ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు.. స్థానం వేరు చిరంజీవి సినిమారంగంలో ఒక లెజెండ్. ఆయన తుపాన్‌లా రాలేదు. చిరు జల్లులా వచ్చి తుపాన్‌లా మారాడు. ఆయన 'స్వయంకృషి'తో ఎదిగిన నటుడు. తన యాక్షన్, డ్యాన్స్‌లతో ఎందరిలోనో స్ఫూర్తినింపిన 'ఆచార్యు'డు. ఇండస్ట్రీలో ఎదురైన ప్రతి 'ఛాలెంజ్' లను 'మగధీరుడు' లాగా ఎదుర్కుంటూ 'విజేత'గా నిలిచిన 'మగమహారాజు' . అభిమానుల గుండెల్లో ఆయనొక 'ఖైదీ'. బాక్సాఫీసు వసూళ్ల 'వేట'లో 'ఛాలెంజ్' విసిరితే 'రోషగాడి'లా 'జాతర' చూపించాడు.
సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తున్నారు.. వస్తూనే ఉంటారు కూడా.. అలాంటి వాల్లకు ఒక్కరే స్ఫూర్తి ఆయనే మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ప్రత్యేక కథనం. చిరంజీవి సినిమాలు ఫెయిల్ అయి ఉండవచ్చు. కానీ ఇండస్ట్రీలో చిరంజీవి ఎప్పుడూ ఫెయిల్ అవలేదు. ఇప్పటి తరం ట్విటర్‌లో ఫ్యాన్ వార్ చేసుకునే వారికి తెలియకపోవచ్చు అప్పట్లో కవర్‌పేజీలో వచ్చే చిరంజీవి ఫోటో కోసం అభిమానుల మధ్య జరిగే వార్ గురించి.
ఇప్పడు మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పుకుని తిరిగేవారికి తెలియకపోవచ్చు వాళ్ల హీరోలకు కూడా ఫేవరేట్ హీరో చిరంజీవే అని.. మా హీరో రికార్టులు ఇవి అని గొప్పలు చెప్పుకునే వారికి తెలియకపోవచ్చు ఆ రికార్డులను క్రియేట్ చేసిందే చిరంజీవి అని. ఒక రిక్షా కార్మికుడి నుంచి కలెక్టర్ వరకు.. అప్పుడే సినిమాలు చూడటం మొదలుపెట్టిన 10 ఏళ్ల బుడ్డోడి నుంచి 70 ఏళ్ల ముసలోళ్ల దాక అందరూ ఆయన ఫ్యాన్సే.. నటనలో తనకంటూ ప్రత్యేక శైలి, హాస్యంలో తనకంటూ ఒక ముద్ర..కోట్లాదిమందికి అతనొక ఆరాధ్య నటుడు అయ్యాడు.
ఫిబ్రవరి 11, 1978 లో పునాదిరాళ్ళు చిత్రంతో సినీ ప్రస్థానం మెదలుపెట్టిన మెగాస్టార్. పునాదిరాళ్ళు మొదటి చిత్రం అయినప్పటికీ మొదటగా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. తొలి సినిమానే ప్లాప్ అయింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి మాత్రం అందరినీ మెప్పించాడు. తర్వాత బాపు దర్శకత్వంలో 'మన వూరి పాండవులు' సినిమాలో చిరంజీవికి ఒక చిన్న పాత్ర దొరికింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు చిరుకు మంచి గుర్తింపు తెచ్చింది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది.
మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమా ఇదే
మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలతో పాటు విలన్‌గా నటించిన చిరంజీవికి ఒక నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. కానీ 1980 వ దశకం నుంచి ఆయనకు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. 1980లో వచ్చిన 'మొగుడు కావాలి' సినిమా చిరంజీవికి మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డుకెక్కింది. ఈ సినిమాను తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు. ఆ సమయం నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
'చిరంజీవి-ఎన్టీఆర్'కు ప్రత్యేకం
ఆ తర్వాత వచ్చిన 'తిరుగులేని మనిషి' చిత్రం తన కెరియర్‌లో చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. అందులో 'చిరంజీవి-ఎన్టీఆర్' కలిసి నటించిన ఏకైకా సినిమా ఇది. ఎన్టీఆర్ ప్రధాన పాత్ర చేస్తే.. చిరంజీవి ఆయన బావమరిది పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత 'ఊరికిచ్చిన మాట' సినిమాతో చిరంజీవికి మాస్ ఇమేజ్ బీజం పడినా.. ఆ తర్వాత 'చట్టానికి కళ్లులేవు' చిత్రంతో పూర్తి మాస్ హీరోగా గుర్తింపు దక్కింది. ఈ సినిమాను తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు.
1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా వచ్చింది. ఇది కూడా సిల్వర్ జూబ్లీ లిస్ట్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లో కట్నం అనే ఇష్యూ మీది శుభలేఖ అనే సినిమాను తీశారు. ఈ రెండు సినిమాలతో చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఓన్ చేసుకున్నారు. శుభలేఖ సినిమాతో మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును చిరు అందుకున్నారు. ఇలా చిరంజీవి నుంచి వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలుస్తున్న సమయంలో అసలు సెన్సేషన్ 1983లో మొదలైంది.
ఇండస్ట్రీలో సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసిన చిరు సినిమా
కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో ఖైదీ సినిమా 1983లో విడుదలైంది. అప్పట్లో కమర్షియల్ సినిమాలకు సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ శైలజా థియేటర్లో 80రోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో కొనసాగింది ఈ సినిమా.. హైదరాబాద్ శాంతి థియేటర్లో 365 రోజులు ఏకదాటిగా కొనసాగింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి, మాధవిలపై సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు..
ఒక యాక్టర్, స్టార్‌కు మధ్య ఉన్న గీతను చెరిపేసి చిరంజీవిని ఓవర్‌నైట్ సూపర్ స్టార్‌ను చేసింది ఈ సినిమా.. ఇందులోని చిరు లుక్‌నే రామ్‌చరణ్ మొదటి సినిమా చిరుతలో కూడా ఆ షాడో ఉండేలా చూపించాడు పూరి. ఇంతలా మెగస్టార్ జీవితంలో ఖైదీ సినిమా పాత్ర ఉంది. అక్కడి నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతుండగా 2007లో శంకర్ దాదా జిందాబాద్‌తో సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి ఎంట్రీ
2008 ఆగష్టు 26న ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించారు. తిరుపతిలో చిరంజీవి పాల్గొంటున్న మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో మెగాఫ్యాన్స్ పోటెత్తారు. ఆ సభ కోసం సుమారు పది లక్షల మందికి పైగా హాజరైనట్లు సమాచారం. ఆ సభ రాత్రి 10 గంటలకి పూర్తయితే తిరుపతి నుంచి తెల్లారే వరకూ వాహనాలు వెళుతూనే వున్నాయి. కనీవినీ ఎరుగని ట్రాఫిక్ జామ్ తిరుపతిలో ఏర్పడింది. అంతవరకు ఏ సినీ, రాజకీయ నాయకుడి సభకు రానంత జనం వచ్చారు. ఈ సభలోనే చిరంజీవి పార్టీ పేరును, అజెండాను ప్రకటించారు.
ఆయన పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చే నాటికి ఉమ్మడి ఏపీలో 2004 నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి మొదటిసారి సీఎం కావడమే కాకుండా ప్రజల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వైఎస్సార్ పాలన కొనసాగింది. అలా ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ఏపీలో వైఎస్సార్ ఉన్నారు. 2009లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ పోటాపోటీగా ఉమ్మడి ఏపీలో ఉన్నాయి. అలాంటి సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం చేశారు.
అప్పటికే ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకుని మళ్లీ 2009 ఎన్నికల బరిలో ఉన్న రాజశేఖర్‌రెడ్డి గారిపైనా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన్ని దింపి చిరంజీవిని సీఎం చేయాలనే జ్వాల, కోరిక జనంలో లేవు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం నుంచి అభ్యర్థులను చిరంజీవి నిలబెట్టారు. తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి చిరు పోటీ చేయగా తిరుపతి స్థానం నుంచి మాత్రమే గెలుపొందారు.
అలా మొత్తంగా కేవలం 294 స్థానాలకు గాను 18 స్థానాలకు మాత్రమే ప్రజారాజ్యం పరిమితం అయింది. 2009 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు మరోసారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2011 ఆగష్టులో భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనమయ్యింది. ఆ పార్టీ నుంచి కేంద్రమంత్రిగా కూడా చిరంజీవి కొనసాగారు.
తిరుపతి సభ నుంచే చిరుకు మొదటి దెబ్బ
పార్టీ ఆవిర్భావ సభరోజు పది లక్షలకు మంది పైగా వచ్చిన జనం అదే తిరుపతిలో చిరంజీవి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. బస్టాండ్‌కు దగ్గర్లో మెగాస్టార్ సభ పెడితే జనం వెయ్యి మంది కూడా లేరు. అప్పుడు ఆయన ఆకాశం నుంచి ఒక్కసారిగా నేలకు దిగారు. ఆ సమయం నుంచే చిరంజీవిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సినిమా వేరు.. రాజకీయాలు వేరని చాలామంది పొలిటికల్ విశ్లేషకులు తెలిపారు.
రజనీకాంత్‌కు చిరంజీవి ఇచ్చిన సలహా
సినిమా హీరోకు ఉన్న ఇమేజ్, రాజకీయ నాయకుడి ఇమేజ్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇదే విషయాన్ని చిరంజీవి గ్రహించి రాజకీయాల్లోకి రావాలనుకున్న రజీనికాంత్, కమల్ హాసన్‌కు ఒక సూచన ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ మాత్రం ఇవ్వకండని ఆయన ఇలా సూచించారు. 'రాజకీయాల్లోకి రావాలన్న మీ ఆలోచన విరమించుకోండి. సూపర్‌స్టార్‌గా అందరివాడు అనిపించుకున్న మీరు పాలిటిక్స్‌లోకి వచ్చి చెడ్డపేరు తెచ్చుకోవద్దు. మనలాంటి వారు ఈ రాజకీయాల్లో నెగ్గాలంటే చాలా కష్టం. అందుకే రాజకీయాలు వదిలేసి మళ్లీ సినిమాల వైపు వచ్చాను. ఇక నుంచి సినిమాలే నా ఫస్ట్ లవ్.' అని చిరంజీవి అన్నారు.
2017లో రీ ఎంట్రీ
రాజకీయాల నుంచి చిరంజీవి పూర్తిగా దూరం అయి తన అభిమానుల కోసం 2017లో 'ఖైదీ 150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఒక హీరో సినిమా ప్రపంచానికి సుమారు 10 సంవత్సరాలు దూరం అయితే... అదే సమయంలో చాలామంది యంగ్ హీరోలు పోటీపడుతూ బ్లాక్‌బస్టర్ హిట్లు ఇస్తూ కొత్తకొత్త అభిమానులను సంపాధించుకుంటున్న తరుణంలో పదేళ్లు బ్రేక్ తీసుకున్న హీరో వెనక్కు వస్తే మునపటి ఇమేజ్ ఉండదని పలువురు కామెంట్లు కూడా చేశారు. అలాంటి వారందరికీ ఖైదీ 150 సినిమాతో చిరు సమాధానం చెప్పారు.
ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులను బద్ధలుచేసింది. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను నిరుత్సాహపరిచాయి. రాజకీయాల్లో చిరంజీవి ఓడిపోవచ్చు కానీ సినిమాల్లో ఎప్పటికీ మెగాస్టారే అని ఆయన సినిమా ఓపెనింగ్స్ చెప్తాయి. ఎందుకంటే నాడు చిరంజీవి ఎంట్రీతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా సమూలంగా మారిపోయింది. డ్యాన్స్‌లు, ఫైట్స్, పాటలు ఇలా అన్ని విభాగాల్లో ఆయన కొత్తదనాన్ని తీసుకొచ్చారు.
తెలుగు సినిమా ఇంకెంత వృద్ధిలోకి వెళ్లిన.. ప్రపంచం గర్వించే సినిమాలు ఇంకెన్నీ తీసినా వాటి వెనుకాల చిరంజీవి అనే ఒక మహాశక్తి పాత్ర ఎంతోకొంత ఖచ్చితంగా ఉంటుంది. చివరిగా తెలుగు సినిమాలో ఎన్ని మారినా.. ఎంతమంది వచ్చినా ఆయన స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు. భవిష్యత్‌లో మరిన్ని సూపర్ హిట్ సినిమాలు చిత్రపరిశ్రమకు అందించాలని కోరుకుంటూ పద్మ విభూషణ్ చిరంజీవికి ప్రత్యేక శుభాకాంక్షలు.
-సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment