‘పుర' పాలకులు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల పాలకవర్గాలు గురువారం కొలువుదీరాయి. చిత్తూరు తొలి మేయర్‌గా కఠారి అనురాధ ఎన్నికయ్యారు. డెప్యూటీ మేయర్‌గా సుబ్రమణ్యాన్ని ఎన్నుకున్నారు. అనురాధతో పాటు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలెక్టర్ రాంగోపాల్ ప్రమాణస్వీకారం చేయించారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యారు.
ప్రలోభాలతో పీఠాన్ని లాగేసుకుని..
మదనపల్లె మునిసిపల్ చైర్మన్ ఎన్నిక రసాభాసగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఇక్కడ 35 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 17, టీడీపీ 15 స్థానాల్లో గెలుపొందాయి. ముగ్గురు స్వతంత్రులుగా గెలిచారు. స్పష్టమైన మెజారిటీ ఉన్న వైఎస్సార్‌సీపీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలి.
అధికార పార్టీ మదనపల్లెలో పీఠాన్ని దక్కించుకునేందుకు అడ్డదారిలో నడిచింది. వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన 20, 25 వార్డు కౌన్సిలర్లు నజీరా, మహాలక్ష్మిని టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేసి తమ క్యాంపునకు తరలించారు. గురువారం మునిసిపాలిటీలోకి వచ్చిన తమ పార్టీ కౌన్సిలర్లతో మాట్లాడేందుకు ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే తిప్పారెడ్డి ప్రయత్నించారు. దీనికి టీడీపీ నేతలు అడ్డు తగిలారు. దీంతో రెండు పార్టీల కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. చివరకు ఇద్దరు కౌన్సిలర్లతో మాట్లాడారు.
కానీ వారు మాత్రం టీడీపీ చైర్మన్ అభ్యర్థి కొడవలి శివప్రసాద్‌కే మద్దతు ఇస్తామని చెప్పారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు పీఠంపై ఆశలు వదిలేశారు. ముగ్గురు స్వతంత్రులు, ఇద్దరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల మద్దతుతో టీడీపీ బలం 20కి చేరింది. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఓటును వినియోగించుకున్నా వైఎస్సార్‌సీపీ 17 మంది సభ్యులకే పరిమితమైంది. దీంతో అనివార్యంగా శివప్రసాద్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
నగరి వైఎస్సార్‌సీపీ వశం
నగరి మునిసిపల్ పీఠాన్ని వైఎస్సార్‌పీకీ దక్కించుకుంది. ఇక్కడ 27వార్డులకుగాను వైఎస్సార్‌సీపీ 11, టీడీపీ నుంచి 13 మంది కౌన్సిలర్లుగా గెలుపొందారు. ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. వీరిలో ఒకరు టీడీపీ గూటికి చేరారు. తక్కిన ఇద్దరు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారు. అయితే టీడీపీలో చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో విభేదాలు తలెత్తాయి. చైర్మన్ అభ్యర్థిగా చెండామరైను మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రకటించారు. దీంతో టీడీపీకి చెందిన 21వార్డు కౌన్సిలర్ హరిహరన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
ఎక్స్‌అఫిషియో సభ్యురాలిగా ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఓటుతో కలిపి వైఎస్సార్‌సీపీ బలం 15 మంది సభ్యులకు చేరింది. టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూడా తన ఓటును వినియోగించుకున్నా టీడీపీ బలం 14 మందికే పరిమితమైంది. దీంతో చైర్మన్ పీఠం వైఎస్సార్‌సీపీ కైవశమైంది. పుంగనూరు, పలమనేరులో సుస్పష్టమైన మెజారిటీ దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ పాలకవర్గాలను ఏర్పాటు చేసింది. శ్రీకాళహస్తి, పుత్తూరు పుర పీఠాలను టీడీపీ దక్కించుకుంది.