విజయవాడ : ఎంబీబీఎస్ బీ - కేటగిరి సీట్ల అమ్మకాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కామినేని విలేకర్లతో మాట్లాడుతూ ... విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరై కళాశాలల్లో చేరితే ఫర్వాలేదు గానీ కళాశాలల్లో సీట్లు వచ్చిన తర్వాత కాలేజీలో చేరి మానేస్తేనే సమస్య ఉత్పన్నమవుతుందని అన్నారు.
తద్వారా ఖాళీ అయిన సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీచేసుకునే అవకాశం కాలేజీ యాజమాన్యానికి ఉందన్నారు. మూడో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకూ విద్యార్థుల సర్టిఫికేట్లు యూనివర్సిటీలోనే ఉంటాయని కామినేని శ్రీనివాస్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు. కాలేజీలు అక్రమంగా సీట్లు అమ్ముకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుని సదరు కాలేజీలను బ్లాక్‌లిస్టులో పెడతామని కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు.