సాక్షి, చిత్తూరు : ‘చిత్తూరు అనేది ఇంటర్ స్టేట్ బోర్డర్. తమిళనాడులోని వేలూరుకు దగ్గరగా ఉన్న ప్రాంతం. మన దగ్గర 11 సరిహద్దు పోలీస్ స్టేషన్లు ఉంటే.. వేలూరు పరిధిలో 8 స్టేషన్లు ఉన్నాయి. మనందరిదీ ఒక్కటే కాన్సెప్ట్. క్రిమినల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మా వద్ద నమోదైన కేసుల్లో మోస్ట్ వాటెండ్ క్రిమినల్స్ తమిళనాడులో ఉన్నారు. వాళ్లను మాకు అప్పగిస్తే పెండింగ్ కేసులు క్లోజ్ అవుతాయి. అలాగే మా వద్ద ఎవరైనా ఉంటే మేమూ సహకరిస్తాం.
అప్పుడే క్రిమినల్స్‌ను ఏరిపారేయడానికి వీలవుతుంది..’ అని చిత్తూరు ఎస్పీ వెంకట అప్పలనాయుడు పేర్కొన్నారు. చిత్తూరు, తమిళనాడు అంతరాష్ట్ర సరిహద్దు నేర సమీక్షా సమావేశం బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వేలూరు ఎస్పీ ప్రవేష్‌కుమార్, చిత్తూరు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి, తమిళనాడుకు చెందిన పలువురు డీఎస్పీలు పాల్గొన్నారు. ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లాలో నమోదైన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో న్యాయస్థానం జారీ చేసిన అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
వారిని తమకు అప్పగించడంలో తమిళనాడు పోలీసులు సహకరించాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో బియ్యం అక్రమ రవాణా, ఇతర స్మగ్లింగ్‌ను అరికట్టడానికి రెండు జిల్లాల పోలీసులు సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సారాపై ఉక్కుపాదం మోపాలని.. దీంతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. పేరుమోసిన క్రిమినల్స్‌పై నిత్యం నిఘా ఉంచడం వల్ల నేరాలు జరగకుండా ముందుగానే నియంత్రించవచ్చన్నారు.
వేలూరు ఎస్పీ ప్రవేష్‌కుమార్ మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ వేలూరు ఎంపీ స్థానానికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో చిత్తూరు పోలీసుల సాకారం కావాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం లేకుండా చూడటంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచడం, అక్రమ మద్యం, సారాను నియంత్రించడానికి సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు ఏఎస్పీ కృష్ణార్జునరావు, జిల్లాకు చెందిన డీఎస్పీలు ఈశ్వర్‌రెడ్డి, అరీఫుల్లా, గిరిధర్, వేలూరు జిల్లా డీఎస్పీలు పళనిసెల్వం, రాజేంద్రన్, శరవనన్, మురళి, ప్రశాంత్, తేరస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment