తమ్మిలేరులో చెలరేగిన ఇసుకాసురులు
♦ 50 ట్రాక్టర్లతో వచ్చిన చింతమనేని అనుచరులు
♦ అడ్డుకున్న గ్రామస్తులు.. ట్రాక్టర్ల నిలిపివేత
గుళ్లపూడి (ముసునూరు): ప్రభుత్వ విప్, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వం ఒకవైపు ఇసుకను ఉచితంగా ఇస్తున్నామంటూ పేర్కొంటుందే తప్ప చింతమనేని దోపిడీకి మాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. ఇసుక దుమారంలో కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారుపై దాడి ఘటనను ప్రజలు మరువకముందే మళ్లీ తమ్మిలేరులో చింతమనేని ఇసుక దోపిడీని ప్రారంభించారు. ముసునూరు మండలం గుళ్లపూడి వద్ద ఉన్న తమ్మిలేరు నుంచి ఇసుక తోలకానికి తమకు అనుమతులున్నాయంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చింతమనేని అనుచరులు 50 ట్రాక్టర్లతో గుళ్లపూడి రేవు నుంచి ఇసుక తోలే ప్రయత్నాలను ఆదివారం ప్రారంభించారు.
గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై విజయ్‌కుమార్ తన సిబ్బందితో పాటు విలేకర్లతో కలసి ఇసుక ర్యాంపు వద్దకు చేరుకునేసరికి ట్రాక్టర్లతో వచ్చినవారు పలాయనం చిత్తగించారు. వారిలో కొందరిని గ్రామస్తులు నిలిపివేశారు. పోలీసులు 11 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈలోగా నూజివీడు సీఐ వి.సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్మాజిగూడేనికి చెందిన అధికార పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రితో పోలీసులకు ఫోన్‌లు చేయిస్తున్నారు. అయితే గుళ్లపూడికి చెందిన రైతులు మాత్రం ఇసుకను తీసుకెళ్లేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు.