పాట్నా: మత కల్లోలాలు సృష్టించేందుకే పాట్నాలో నరేంద్ర మోడీ సభ వద్ద బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు వెల్లడించినట్లు సమాచారం. ఈ పేలుళ్లకు కీలక సూత్రధారి ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ అని వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మోడీ సభకు ముందు పేలుళ్లతో దద్దరిల్లిన పాట్నాలోని గాంధీ మైదానంలో మంగళవారం మరో ఐదు బాంబులు బయటపడ్డాయి. బుధవారం ఇదే మైదానంలో సీపీఐఎంఎల్ ‘ఖబడ్దార్’ సభ జరుగనున్న నేపథ్యంలో బాంబులు బయటపడడం గమనార్హం. ఆదివారం మోడీ ‘హూం కార్’ సభకు కొద్దిసేపటి ముందు పాట్నా రైల్వేస్టేషన్‌లో, గాంధీ మైదానం వద్ద ఆరు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే.
కాగా.. ఈ బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదిగా అనుమానిస్తున్న ఇంతియాజ్ అన్సారీని ఏడు రోజుల పోలీసు కస్టడీకి రైల్వే మేజిస్ట్రేట్ అప్పగించారు. పోలీసుల కస్టడీలో అన్సారీ పలు కీలక అంశాలను వెల్లడించాడు. తనకు జార్ఖండ్, బీహార్‌ల్లో అత్యాధునిక పేలుడు పదార్థాల తయారీలో శిక్షణ ఇచ్చారని అన్సారీ చెప్పినట్లు తెలుస్తోంది. యాసిన్ భత్కల్ అరెస్టు అనంతరం ఐఎంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉగ్రవాది మహ్మద్ తెహసీన్ అక్తర్ ఈ పేలుడు కుట్రకు సూత్రధారి అని, మోడీ సభ వద్ద పేలుళ్లు జరిపితే బీహార్‌లో మత కల్లోలాలు తలెత్తుతాయని అక్తర్ చెప్పినట్లు సమాచారం.
దాంతో పాటు ఉగ్రవాది యాసిన్ భత్కల్ అరెస్టుకు ప్రతీకారంగా విధ్వంసానికి పాల్పడేందుకు ఈ బాంబులు పెట్టినట్లు అన్సారీ చెప్పాడు. మోడీ సభ నేపథ్యంలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించామని కేంద్ర హోం మంత్రి షిండే మంగళవారం గుర్గావ్‌లో తెలిపారు. మోడీకి తగిన స్థాయిలో భద్రత ఉందని, ఎస్పీజీ భద్రత అవసరం లేదన్నారు. ఇదిలా ఉండగా, మోడీ ఈ నెల 19 ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నిర్వహించిన సభను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఆ రాష్ట్ర పోలీసులు చెప్పారు.
మత కల్లోలాలు సృష్టించేందుకే!
Published Wed, Oct 30 2013 4:13 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement