
జమ్మలమడుగు రూరల్: బీసీ కాలనీలో విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు
ప్రొద్దుటూరు టౌన్ : తీగ లాగితే డొంక కదులుతోంది. చేనేత సొసైటీల్లో ఉన్న సభ్యుల వివరాల ఆధారంగా వారి గ్రామాలకు వెళ్లి సీఐడీ అధికారుల విచారణ ప్రారంభించారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఈశ్వరరెడ్డినగర్‌లోనే కాక జిల్లాలోని పలు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో విచారణ చేపట్టారు. గురువారం ఈశ్వరరెడ్డినగర్‌లో సీఐడీ అధికారులు పరిశీలించారు. సొసైటీల్లో లబ్ధిదారుల వివరాలు పూర్తిగా లేవు. వారి చిరునామలు తెలుసుకోవడాని ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డోర్ నంబర్లు లేకుండా కేవలం పేరు, ప్రాంతం పేరు ఉండటం, ఒకే పేరుతో చాలా మంది చేనేతలు ఉండటం కూడా వారికి తలనొప్పిగా మారింది.
మాకు సొసైటీ అధ్యక్షులు ఎవరో తెలియదు..
ఈ సందర్భంగా చేనేత కార్మికులు తమకు సొసైటీ గురించి కానీ.. అందులో మేము సభ్యులమనే విషయం కానీ ఇంత వరకు తెలియదని చెప్పారు. దీంతో బోగస్ సొసైటీల అవినీతి ఏపాటిదో అర్థం అవుతోంది. చాలా ఏళ్లుగా ఫలానా సొసైటీలో మీరు ఉన్నారా, లివరీ రకం బట్ట నేశారా అన్న సీఐడీ అధికారుల ప్రశ్నలకు తమకు తెలియదని సమాధానం ఇస్తున్నారు. దీంతో వారి ఆధార్ కార్డు నకలు తీసుకొని సంతకాలు చేయించుకుంటున్నారు. సొసైటీల్లో సభ్యులమని ఏడాదికో, ఆరు నెలలకో సమావేశాలకు పిలుచుకెళ్లి రూ.200, రూ.500 డబ్బులు ఇచ్చేవారు తప్ప మాకు ఏ పాపం తెలిదన్న విషయాన్ని కూడా చేనేతలు కొందరు సీఐడీ అధికారులతో చెబుతున్నారు.
రూ.500 ఇస్తాం..
సీఐడీ అధికారుల విచారణ నేపథ్యంలో బోగస్ సొసైటీలు నిర్వహిస్తున్న వారు చేనేతల వద్దకు వచ్చి మీ ఆధార్ కార్డు నకలు ఇచ్చి, పేపర్‌పై సంతకం పెడితే రూ.500 ఇస్తామని మభ్యపెడుతున్నట్లు చెబుతున్నారు. మాకు ప్రభుత్వం ఇచ్చే లబ్ధి పోతుందని, అయినా ఇప్పుడు ఎందుకు సంతకాలు పెట్టాలని నిలదీస్తుండటంతో వెనుదిరుగుతున్నట్లు చేనేతలు అంటున్నారు.
జమ్మలమడుగు బీసీ కాలనీలో..
జమ్మలమడుగు రూరల్ : బోగస్ సొసైటీలపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. పట్టణంలోని బీసీ కాలనీలో అక్షయ వీవర్స్ కో–ఆపరేటివ్ ప్రొడక్షన్, సేల్స్ సొసైటీ లిమిటెడ్‌లో రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా బీసీ కాలనీలో ఉన్న చేనేత కార్మికులతో మాట్లాడారు.సొసైటీ గురించి ఆరా తీయగా.. తమకు తెలియదని, అయితే ఎప్పుడో ఒకసారి తమతో సంతకాలు పెట్టించుకున్నారని చెప్పారు. తమకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని చేనేత కార్మికులు సీఐడీ అధికారులకు వివరించారు. ఇటీవల ఏమైనా ప్రభుత్వ పథకాలు వచ్చాయా అని అధికారులు అడిగారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 24వేల రూపాయలు తమ ఖాతాలలో జమ అయ్యాయని కార్మికులు తెలిపారు. సొసైటీ నుంచి ఎటువంటి పథకాలు తమకు అందలేదని దాదాపు 70మంది తెలిపారు. జమ్మలమడుగు మండల పరిధిలోని మోరగుడిలో చాలా వరకు బోగస్‌సొసైటీలే ఉన్నట్లు గుర్తించారు. వాటి గుట్టును రట్టుచేసే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో చేనేత సొసైటీ నిర్వాహకుల్లో గుబులు మొదలైంది.
మా కుటుంబంలో ముగ్గురు పేర్లు ఉన్నాయంట
నా పేరు వలసాల కృష్ణదాస్. మేము మండల పరిధిలోని ఈశ్వరరెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్నాం. 40 ఏళ్లుగా మా కుటుంబం చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తోంది. మేము ఇప్పటి వరకు ఏ సొసైటీల్లో సభ్యులుగా లేము. కానీ సీఐడీ అధికారులు మా ఇంటి వద్దకు వచ్చి ప్రభుత్వం ఇచ్చిన రూ.24 వేలు డబ్బు అందిందా అని అడిగారు. వచ్చిందన్నాను. మీరు చాలా ఏళ్లుగా శ్రీరాం సొసైటీలో సభ్యులుగా ఉన్నారా అని అడిగారు. మాకు ఆ సొసైటీ ఎక్కడ ఉందో, అధ్యక్షుడు ఎవరో తెలియదు అని చెప్పాం. తనకు తెలియకుండా సొసైటీలో ఎలా సభ్యునిగా చేర్చారని సీఐడీ అధికారులను అడిగాను. మా అన్న, మా తండ్రి పేర్లు సభ్యులుగా ఉన్నట్లు కూడా తెలిసింది. బోగస్ సొసైటీల్లో మా పేర్లు చేర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాం.
Comments
Please login to add a commentAdd a comment