చంద్రబాబు ఓ సైకో: షర్మిల | Chandrababu naidu a psycho, criticises sharmila | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఓ సైకో: షర్మిల

Published Tue, Mar 18 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

Chandrababu naidu a psycho, criticises sharmila

* పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచారు
* పార్టీని అమ్మేసిన చిరంజీవికి, కాంగ్రెస్‌కు అమ్ముడుపోయిన బాబుకు పెద్ద తేడా లేదు
* నెల్లూరు జిల్లా ఆత్మకూరు బహిరంగ సభలో షర్మిల ధ్వజం

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘ప్రజారాజ్యం పార్టీకి ఓట్లేసిన 70 లక్షల మందిని పిచ్చివాళ్లను చేసి మంత్రి పదవి కోసం చిరంజీవి తన పార్టీని బహిరంగంగా కాంగ్రెస్‌కు అమ్మేస్తే, చంద్రబాబు నాయుడు కేసుల నుంచి తప్పించుకోవడానికి చీకట్లో చిదంబరాన్ని కలసి చీకటి ఒప్పందాలు చేసుకుని అదే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు. ఈ ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు. చంద్రబాబు మంచివాడని ఎన్‌టీఆర్ పిల్లనిచ్చి పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇస్తే.. చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడిచి కుర్చీని, పార్టీని, అధికారాన్ని లాక్కున్నారు. చివరకు ఆయన మీద చెప్పులు కూడా వేయించారు. ఇదీ చంద్రబాబు చరిత్ర. ఇప్పుడు చెప్పండి చంద్రబాబుకు మించిన సైకో ఎవరైనా ఉన్నారా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల ప్రశ్నించారు.
 
 రాష్ర్ట విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి తెలుగుతల్లి గొంతు కోసిన చంద్రబాబునాయుడు, చివరి క్షణం వరకు సీఎం పదవి వదలకుండా విభజనకు సహకరించి తెలుగుతల్లికి వెన్నుపోటు పొడిచిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ తెలుగుజాతి ద్రోహులు, చరిత్రహీనులని విమర్శించారు. ఈ ఇద్దరు నాయకులు సీమాంధ్రలో కనపడితే తరిమితరిమి కొట్టాలన్నారు. చంద్రబాబుకు పెత్తనమిస్తే రాష్ట్రంలో మళ్లీ చంద్రగ్రహణం పడుతుందనీ, జగనన్న నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుదామని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
 
 ప్రజా సంక్షేమానికి కిరణ్ పాడె కట్టారు..
 *    ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఎలా ఆలోచన చేయాలి.. తన ప్రజల కోసం ఎలాంటి పథకాలు రూపొందించాలని ఆలోచించిన వైఎస్సార్ అన్న ఒక్క పదం భావితరాలకు మార్గదర్శకంగా నిలిచింది. అప్పటి వరకు సుభిక్షంగా ఉన్న రాష్ర్టం ఆ ఒక్క మనిషి వెళ్లిపోవడంతో అతలాకుతలం అయ్యింది. ఆ తర్వాత  ప్రభుత్వం బతికుందా చచ్చిందా అనేలా కిరణ్ వ్యవహరించారు. సంక్షేమ పథకాలకు పాడె కట్టారు.
 *     కిరణ్ రైతులను ఏనాడూ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండా రుణాలిస్తానన్న కిరణ్ ఆ పథకం మీద తన బొమ్మ పెట్టుకుని పబ్లిసిటీ చేసుకోవడానికే వాడుకున్నారు. పేద విద్యార్థులకు ఫీజు కట్టకుండా ఆ పథకం కింద వారికి డబ్బులు ఎగ్గొట్టడానికి ఎన్నో మార్గాలు వెదుక్కున్నారు.
 *     ఆరోగ్యశ్రీ నుంచి 133 రోగాలను, 97 ఆస్పత్రులను తొలగించారు. పక్కా ఇళ్ల పథకానికి పాడె కట్టిన కిరణ్ ఒక్క కొత్త ఇల్లు మంజూరు చేయకపోగా, వైఎస్ హయాంలో మంజూరైన ఇళ్లకే బిల్లులు చెల్లించలేదు.
 
 తొమ్మిదేళ్లూ ఏం చేశావ్ చంద్రబాబూ?
 *     చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన రాక్షస రాజ్యాన్ని తలపిస్తుంది. అంగన్ వాడీ మహిళలు జీతాలు పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించారు. విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు పెంచాలని కోరితే కనీసం మెస్‌చార్జీలు కూడా పెంచలేదు. ఊళ్లో పింఛన్ పొందుతున్న వారిలో ఎవరైనా చనిపోతేనే.. వారి స్థానంలో కొత్తవారికి పింఛన్ ఇచ్చేవారు.
 *     చంద్రబాబు 8 సంవత్సరాల్లో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. కరువు కాలంలో తాము కట్టలేమంటూ ఎవరైనా అంటే.. చార్జీలు వసూలు చేయడానికి ప్రత్యేక కోర్టులు పెట్టి, రైతుల మీద కేసులు పెట్టారు. కరెంటు చార్జీలు కట్టలేని వారి ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోయారు. రైతులు ఇంట్లో లేకపోతే ఆడవాళ్లను పోలీసు స్టేషన్లకు తీసుకుపోతే అవమానంతో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
 *     కరెంటు చార్జీలు తగ్గించాలని వైఎస్‌ఆర్ 8 రోజులు నిరాహార దీక్షలు చేస్తే చంద్రబాబు పోలీసు కాల్పులు జరిపించారు. కాల్పుల్లో నలుగురు సామాన్యులు చనిపోతే వారి కుటుంబాలను కాకుండా కాల్పులు జరిపిన పోలీసులను పరామర్శించిన చరిత్ర చంద్రబాబుది.
 సోనియా.. మా ప్రజల ఉసురు తగులుతుంది
 * సోనియాగాంధీ తన కొడుకు భవిష్యత్తు కోసం ఆరుకోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ఆడుకున్నారు. ఈ ప్రజల ఉసురు తగిలి నీవు బాగుపడతావా? శ్రీకృష్ణ కమిటీ విభజన వద్దని చెప్పినా ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించారు? రైతులకు నీరు, యువతకు ఉద్యోగాలు, కొత్త రాజధాని ఎక్కడ ఇస్తారో కూడా చెప్పకుండా పార్లమెంటు తలుపులు వేసుకుని రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజిస్తే బీజేపీ కూడా మద్దతు పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement