంకర్‌రెడ్డి, ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఎన్వీ.ప్రసాద్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్, మదనపల్లె, నగరి నియోజకవర్గాల నుంచి పీఆర్పీ అభ్యర్థులుగా పోటీ చేసిన చిన్నా వాసుదేవరెడ్డి, వర్మ సహా మరికొందరు ఉన్నారు.
దాటి కనుమరుగు
తిరుపతి నగరంలో కందాటి శంకర్‌రెడ్డి గతంలో ఒక వెలుగు వెలిగారు. మున్సిపల్ చైర్మన్‌గాను, తుడా చైర్మన్‌గాను ఆయన వ్యవహరించారు. అటువంటి నేత ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. కిందటి ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ తరువాత రాజకీయాలకు అంటీముట్టనట్టుగా ఉంటూ వచ్చారు. అయితే తిరుపతి శాసనసభ స్థానానికి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పంచన చేరారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా కందాటి నివాసానికి వెళ్లి మరీ పార్టీలో చేర్చుకున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్ని ఇచ్చాయి. ఇక అంతే సంగతులు. అప్పటి నుంచి కందాటి కనుమరుగయ్యారనే చెప్పాలి. కేవలం వ్యక్తిగత వ్యవహారాలకు పరిమితమయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఎన్వీ ప్రసాద్ ఎక్కడ?
హిట్ చిత్రాల నిర్మాతగా సుపరిచితుడైన ఎన్వీ.ప్రసాద్ పేరు 2009 ఎన్నికల ముందు జిల్లాలో ప్రముఖంగా వినిపించింది. చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభ తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఆ సభ ఏర్పాట్లు, నిర్వహణ మొత్తం ఎన్వీ.ప్రసాద్ కనుసన్నల్లోనే జరిగాయి. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి చిరంజీవి పోటీ చేయకపోతే ఎన్వీ.ప్రసాద్ గాని ఆయన సతీమణి మహాలక్ష్మి గాని పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల ముందు ప్రజారాజ్యం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులుగా ఎన్వీ.మహాలక్ష్మి నియామకం జరిగింది. అయితే చిరంజీవి ఇక్కడి నుంచి శాసనసభకు ఎన్నిక అయినప్పటికీ రాష్ట్రస్థాయిలో ఫలితాలు సాధించడంలో ఆ పార్టీ చతికిలపడింది. దీంతోపాటు చిరంజీవి, ఎన్వీల నడుమ స్పర్థలు వచ్చాయన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తరువాత కొద్ది రోజులకు రాజకీయ వైరాగ్యానికి గురైన ఎన్వీ వ్యాపార కార్యక్రమాలకు పరిమితమయ్యారు.
ఎన్‌ఆర్‌ఐగా రంగంలోకి దిగి..
యూఎస్‌లో ఎన్‌ఆర్‌ఐగా ఉంటూ పారిశ్రామికవేత్తగా పేరుగాంచిన చిన్నా వాసుదేవరెడ్డి కిందటి ఎన్నికల్లో మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వాసుదేవరెడ్డి పేరు జిల్లాలో హల్‌చల్ చేసింది. ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన మదనపల్లెకు ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే వచ్చారు. అప్పుడు కూడా ప్రైవేటు వ్యవహారాలకు పరిమితమయ్యారు. కాగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్ కిందటి ఎన్నికల్లో పీఆర్పీ తర ఫున కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన జాడ కూడా కనిపించడం లేదు. అదేవిధంగా నగరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పీఆర్పీ అభ్యర్థులు కూడా రాజకీయాల్లో రాణించలేక వైరాగ్యంలో ఉన్నారు.