చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని చిత్తూరు డివిజన్ మొదటి స్థానంలో, మదనపల్లె డివిజన్ చివరి స్థానంలో నిలిచింది. మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లా 97.41 శాతం ఉత్తీర్ణత సాధించిన విషయం విదితమే. జిల్లాలోని నాలుగు విద్యాశాఖ డివిజన్లలో ఫలితాలు ఏవిధంగా వచ్చాయని సమీక్షించగా చిత్తూరు డివిజన్‌లో 98.86 శాతం, తిరుపతి డివిజన్ 97.11 శాతం, పుత్తూరు డివిజన్‌లో 96.15 శాతం, మదనపల్లె డివిజన్‌లో 95.32 శాతం ఉత్తీర్ణత సాధించింది.
గత ఏడాది కన్నా అభివృద్ధి
పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది కన్నా అభివృద్ధి కనిపించింది. విద్యాశాఖ అధికారులు అమలు చేసిన సాధన, మహాసంకల్పం, నైట్ విజన్ తరగతులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. జిల్లాలోని 66 మండలాల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. చిత్తూరు డివిజన్‌లో 15,787 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 55 మంది పరీక్షలకు గైర్హాజరు కాగా, 125 మంది ఫెయిల్ అయ్యారు. 15,607 మంది ఉత్తీర్ణత చెందారు. ఆ డివిజన్‌లో నూరు శాతం ఫలితాలను ఆరు మండలాలు సాధించాయి. ఐరాల, పెనుమూరు, పూతలపట్టు, రామకుప్పం, ఎస్‌ఆర్‌పురం, గుడిపాల మండలాల్లో వందశాతం ఫలితాలు నమోదయ్యాయి.
ఎప్పుడూ చివరనే
జిల్లాలోని మదనపల్లె డివిజన్ పదో తరగతి ఫలితాల్లో ఏటా చివరి స్థానంలో నిలవడం విమర్శలకు తావిస్తోంది. ఆ డివిజన్‌కు రెగ్యులర్ డీవైఈఓ లేకపోవడంతో పర్యవేక్షణ లోపం తలెత్తింది. ప్రస్తుతం డీవైఈఓగా ఉన్న ముస్తాక్ అహ్మద్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. ఒక వైపు డీఈఓ కార్యాలయంలోని ఏడీ1గా, మరోవైపు మదనపల్లె డీవైఈఓగా రెండు పడవలపై విధులను నిర్వహించాల్సి ఉండడంతో పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల మానిటరింగ్, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో ఈ ఏడాది పది ఫలితాల్లో మదనపల్లె డివిజన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆ డివిజన్‌లో 12,275 మంది విద్యార్థులకు గాను 11,700 మంది ఉత్తీర్ణత చెందారు. 508 మంది ఫెయిల్ కాగా, 67 మంది గైర్హాజరయ్యారు. ఆ డివిజన్ ఉత్తీర్ణత 95.32 శాతం నమోదు కావడంతో జిల్లాలోని నాలుగు డివిజన్‌లలో చివరి స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఆ డివిజన్‌లో 18 మండలాలుండగా అందులో పీటీఎం మండలం మాత్రమే 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. మిగిలిన మండలాలు 99, 98, 97, 96 ఉత్తీర్ణత సాధించాయి.
మదనపల్లె డివిజన్‌లోనే ఫెయిల్యూర్స్ అధికం
జిల్లావ్యాప్తంగా పది పరీక్షల్లో 1,364 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. జిల్లాలో నాలుగు డివిజన్లలో ఫెయిల్యూర్స్ సంఖ్య మదనపల్లె డివిజన్‌లోనే అధికంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. మదనపల్లె డివిజన్‌లో 508 మంది, తిరుపతి డివిజన్‌లో 383 మంది, పుత్తూరు డివిజన్‌లో 348 మంది, చిత్తూరు డివిజన్‌లో 125 మంది విద్యార్థులు పరీక్షలు తప్పారు. జిల్లాలోని విజయపురం, పెద్దతిప్పసముద్రం, యాదమరి, తవణంపల్లె, శాంతిపురం, ఎస్‌ఆర్‌పురం, రామకుప్పం, పూతలపట్టు, పెనుమూరు, ఐరాల, గుడిపాల మండలాల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాలేదు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఖాళీగా ఉన్న డీవైఈఓ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏళ్ల తరబడి రెగ్యులర్ డీవైఈఓలు లేకపోవడంతో విద్యాపాలన అస్తవ్యస్తంగా మారుతోంది. సీనియర్లుగా ఉన్న ఎంఈఓలకు పదోన్నతులు కల్పించి రెగ్యులర్ డీవైఈఓలుగా నియమించాలని ఎంఈఓలు డిమాండ్ చేస్తున్నారు.
పర్యవేక్షణ ముఖ్యం
ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించాల్సిన రెగ్యులర్ డీవైఈఓ లేకపోవడం సరికాదు. ఆ పోస్టులను సంవత్సరాల కొద్దీ ఎందుకు భర్తీ చేయడం లేదు? ఆ పోస్టుల్లో రెగ్యులర్ అధికారులుంటే పర్యవేక్షణ చేసి, పదో తరగతిలో మంచి ఫలితాలు రాబట్టేందుకు అవకాశం ఉండేది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అతి తక్కువగా ఉత్తీర్ణత సాధించిన మండలాల వారీగా రివ్యూ చేసి నూతన ప్రణాళికలు అమలు చేయాలి.
– సద్దామ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment