శనీశ్వరాలయానికి వస్తే సినిమా హిట్టే..
నర్శింగోలు(జరుగుమల్లి) : సినిమా ప్రారంభించడానికి ముందు శనీశ్వరాలయంలో పూజలు చేస్తే ఆ సినిమా హిట్టవుతుందని తన నమ్మకమని ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శీను పేర్కొన్నారు. మండలంలోని నర్శింగోలు రామలింగేశ్వర శనీశ్వరాలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోయపాటి విలేకర్లతో ముచ్చటించారు.
సినిమాలపై ఆసక్తి ఎలా కలిగింది ?
మొదట్లో నేను ఫోటోగ్రాఫర్‌గా పని చేశా. ఆ ఆసక్తితోనే సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశా.
దమ్ము చిత్రం నిరుత్సాహపరిచింది కదా ?
లేదు.. నా కెరీర్‌లో అది ఒక బెస్ట్ సినిమా.
మళ్లీ ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు ?
మంచి కథ దొరికితే తప్పకుండా సినిమా తీస్తా.
రామ్‌చరణ్‌తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు?
నా కథకు రామ్‌చరణ్ సరిపోతే తప్పకుండా చేస్తా.
బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా ఎప్పుడు మొదలవబోతోంది?
నవంబరులో సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం.
జానపద, పౌరాణిక చిత్రాలేమైనా తీసే ఆలోచన ఉందా?
జానపద, పౌరాణిక చిత్రాలు నిర్మించాలంటే భారీ బడ్జెట్ అవసరమవుతుంది. చక్కని కథతో పాటు నిర్మాత దొరికితే అలాంటి సినిమాలు చేస్తా.
ప్రతి సినిమా ప్రారంభానికి ముందు శనీశ్వరాలయానికి వస్తున్నారు. ఏదైనా సెంటిమెంటా?
అవును. నా సినిమా ప్రారంభించడానికి ముందు శనీశ్వరాయాలనికి వచ్చి ప్రత్యేకంగా పూజలు చేయించుకుని వెళ్తా. సినిమా హిట్టయిన తర్వాత మళ్లీ వచ్చి స్వామి వారికి మొక్కు చెల్లించుకుంటా. భద్ర, తులసి, దమ్ము, సింహా, లెజండ్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. శనీశ్వర స్వామిపై నమ్మకంతో ప్రత్యేక పూజలు చేస్తున్నా. ప్రతి రోజూ నా పేరుతో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
రాజకీయాలపై మీ అభిప్రాయం?
ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల పైనే ఉంది. రాజకీయాలపై ఆసక్తి లేదు.