మాట్లాడుతున్న ఎస్పీ విక్రాంత్ పాటిల్
చిత్తూరు అర్బన్: సోషల్ మీడియా (సామాజిక మాధ్యమాలు)ను దుర్వినియోగం చేయరాదని చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. బుధవారం స్థానిక ఏఆర్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల చిత్తూరు పరిధిలోని ఓ కోళ్ల దుకాణంలో జరిగిన వివాదం, ఓ బాలుడ్ని కొట్టిన వీడియో, మరో కానిస్టేబుల్‌ను కొట్టిన ఘటనల్లో పోలీసులు పట్టించుకోలేదంటూ వాట్సప్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయని పేర్కొన్నారు.
ట్రోల్ అవుతున్న వీడియోలు వాస్తవమా.. కాదా? అని చూడకుండా చాలా మంది వీటిని మిగిలిన వారికి షేర్ చేస్తున్నారని తెలిపారు. వాస్తవాలైతే షేర్ చేయడంలో తప్పులేదని, పోలీసులు స్పందించలేదని చర్చలు లేపుతూ అవాస్తవాలు ప్రచారం చేయకూడదని హితవు పలికారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలను అనుసంధానం చేస్తూ తప్పుడు వీడియోలను, తప్పుడు సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం ఐటీ యాక్టు ప్రకారం నేరమన్నారు. దీనిపై కేసులు కూడా తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చే సందేశాలు, ఫిర్యాదుల్లో వాస్తవాలేమిటో నిర్ధారించడానికి పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక విభాగాన్ని సైతం ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించి అసత్యాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయరాదని, నమ్మరాదని కోరారు. సమావేశంలో ఏఎస్పీ రాధి, డీసీఆర్‌బీ సీఐ మహేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment