చిలకలూరిపేట: పుట్టింది పేద కుటుంబం..తండ్రి సా«ధారణ ఫొటోగ్రాఫర్..ఎన్నో ఆర్థిక ఇబ్బందులు..ఎడ్యుకేషన్ లోన్‌పై ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కృషీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. ఎందరో సామాన్య విద్యార్థులు యువకులకు ఆదర్శంగా నిలిచాడు చిలకలూరిపేట పట్టణానికి చెందిన చందోలు విజయనాగమణికంఠ. ఇటీవల యూపీఎస్‌సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 206 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. ఆదివారం ఒక అభినందన కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్టణానికి వచ్చిన ఆయన సాక్షితో అనుభవాలను పంచుకున్నారు.
2017లో ఇండియన్ ఫారెస్టు సర్వీసుకు ఎంపిక
2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై ప్రిలిమ్స్‌లో అవలీలగా విజయం సాధించాను. మేము సిద్ధమైన తీరుకు భిన్నంగా అప్పటి వరకు కొనసాగుతున్న ప్యాట్రన్‌ను మార్చడంతో మెయిన్స్‌లో విజయం సాధించలేకపోయా. దీంతో నిరాశ అలుముకుంది. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. సివిల్స్‌కు సిద్ధమైన అనుభవంతో ఎస్‌బీఐ పీవో, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, సెంట్రల్ పారామిలటరీ ఫోర్సు పరీక్షల్లో విజయం సాధించా. సెంట్రల్ పారా మిలటరీ ఫోర్సులో డీఎస్పీ కేడర్ ఉద్యోగం లభించినా, చదువుకునే అవకాశం ఉండదని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కేడర్‌కు చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి శిక్షణలో చేరా. ఈ శిక్షణ కారణంగా 2014లో సివిల్స్‌కు హాజరు కాలేకపోయాను. 2015లో ప్రిలిమ్స్‌లో విజయం సాధించినా ఎఫ్‌ఆర్‌వో ఉద్యోగ శిక్షణ కారణంగా మెయిన్స్‌కు హాజరు కాలేదు. మూడో ప్రయత్నంగా 2017లో ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఇండియన్ ఫారెస్టు సర్వీసు ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యాను. డెహ్రడూన్‌లో శిక్షణ పొందుతున్నాను.
నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్
శిక్షణకు ముందు కొంత సమయం ఖాళీ ఉండటంతో తిరిగి సివిల్స్ పరీక్ష రాసి 2018 ఏప్రిల్ 27న ప్రకటించిన ఫలితాల్లో నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. నాకు ఐపీఎస్, ఐఏఎస్‌లలో ఏదో ఒకటి సాధిస్తే చాలనుకున్నాను. ఏది సాధించినా ఎలా ప్రజలకు సేవ చేయాలి అనే విషయంలో పూర్తి స్పష్టత ఉంది. సివిల్స్‌కు మరో రెండు అవకాశాలు ఉన్నా ఐపీఎస్ పట్ల సంతృప్తి ఉండటంతో మరోసారి రాయదల్చుకోలేదు. ఐపీఎస్ అధికారిగా ప్రజలకు పూర్తిస్థాయి సేవలు అందించడమే లక్ష్యం.
ఆత్మవిశ్వాసంతో మెలగాలి
సాధారణ, నిరుపేద కుటుంబాలకు చెందినవారు తాము సివిల్స్‌లో విజయం సాధించలేమని నిరాశ పడుతుంటారు. ఆ భావన సరికాదు. ఎవరికైనా పట్టుదల, కృషి ఉంటే విజయం దానంతట అదే వరిస్తుంది. ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా కష్టపడి చదివించిన తల్లిదండ్రులు మంగాచారి, శారదదేవితో పాటు నన్ను నిరంతరం ప్రోత్సహించి ఐఏఎస్ అకాడమీలో శిక్షణకు సహకరించిన చిలకలూరిపేట డీఆర్‌ఎన్‌ఎస్‌సీవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఆర్యవైశ్య విద్యానిధి సంఘ కన్వీనర్ పొట్టి శ్రీరాములుకు జీవితాంతం రుణపడి ఉంటాను.
రైల్వే ఉద్యోగం చేస్తూనే సన్నద్ధం
నాన్న మంగాచారి సాధారణ ఫోటోగ్రాఫర్. అమ్మ శారదాదేవి గృహిణి. అన్న మధుబాబు డిగ్రీ చదివి ఉద్యోగం లభించక పోవడంతో ఫొటోగ్రాఫర్‌గా కొనసాగుతున్నాడు. ఇంటర్ వరకు ప్రకాశం జిల్లా మార్టూరులో చదువుకున్నాను. గుంటూరు జిల్లా బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్(కంప్యూటర్ సైన్సు) 2010లో పూర్తి చేశాను. ఎంటెక్ చదవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. టీసీఎస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం లభించినా ఏడాది తర్వాత చేరమన్నారు. బీటెక్ చదివే రోజుల్లో కొందరు సీనియర్లు కళాశాల లైబ్రరీలోని ప్రత్యేక విభాగంలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండేవాళ్లు. అప్పుడే నేనూ అవ్వాలన్న ఆకాంక్ష మొదలైంది. మనసులో సివిల్స్‌పై బలమైన కోరిక ఉన్నా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉండటం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా 2011లో రైల్వే మెయిల్ సర్వీసులో క్లరికల్ గ్రేడ్ ఉద్యోగం లభించడంతో అందులో చేరాను. పోస్టింగ్ ఏలూరులో లభించింది. డ్యూటీ సాయంత్రం 5 గంటల నుంచి మర్నాడు తెల్లవారు 5 గంటల వరకు రోజుమార్చి రోజు ఉండేది. చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకున్నా రోజుమార్చి రోజు డ్యూటీ కావడంతో చదువుకునేందుకు సమయం దొరికేది.
గ్రంథాలయమే తొలిగురువు
ఏలూరులోని జిల్లా గ్రంథాలయానికి వెళ్లేవాణ్ని. అక్కడ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌అయ్యే కొందరు నిరుద్యోగులు క్యారేజీలలో అన్నం కట్టుకొని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు పుస్తకాలు, మ్యాగజైన్లు, న్యూస్‌పేపర్లు చదువుతుండేవారు. వారిని చూసి నేను ఎక్కువ సమయం చదివేందుకు కేటాయించడం ప్రారంభించాను. అక్కడ ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు చేరుకున్నాను. నేను పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. సివిల్స్ పరీక్షలు తెలుగులో రాసే అవకాశం ఉన్నా మెటీరియల్ లభ్యత ఇతర అవకాశాలు ఆంగ్లంలో ఎక్కువగా ఉండటంతో అందులోనే ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. నా రూంలో టీవీ కూడా లేకపోవడంతో చిన్న ట్రాన్సిస్టర్‌ను తెచ్చుకుని ఆల్‌ఇండియా రేడియోలో ఇంగ్లిష్ వార్తలు వినేవాణ్ని. అర్థం కాకపోయినా డిక్షనరీ తెచ్చుకుని పదేపదే ఇంగ్లిష్ మ్యాగజైన్లు చదివి ఆంగ్లంపై పట్టు సాధించా. 2012లో డాక్టర్ కొణిజేటి రోశయ్య ఐఏఎస్ అకాడమీలో చేరాను. వారు 10 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment