వాళ్లు నా పెళ్లి చెడగొట్టారు: చింటూ
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ల హత్య కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. మేయర్ దంపతులు చింటూ పెళ్లిని చెడగొట్టడం కూడా హత్యకు దారితీసిన కారణాల్లో ఒకటిగా తెలుస్తుంది. ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ చిత్తూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కఠారి దంపతులను తానే హత్య చేసినట్టు చింటూ పోలీసు కస్టడీలో అంగీకరించాడని తెలిపారు. కార్పొరేషన్‌లో సివిల్ పనులు, లేబర్ కాంట్రాక్టులు ఇవ్వకపోవడం, కూరగాయల మార్కెట్ వేలం పాటలో ఇబ్బందులు పెట్టడం, తన పెళ్లి చెడగొట్టడం లాంటి అంశాలు తనను తీవ్రంగా బాధించాయని, అందువల్లే జంట హత్యలు చేసినట్లు చింటూ తమ కస్టడీలో ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు.
చింటూ అలియాస్ చంద్రశేఖర్‌కు దాదాపు రూ.40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించామని ఆయన తెలిపారు. హత్య జరిగిన తరువాత చింటూ నివాసాలు, కార్యాలయాలు, వ్యాపారాల వద్ద దాడులు చేసి రూ.40 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలున్న హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ (ఈడీ), ఐటీ, వాణిజ్య పన్నుల శాఖలకు పంపనున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడిన 25 మందిని అరెస్టు చేశామని, నిందితుల నుంచి ఆరు తుపాకులు, ఐదు కత్తులు, 31 బుల్లెట్లు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు దర్యాప్తు 90 శాతం పూర్తయిందని, త్వరలోనే మిగిలిన దర్యాప్తును పూర్తి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇతను బయటకు వస్తే ప్రజలు సామాజిక బహిష్కరణ విధించాలని పిలుపునిచ్చారు.