చింటూపై ఈడీ కొరడా..ముమ్మర తనిఖీలు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్‌పై ఎన్‌ఫోర్సుమెంటు డెరైక్టరేట్ (ఈడీ) దృష్టిసారించింది. హైదరాబాదు నుంచి ఆదివారం చిత్తూరుకు వచ్చిన ఈడీ అదనపు సంచాలకులు లక్ష్మీకాంత్ నేతృత్వంలోని బృందం చింటూ ఆస్తులను, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలించారు. మేయర్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చింటూ పెద్ద మొత్తంలో అక్రమ ఆర్థిక లావాదేవీలు కలిగి వున్నట్లు గుర్తించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఈడీకి, ఆదాయపన్నుశాఖకు లేఖలు రాశారు. పోలీసుల లేఖతో ఈడీ అధికారులు చింటూ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తోంది. నగరానికి వచ్చిన లక్ష్మీకాంత్ తొలుత చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్‌ను కలిశారు.
చింటూ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను తీసుకున్నారు. గత ఏడాది కాలంలో చింటూ దాదాపు రూ. 6 కోట్లకు పైగా లావాదేవీలు జరిపాడని, వీటికి సరిగా లెక్కలు లేవని పోలీసులు చెప్పారు. దీంతో ఈడీ అధికారుల బృందం చింటూకు సంబంధించిన ఇళ్లు, విద్యా సంస్థలు, క్వారీలను పరిశీలించింది. చింటూ సోదరులు అమెరికా, దుబాయ్ నుంచి భారీ మొత్తంలో ఇతనికి నగదు పంపినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో చింటూకు ఆడిటర్‌గా వ్యవహరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ ఆస్తులు కలిగినందుకు చింటూపై ఈడీ కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చింటూ ఆస్తులను అటాచ్ చేసుకునేందుకు ఈడీ సిద్ధమవుతోంది. చింటూను కూడా విచారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.