
సినిమా ఫీల్డ్ అనేది మాయ: శివాజీరాజా
హైదరాబాద్: సినిమా ఫీల్డ్ అనేది మాయ అని నటుడు శివాజీరాజా అన్నారు. సినిమా పరిశ్రమలో అన్ని ఉన్నాయనుకుంటారని, కానీ ఏమీ ఉండవని వెల్లడించారు. సినిమా నటులకు డిప్రెషన్ సహజమని పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం సినిమాలు విడుదలవుతాయని, ఈ సమయంలో కొంత మందికి ఆనందం.. మరికొంత మందికి నిరాశ కలుగుతాయని చెప్పారు. ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి నివాళి అర్పించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆత్మహత్య చేసుకుని ఉదయ్ కిరణ్ 100 శాతం తప్పు చేశాడని శివాజీరాజా అన్నారు. కెరీరెలో ఎంతో సాధించిన అతడు ఇలా చేయడం తనకు చాలా బాధ కలిగించిందని పేర్కొన్నారు. యువతకు సందేశాలిచ్చిన సినిమాల్లో నటించిన అతడు ప్రాణాలు తీసుకోవడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. దయచేసి ఎవరూ ఇలా చేయొద్దని కోరారు. మన కష్టాలు, సుఖాలు పంచుకునే మంచి స్నేహితులను సంపాదించుకుంటే ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడాల్సిన రాదన్నారు.