చిత్తూరు (అర్బన్) : చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలో గత గురువారం జరిగిన బాంబు పేలుడు కేసులో పోలీసుల దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. ఈ ఘటనకు మేయర్ దంపతుల హత్య కేసుకు సంబంధాలు ఉన్నాయని బహిరంగంగా వినిపిస్తున్నా పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించడం లేదు. దీనిపై అన్ని సాక్ష్యాల సేకరణపై దృష్టి కేంద్రీకరించారు. కాగా బాంబు పేలుడు ఘటనలో మేయర్ దంపతుల హత్య కేసులో నిందితులుగా ఉండి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన వాళ్లు, చింటూ వద్ద పనిచేస్తూ అక్రమ ఆయుధాల కేసులో బెయిల్‌పై వచ్చిన వాళ్లను పోలీసులు చిత్తూరు వన్‌టౌన్, టూటౌన్ పోలీసు స్టేషన్లలో విచారణ చేస్తున్నారు. అలాగే నగరంలో రౌడీషీట్ ఉన్న పలువురిని సైతం స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పలు విభిన్న కోణాల్లో అనుమానితులందర్నీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు- ఓ కేసులో చిత్తూరుకు చెందిన కొందరు వ్యక్తులు పెరోల్‌పై బయటకు వచ్చి.. చింటూ చాలా మంచివాడని, అతను త్వరలోనే బయటకు వస్తాడని పలువురి వద్ద చెప్పినట్లు పోలీసులకు సమాచారం అందింది. కడప జైలులో చింటూతో కలిసి ఉన్న ఈ నిందితులు అతనికి అనుకూలంగా పలువురి వద్ద మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వాళ్లను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక నగరంలో బాంబు దాడికి ముందు రోజు పలు కూడళ్లలోని సీసీ కెమెరాల వైర్లను కత్తిరించడంపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు.
ఎస్పీ సమీక్ష
ఈ ఘటనపై చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో సమావేశమయ్యారు. ఘటన జరిగి వారం అవుతున్న నేపథ్యంలో దర్యాప్తు సాగుతున్న విధానం..? ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, అనుమానితులు ఇచ్చిన సమాచారంపై ఆరా తీశారు. అలాగే చింటూ, కటారి వర్గాలకు మధ్య ఉన్న గొడవల్లో నిందితుల విచారణపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయస్థానాల సముదాయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. అధికారులు మరో మూడు రోజుల్లో కేసులో అరెస్టు చూపించవచ్చని తెలియవచ్చింది.