=అధిష్టానంపై విధేయత యత్నం
=తాడో పేడోకి సిద్ధం
=రసకందాయంలో ‘బాలరాజ’కీయం
విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి: చాలాకాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావు లక్ష్యంగా అసమ్మతి రాజకీయం నడిపే ప్రయత్నం చేసిన మంత్రి బాలరాజు ఒక్కసారిగా తన టార్గెట్ మార్చారు. అనూహ్యంగా ఆయన సోమవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై బహిరంగ యుద్ధం ప్రకటించారు. పార్టీ విధేయులను సీఎం అణగదొక్కుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ చర్యతో బాల రాజు సీఎంతో నేరుగా సమరానికి సిద్ధమయ్యారు. కిర ణ్‌కుమార్‌రెడ్డి సీ ఎం అయినప్పట్నుంచి బాలరాజు ఆ యనకు జిల్లాలో ముఖ్యుడిగా మెలిగారు. తద్వారా తన నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల అభివద్ధి పనులు మంజూరు చేయించుకున్నారు.
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో కలసిపోవడం, ఆ పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు మంత్రి కావడంతో జిల్లాలో బాలరాజుకు కష్టాలు మొదలయ్యాయి. గంటా దూకుడుకు బాలరాజు తట్టుకోలేక పోయారు. పార్టీకి విధేయుడిగా ఉన్న తనను గంటా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనీ, పార్టీలో, జిల్లా అధికార యంత్రాంగంలో ఆయన ఆధిపత్యం తీవ్రమైందని బాలరాజు పలుమార్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ మధ్యలో గంటాకు ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి. దీంతో జిల్లా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం గంటాకు పెద్ద పీట వేస్తూ వచ్చారు. జిల్లా వ్యవహారాల్లో సైతం గంటా చెప్పిందే జరుగుతూ వచ్చింది.
ఇవన్నీ బాలరాజు, గంటా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తెచ్చాయి. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో సైతం ఒకరు అవునంటే మరొకరు కాదనే తీరుకు వచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైన సమయంలో గంటా పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించే వైఖరి అందుకున్నారు. దీంతో బాలరాజు షరామామూలుగానే పార్టీ విధేయత వాదన మొదలెట్టారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా డ్రామాలు ఆడేవాడిని కాదనీ, అధిష్టానం అభీష్టం మేరకే నడుచుకుంటానని ప్రకటించారు.
తన వ్యతిరేకిని ప్రోత్సహిస్తున్నారని సీఎం మీద ఎప్పట్నుంచో కారాలు, మిరియాలు నూరుతున్న ఆయన సమైక్యాంధ్ర వ్యవహారంలో సీఎం తీరును కూడా ఎండగడుతూ వచ్చారు. పార్టీ వ్యతిరేకులతో తాను చేతులు కలిపేది లేదనే నినాదంతో జిల్లాలో సీఎం ఎన్ని సార్లు పర్యటించినా డుమ్మా కొడుతూ వచ్చారు. ఇటీవల చోడవరంలో జరిగిన రచ్చబండ బహిరంగ సభకు కూడా ముఖం చాటేశారు. రచ్చబండలో తన శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ గిరిజనుడు అయినందువల్లే సీఎం కార్యాలయం తనకు కనీస సమాచారం ఇవ్వలేదని బహిరంగ విమర్శలకు దిగారు.
రచ్చబండ సభలో టీడీపీ ఎమ్మెల్యే రాజు పాల్గొని సీఎంను, గంటాను వీరులు, శూరులు, విక్రమార్కులని కీర్తించడం బాలరాజుకు మండేలా చేసింది. పార్టీ వ్యతిరేకులంతా ఒక చోట చేరి ప్రభుత్వ కార్యక్రమంలో ఒకరినొకరు కీర్తించుకునేందుకే పరిమితమయ్యారని బాలరాజు విమర్శలకు దిగారు. నెలాఖరులో తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించవచ్చనే ఊహాగానాలు బయల్దేరాయి. ఇదే మంచి తరుణమనుకున్న బాలరాజు రాబోయే రోజుల్లో జిల్లా కాంగ్రెస్‌లో చక్రం తిప్పేందుకు సీఎంనే టార్గెట్ చేశారు.
నాలుగైదు రోజులుగా జిల్లాలోని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన చర్చలు జరిపారు. ఆ తర్వాతే బాలరాజు మంత్రి గంటాను కాకుండా సీఎం కిరణ్‌నే లక్ష్యంగా చేసుకుని రాజకీయ యుద్ధానికి దిగడం ప్రయోజనం కలిగిస్తుందనే అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ కోణంలోనే ఆయన సోమవారం సీఎంపై నేరుగా రాజకీయ పోరాటానికి దిగినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ పరిణామాలు మరింత రసవత్తర అంకానికి తెరలేపబోతున్నాయని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
రసకందాయంలో ‘బాలరాజ’కీయం
Published Tue, Nov 19 2013 1:47 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement