
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం కుప్పానికి చేరుకున్నారు. నియోజకవర్గంలోనే అన్ని మండలాల్లో పర్యటించారు. బహిరంగ సభలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. అయితే జిల్లాలోని ఆ పార్టీ ముఖ్య నాయకులెవరూ ఆయనను కలవడానికి ఇష్టపడలేదు. కుప్పానికి రమ్మని కబురు చేసినా చాలామంది ముఖం చాటేశారు. దీంతో చంద్రబాబు రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది.
సాక్షి, తిరుపతి : చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో జిల్లాలో ఎక్కడ పర్యటించినా.. దాదాపు అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రెక్కలు కట్టుకుని ఆయన వద్ద వాలిపోయేవారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురవడం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎంపీ శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్, డీసీసీబీ మాజీ చైర్మన్, తుడా మాజీ చైర్మన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మున్సిపాలిటీల మాజీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు, నగర, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు అందరూ జిల్లాలోనే ఉన్నా.. ఎవరూ కుప్పం వైపు చూడలేదు.
ముఖ్యంగా తిరుపతికి చెందిన ముఖ్య నాయకులు కూడా చంద్రబాబును కలవడానికి ఇష్టపడలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాని, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ, దుర్గా రామకృష్ణ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాత్రమే చంద్రబాబుతో కనిపించారు. నాయకులతో సమావేశం ఏర్పాటు చెయ్యాలని, ఉన్న వారిని కుప్పానికి రమ్మని కబురు చేసినా ఎవరూ స్పందించలేదని తెలిసింది. ఫోన్లు చేసినా.. పనులు ఉన్నాయని, మరి కొందరు ఆరోగ్యం సరిగా లేదని ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించినట్లు సమాచారం.
మాకేం చేశారు
చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులు తమ అభిప్రాయాలకు ఏనాడూ విలువ ఇవ్వలేదని ఓ మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. అధినేతను తాము ఏదైనా అడిగితే.. దాని వెనుక ప్రయోజనం గురించి ఆలోచించారని విమర్శించారు. నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయని కొందరు విన్నవించినా.. ఆయన పెద్దగా స్పందించలేదన్నారు. ఆయన కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూర్చారని, తమకు, ప్రజలకు ఏమీ చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటినీ నెరవేర్చకుండా గాల్లో తిరిగే అధినేత వచ్చినా ఏం ఉపయోగం అని మరో ఇద్దరు నాయకులు, మరో మహిళా నాయకురాలు ప్రశ్నించడం గమనార్హం.
సభల్లో బాబు అసంతృప్తి
చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నికల్లో తనను మరోసారి గెలిపించలేదని తీవ్ర పదే పదే ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీకి ప్రజలు ఇచ్చిన తీర్పును తాను ఊహించలేదని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఊహించని పరాభవం ఎదురవడంతో.. కార్యకర్తలు కూడా దూరం అవుతారనే ఆందోళన చంద్రబాబు మాట తీరులో స్పష్టమైంది. కార్యకర్తలందరూ టీడీపీకి శాశ్వతంగా ఉండాలని పదే పదే కోరడం బాబు పార్టీ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన చెందుతున్నారని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment