చిరంజీవి కాస్త సమయం తీసుకున్నారు, పవన్ కళ్యాణ్...
అన్న మెగాస్టార్ చిరంజీవి ఒక రకంగా రాజకీయాలలోకి వస్తే, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రకంగా రాజకీయాలలోకి వచ్చారు. అయితే అన్న కాస్త సమయం తీసుకున్నారు. తమ్ముడు అది కూడా తీసుకోలేదు. అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపేశారు. తమ్ముడు ప్రజాసేన పేరుతో మరో పార్టీని ప్రకటించారు. అన్న తిరుపతిలో బహిరంగంగా అశేష జనవాహిని, అభిమానుల మధ్య పార్టీ పేరును ప్రకటిస్తే, తమ్ముడు హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్‌లో ప్రకటించారు. చిరంజీవి మెగాస్టార్గా వెలుగొందే సమయంలో అన్ని మతాల వారు, అన్ని వర్గాలు, కులాల ప్రజలు, అన్ని వయసుల వారు అభిమానించేవారు. చిరంజీవి అంటే పడిచ్చేవారు. ఆయన రాజకీయంగా వ్యవహరించిన తీరుతో ఆనాడు అభిమానించినవారిలో ఎక్కువ మంది చీదరించుకున్నారు. దూరమయ్యారు.
రాష్ట్ర రాజకీయాల్లో రెండు బలమైన సామాజిక వర్గాలకు ప్రత్యామ్నాయంగా, బిసిల పార్టీగా వచ్చామని ప్రజారాజ్యం చెప్పుకుంది. చిరంజీవిని చూసి ఈ మాటలు చాలా మంది నమ్మారు. అందుకే పార్టీ వెంట నడిచారు. తరువాత ఆయన తన స్వలాభం కోసం పార్టీ మొత్తాన్ని ఏకంగా కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలపడం వల్ల ఎవరు లబ్డి పొందారో అందరికీ తెలిసిందే. ఏ పార్టీకైతే వ్యతిరేకంగా నిలబడి పోటీ చేశారో అదే పార్టీలో కలిసిపోవడంతో అప్పటివరకు చిరంజీవిని మెగాస్టార్గా అపరిమితంగా అభిమానించేవారందరూ అసహ్యించుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత బలమైన ఓ సామాజిక వర్గాన్ని చిరంజీవి ఎదుర్కొంటూ నిలిచారు. బిసిలకు అండగా నిలుస్తుందని చెప్పడంతో చిరంజీవిని బిసిలు ఓ రియల్ హీరోగా చూశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టున్న ఆ సామాజిక వర్గం సహజంగానే చిరంజీవిని తమ నేతగా భావించింది. వారు గట్టిగానే చిరంజీవిని సమర్ధించారు. అండగా నిలిచారు. రాష్ట్ర రాజకీయాలను దశాబ్ధాలుగా శాసిస్తున్న రెండు బలమైన సామాజిక వర్గాలకు ప్రజారాజ్యం ప్రత్యామ్నాయమని చిరంజీవి సామాజిక వర్గం భావించింది. కానీ, అడుగడుగునా ఆయన వ్యవహరించిన తీరుతో కనీసం ఆ వర్గం వారిని కూడా ఆకట్టుకోలేక పోయారు. వారి కోసం ఏమీ చేయలేకపోయారు. ప్రజారాజ్యంపై వారితోపాటు ఎందరో పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. అభిమానులు అందరూ దూరమైపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే కనీసం ఆ సామాజిక వర్గానికి కూడా ఆయన నేతగా ఎదగలేకపోయారు. ఆయనలో నాయకత్వం లోపానికి ఇది నిదర్శనం.
ఈ నేపధ్యంలో తాను ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేవాడిని కాదని, తాను అందరివాడినని చెప్పుకుంటూ తమ్ముడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. రాజకీయంగా ఏదో చేస్తాడని అందరూ ఎదురు చూశారు. ఆ తరువాత తుస్మనిపించారు. పార్టీ ప్రకటించిన రోజున ఆయన ప్రసంగానికి చాలా మంది ఆకర్షితులయ్యారు. అవినీతి - అన్యాయం - అరాచకాలు....కు వ్యతిరేకంగా ఆవేదన - బాధ...తో రాజకీయాలలోకి వచ్చినట్లు చెప్పారు. ఆవేశంతో చాలా మాట్లాడారు. అందరూ బాగా మాట్లాడాడని అనుకున్నారు. అనేక మంది మెచ్చుకున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మతోపాటు పలువురు సినీప్రముఖులు కూడా పొగిడారు. అయితే కొందరు మాత్రం తొందరపడకుండా ఆయన ప్రసంగంలో స్పష్టతలేదన్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని పవన్ కలవడంతో పవన్ ఆలోచన కొంత బయటపడింది. ఆ తరువాత విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగం - 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఆయన బండారం మొత్తం బయటపడింది. అప్పటి వరకు ఆసక్తి చూపిన వారు ఒక్కసారిగా నిరుత్సాహానికి లోనయ్యారు. చాలా మంది ఇతనిపై ఆశలు పెట్టుకోవడం వేస్ట్ అన్న అభిప్రాయానికి వచ్చారు. సినిమా ప్రముఖులు పునరాలోచనలో పడ్డారు.
రాష్ట్ర విడిపోవడం బాధించిందన్నారు. రాష్ట్రం విడిపోవడానికి మద్దతుపలికిన బిజెపి నేత మోడీని కలిశారు. అంతేకాక ఆ తరువాత మోడీకి మద్దతు పలికారు. టిడిపి వ్యవస్థాపకుడు, తన సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన 9 ఏళ్ల పాలనలో ఎన్నో అరాచకాలకు సృష్టించారు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు - బహీర్బాగ్ కాల్పులు... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలు నరకయాతన అనుభవించిన సంఘటనలు అనేకం. అటువంటి చంద్రబాబుకు ఇంకాస్త పాలనాసమయం ఇవ్వవలసిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో పవన్ కళ్యాణ్కు, ఆయన పార్టీ జనసేనకు ఒక రాజకీయ విధానం లేదన్నది స్పష్టమైపోయింది. రాజకీయాలు - ఆర్థిక వ్యవస్థ - పరిపాలన ....పట్ల ఆయనకు ఏమాత్రం అవగాహనలేదని తేటతెల్లమైంది. అన్న చిరంజీవి కాస్త సమయం తీసుకొని తుస్మని పిస్తే, తమ్ముడు ఎక్కువ సమయం తీసుకోకుండానే తేల్చేశారు.
పవన్ కళ్యాణ్ విడుదల చేసిన 'ఇజం' రాసినవారికైనా అర్ధమవుతుందా? అని రామ్గోపాల్ వర్మ ప్రశ్నించారు. మరో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఘాటుగా స్పందించారు. ''ఒక అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మరో అరాచకాన్ని అరువు తెచ్చుకోవడం పోరాటం అనిపించుకోదు. దీనికి సేనతో పని లేదు. ఒక వ్యక్తిని గెలిపించండి అనడానికి ఇంత ఆవేశం అక్కర్లేదు. ఈ ఆవేశం పోరాటాలకు దాచుకుందాం. కులం, మతం, ప్రాంతం పేరుతో విధ్వంసాలను రేపి, ఎన్నికల్లో గెలవాలని చూసే ఏ వ్యక్తికి గానీ, పార్టీకి గానీ మనల్ని పాలించే అర్హత లేదు...'' అంటూ ఆయన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.