నేర సమీక్ష.. వసూళ్ల శిక్ష!   | Circle Inspector Irregularities In Anantapuram District | Sakshi
Sakshi News home page

నేర సమీక్ష.. వసూళ్ల శిక్ష!  

Published Tue, Oct 22 2019 8:03 AM | Last Updated on Tue, Oct 22 2019 8:03 AM

Circle Inspector Irregularities In Anantapuram District - Sakshi

చప్పుడు చేయకుండా ఇంట్లోకి చొరబడే పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదనుకుంటుందట. పాపం.. ఈ కోవలోనే ఓ సీఐ తన సర్కిల్‌ పరిధిలో ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందిలే అనుకుని బోల్తా పడ్డాడు. మామూళ్లు వసూలుకు ఓ సమావేశం ఏర్పాటు చేసుకోవడం.. దీనికి నేర సమీక్షగా ముసుగేయడం జరిగిపోయింది. అంతా గుట్టుగానే సాగిపోయిందనుకుంటున్న తరుణంలో పోలీసు బాస్‌ లైన్‌లోకి రావడంతో ఆ సీఐకి దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. అదే పోలీసులతో.. గతంలో సమావేశం ఏర్పాటు చేసిన స్థలంలోనే తిరిగి అందరినీ సమావేశపర్చి ఇదే సీఐతో ‘నోటి శుభ్రత’ చేయించారు. మొత్తంగా ఈ సీఐ తీరు పోలీసు శాఖలో నవ్వులు పూయిస్తుండగా.. అవినీతి పోలీసులకు గుణపాఠంగా నిలుస్తోంది. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం:  జిల్లాలో ఓ సీఐ క్రైం మీటింగ్‌ పేరుతో తన కింద పనిచేసే పోలీసులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా క్రైం మీటింగ్‌ అంటే.. నేరాలు జరగకుండా ఎలా అరికట్టాలి? ఏయే సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటిని అధిగమించేందుకు పోలిసింగ్‌ ఎలా చేయాలనే అంశాలపై చర్చించాలి. అయితే, ఆ సీఐ నిర్వహించిన క్రైం మీటింగ్‌ మాత్రం ఇందుకు భిన్నం. ఏకంగా క్రైం మీటింగ్‌ను కలెక్షన్‌ మీటింగ్‌గా మార్చేశారు. ఏయే స్టేషన్‌ నుంచి నెలవారీగా ఎంత వసూలు చేసే అవకాశం ఉంది? ఎక్కడెక్కడ ఎవరెవరు ఏయే తప్పులు చేస్తున్నారు? వారి వద్ద నుంచి ఎంత మొత్తం, ఎలా వసూలు చేయాలనే అంశాలను చర్చించారు. అంతటితో ఆగకుండా ఎవరెవరికి ఎంతెంత వాటా, ఎంత మొత్తం నెల వారీగా ఇవ్వాలని కూడా ఉపదేశించారు. అదేవిధంగా డీఎస్పీ స్థాయి వారికి కూడా నెల వారీగా ఏయే స్టేషన్‌ నుంచి ఎంత మొత్తం పంపించాలనే వివరాలను చర్చించి లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇక అంతా సవ్యంగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో ఈ విషయం కాస్తా నేరుగా జిల్లా పోలీస్‌ బాస్‌ దృష్టికి పోయినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సదరు సీఐకి తన మార్క్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు ఎస్పీ సిద్ధమయ్యారు. అదే పోలీసులతో అదే ప్రదేశంలో నిజమైన క్రైం మీటింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. క్రైం మీటింగ్‌ పెట్టుకున్న తర్వాత ఏయే అంశాలు మాట్లాడాలో కూడా సీఐకి దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా సమావేశం ముగిసిన తర్వాత టెలీ కాన్ఫరెన్స్‌లో అందరినీ తనతో మాట్లాడించాలని కూడా సూచించారని తెలిసింది. అనుకున్న విధంగా క్రైం మీటింగ్‌ను సదరు సీఐ ఏర్పాటు చేశారు. నేరాలను ఎలా అదుపుచేయాలి? ముందస్తుగా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలని అదే సీఐ తన కింది పోలీసులకు బోధించారు. సమావేశం అనంతరం నేరుగా ఎస్పీ టెలీ కాన్ఫరెన్స్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎవరైనా నెలవారీ మామూళ్లు వసూలు చేశారో చర్యలు తప్పవని హెచ్చరించడమే కాకుండా అవినీతికి పాల్పడితే సహించేది లేదని, నేరుగా ఇంటికి పంపుతానని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో మొత్తం జరిగిన విషయం ఎస్పీ దృష్టికి వెళ్లినట్టు పోలీసులకు అర్థమైంది. అంతేకాకుండా ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది.  

వివరాల సేకరణ 
ఓ నియోజకవర్గంలో జరిగిన కలెక్షన్‌ మీటింగ్‌ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఇలాంటి పోలీసులను గుర్తించే పనిలో పోలీస్‌బాస్‌ పడినట్టు తెలుస్తోంది. ఇక జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో సీఐలు, ఎస్‌ఐలతో పాటు భారీగా వసూళ్లకు పాల్పడే వారి జాబితాను నేరుగా ఎస్పీ సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మట్కా, బెట్టింగ్‌ చేస్తున్న వారితో వాటాలు పంచుకుంటున్న పోలీసులను ఎస్పీ నేరుగా ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే. ఒకవైపు అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టంగా ఆదేశాలు జారీచేశారు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న పోలీసులను దారిలో పెట్టేందుకు ఎస్పీ ఉపక్రమించారు. అదేవిధంగా ఏయే పోలీసులు ఏయే మార్గాల్లో అవినీతికి పాల్పడుతున్నారనే అంశాలను గుర్తించి వారిని నేరుగా పిలిపించి హెచ్చరించాలని.. ఒకవేళ దారిలో పడకపోతే సీరియస్‌ చర్యలు తప్పవనే సందేశాన్ని ఎస్పీ పంపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్‌శాఖలో హాట్‌టాపిక్‌గా మారడంతో పాటు ఎవరికి వారు సర్దుబాటులో చర్యల్లో నిమగ్నమైనట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement