Mayor couple murder case
-
బాంబు పేలుడులో వి‘భిన్న’ కోణాలు..!
చిత్తూరు (అర్బన్) : చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలో గత గురువారం జరిగిన బాంబు పేలుడు కేసులో పోలీసుల దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. ఈ ఘటనకు మేయర్ దంపతుల హత్య కేసుకు సంబంధాలు ఉన్నాయని బహిరంగంగా వినిపిస్తున్నా పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించడం లేదు. దీనిపై అన్ని సాక్ష్యాల సేకరణపై దృష్టి కేంద్రీకరించారు. కాగా బాంబు పేలుడు ఘటనలో మేయర్ దంపతుల హత్య కేసులో నిందితులుగా ఉండి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన వాళ్లు, చింటూ వద్ద పనిచేస్తూ అక్రమ ఆయుధాల కేసులో బెయిల్‌పై వచ్చిన వాళ్లను పోలీసులు చిత్తూరు వన్‌టౌన్, టూటౌన్ పోలీసు స్టేషన్లలో విచారణ చేస్తున్నారు. అలాగే నగరంలో రౌడీషీట్ ఉన్న పలువురిని సైతం స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పలు విభిన్న కోణాల్లో అనుమానితులందర్నీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు- ఓ కేసులో చిత్తూరుకు చెందిన కొందరు వ్యక్తులు పెరోల్‌పై బయటకు వచ్చి.. చింటూ చాలా మంచివాడని, అతను త్వరలోనే బయటకు వస్తాడని పలువురి వద్ద చెప్పినట్లు పోలీసులకు సమాచారం అందింది. కడప జైలులో చింటూతో కలిసి ఉన్న ఈ నిందితులు అతనికి అనుకూలంగా పలువురి వద్ద మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వాళ్లను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక నగరంలో బాంబు దాడికి ముందు రోజు పలు కూడళ్లలోని సీసీ కెమెరాల వైర్లను కత్తిరించడంపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఎస్పీ సమీక్ష ఈ ఘటనపై చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో సమావేశమయ్యారు. ఘటన జరిగి వారం అవుతున్న నేపథ్యంలో దర్యాప్తు సాగుతున్న విధానం..? ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, అనుమానితులు ఇచ్చిన సమాచారంపై ఆరా తీశారు. అలాగే చింటూ, కటారి వర్గాలకు మధ్య ఉన్న గొడవల్లో నిందితుల విచారణపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయస్థానాల సముదాయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. అధికారులు మరో మూడు రోజుల్లో కేసులో అరెస్టు చూపించవచ్చని తెలియవచ్చింది. -
వాళ్లు నా పెళ్లి చెడగొట్టారు: చింటూ
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ల హత్య కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. మేయర్ దంపతులు చింటూ పెళ్లిని చెడగొట్టడం కూడా హత్యకు దారితీసిన కారణాల్లో ఒకటిగా తెలుస్తుంది. ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ చిత్తూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కఠారి దంపతులను తానే హత్య చేసినట్టు చింటూ పోలీసు కస్టడీలో అంగీకరించాడని తెలిపారు. కార్పొరేషన్లో సివిల్ పనులు, లేబర్ కాంట్రాక్టులు ఇవ్వకపోవడం, కూరగాయల మార్కెట్ వేలం పాటలో ఇబ్బందులు పెట్టడం, తన పెళ్లి చెడగొట్టడం లాంటి అంశాలు తనను తీవ్రంగా బాధించాయని, అందువల్లే జంట హత్యలు చేసినట్లు చింటూ తమ కస్టడీలో ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు. చింటూ అలియాస్ చంద్రశేఖర్‌కు దాదాపు రూ.40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించామని ఆయన తెలిపారు. హత్య జరిగిన తరువాత చింటూ నివాసాలు, కార్యాలయాలు, వ్యాపారాల వద్ద దాడులు చేసి రూ.40 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలున్న హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ వివరాలను ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ (ఈడీ), ఐటీ, వాణిజ్య పన్నుల శాఖలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడిన 25 మందిని అరెస్టు చేశామని, నిందితుల నుంచి ఆరు తుపాకులు, ఐదు కత్తులు, 31 బుల్లెట్లు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు దర్యాప్తు 90 శాతం పూర్తయిందని, త్వరలోనే మిగిలిన దర్యాప్తును పూర్తి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇతను బయటకు వస్తే ప్రజలు సామాజిక బహిష్కరణ విధించాలని పిలుపునిచ్చారు. -
చింటూపై ఈడీ కొరడా..ముమ్మర తనిఖీలు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్‌పై ఎన్ఫోర్సుమెంటు డెరైక్టరేట్ (ఈడీ) దృష్టిసారించింది. హైదరాబాదు నుంచి ఆదివారం చిత్తూరుకు వచ్చిన ఈడీ అదనపు సంచాలకులు లక్ష్మీకాంత్ నేతృత్వంలోని బృందం చింటూ ఆస్తులను, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలించారు. మేయర్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చింటూ పెద్ద మొత్తంలో అక్రమ ఆర్థిక లావాదేవీలు కలిగి వున్నట్లు గుర్తించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఈడీకి, ఆదాయపన్నుశాఖకు లేఖలు రాశారు. పోలీసుల లేఖతో ఈడీ అధికారులు చింటూ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తోంది. నగరానికి వచ్చిన లక్ష్మీకాంత్ తొలుత చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్‌ను కలిశారు. చింటూ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను తీసుకున్నారు. గత ఏడాది కాలంలో చింటూ దాదాపు రూ. 6 కోట్లకు పైగా లావాదేవీలు జరిపాడని, వీటికి సరిగా లెక్కలు లేవని పోలీసులు చెప్పారు. దీంతో ఈడీ అధికారుల బృందం చింటూకు సంబంధించిన ఇళ్లు, విద్యా సంస్థలు, క్వారీలను పరిశీలించింది. చింటూ సోదరులు అమెరికా, దుబాయ్ నుంచి భారీ మొత్తంలో ఇతనికి నగదు పంపినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో చింటూకు ఆడిటర్‌గా వ్యవహరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ ఆస్తులు కలిగినందుకు చింటూపై ఈడీ కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చింటూ ఆస్తులను అటాచ్ చేసుకునేందుకు ఈడీ సిద్ధమవుతోంది. చింటూను కూడా విచారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.