
అరుణమ్మా.. మీ పార్టీలో చేరితే ఎంత ప్యాకేజీ ?
పలమనేరు,న్యూస్‌లైన్ : ‘మా పార్టీలో ఎవరు చేరినా ప్యాకేజీలకు అమ్ముడు పోయారని ఆరోపణలు చేసే మీరు రేపు గల్లా అరుణమ్మ మీ పార్టీలో చేరితే ఆమెకు మీరు ప్యాకేజీ ఇస్తున్నారా..? లేదా మీరే తీసుకుం టున్నారా..? అనే విషయం చెప్పాలని చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి సూటిగా ప్రశ్నించారు. పలమనేరులోని పార్టీ కార్యాలయంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మనోహర్, సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలం, పూతలపట్టు నాయకులు కేశవులుతో కలసి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ జిల్లాలోని తెలుగుదేశానికి చిత్తశుద్ధితో పనిచేసే ముఖ్య నాయకులంతా ఎందుకు పార్టీని వీడుతున్నారో బాబు తెలుసుకోవాలన్నారు. రెండ్రోజుల క్రితం జగన్‌మోహన్ రెడ్డి పలమనేరు సమీపంలోని కుష్ఠు రోగుల ఆస్పత్రి వద్ద ఓ కుష్ఠు రోగిని పలకరించి అప్యాయంగా దగ్గరకు చేర్చుకున్నారన్నారు. అదే పని మీరు చేయగలరా..? అని బాబును ప్రశ్నించారు.
మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టి వారిని విడదీసింది మీరు కాదా అని ప్రశ్నించారు. నాడు బీజేపీని అస్యహించుకొని నేడు వారి మద్దతు కోసం ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను ఏమార్చే గర్జనలు వద్దని హితవు పలికారు. మీకంటే సీనియారిటీ ఉన్న అమరనాథ రెడ్డి కుటుంబం పార్టీని ఎందుకు వీడిందో మీకు తెలుసా అని ప్రశ్నించారు. జిల్లాలో హంగామా చేస్తున్న మీ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్య నాయకుల కుమారులు త్వరలోనే మా పార్టీలోకి వస్తారన్నారు. మీకు దాడి వీరభద్రరావులాంటి నమ్మకస్తులు అవసరం లేదని సుజనా చౌదరో లేక రమేష్ చౌదరి మాత్రమే చాలని ఎద్దేవా చేశారు.
నిన్న నేను, నేడు గాంధీ, రేపు మరొకరు..
తెలుగుదేశం పార్టీని గతంలో నేను వీడితే, నేడు గాంధీ వీడారని, రేపు మరొకరు బయటకొస్తారని పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లా ఖాళీ అయ్యిందని, చివరకు చంద్రబాబు మాత్రమే మిగులుతారన్నారు. బాబుకు అత్యంత సన్నిహితుడైన గాంధీనే బయటకొచ్చేశాడంటే చంద్రబాబు తీరు ఎలా ఉంటుం దో తెలుసుకోవచ్చన్నారు.
ఇప్పటికే జిల్లాలో మనోహర్, చింతల, ఆదిమూలం, గాంధీ, రోజా, మునిరామయ్య, ప్రవీణ్ ఇంతమంది చిత్తశుద్ధితో పనిచేసే వారు ఎందుకు పార్టీని వీడారన్నారు. కేవలం జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి గల విశ్వసనీయతతోనే అంద రూ ఆ పార్టీలోకి వస్తున్నారన్నారు. మా వ్యక్తిత్వాలను మసక బారే విధంగా తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. నేడు ఆ పార్టీలో మాకు జరిగింది రేపు ఇంకొక్కరికి జరగదని ఏం గ్యారంటీ అన్నారు. కుమ్మక్కు రాజకీయాలను వివరించడానికి జనగర్జన పెట్టడం దేనికని ప్రశ్నించారు.
పార్లమెంట్‌లో ఎఫ్‌డీఐ బిల్లు, ఎమ్మెల్సీ, సొసైటీ ఎన్నికలు, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల దాకా ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలియదా అని ప్రశ్నించారు. అనంతరం చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మనోహర్ మాట్లాడారు. నాడు తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చి నేడు గర్జనలు చేస్తే ఏం ప్రయోజనమన్నారు. ఇంత అధ్వానమైన ప్రతిపక్ష నేత ఈ దేశంలోనే లేరన్నారు. సత్యవేడు ఇన్‌చార్జ్ ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యతను కాపాడేది జగన్ మాత్రమేనని, దీనిని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పూతలపట్టు నాయకులు కేశవులు మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్‌లకు కాలం చెల్లిందన్నారు. ఈ సమావేశంలో సునీల్, వంగపండు ఉషా, వినయ్ రెడ్డి, సీవీ కుమార్, హేమంత్‌కుమార్ రెడ్డి, మండీసుధా, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.