లింగంపేట, న్యూస్‌లైన్: లింగంపేట మండల కేంద్రంలో ఐదువందల నకిలీ నోట్ల చలామణి గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2013 అక్టోబర్‌లో ఐదువందల నకిలీనోట్లను చలామణి చేస్తూ లింగంపేటకు చెందిన ఆకుల సత్యం అనే యువకుడు పోలీసులకు చిక్కాడు. దొంగనోట్లపై విచారణ జరిపిన పోలీసులు రూ.1.02 లక్షల విలువైన నకిలీ ఐదువందల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
నకిలీనోట్ల వ్యవహారం సమసి పోయిందని భావిస్తున్న తరుణంలో లింగంపేటకు చెందిన ఓ వ్యాపారి గుట్టుచప్పుడు కాకుండా రూ.5 వందల నకిలీ నోట్లను చలామణి చేస్తున్నాడనీ మళ్లీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం, మక్కల కొనుగోళ్లు చేపట్టే ఓ వ్యాపారి ధాన్యం, మక్కలు విక్రయించిన రైతులకు నకిలీ నోట్లను అంటగడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లింగంపేట మండల కేంద్రానికి చెందిన ఒకరిద్దరు యువకులు నకిలీ నోట్ల చలామణిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లావ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ 5 వందల నోట్ల చలామణి వ్యవహారాన్ని మండల ప్రజలు మరవకముందే, మళ్లీ చలామణి జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏవి అసలు నోట్లో, ఏవి నకిలీ నోట్లో తెలియక ఆందోళన చెందుతున్నారు. వీరు ఈపాటికే సుమారు రూ.15 లక్షల నకిలీ నోట్లను మార్కెట్‌లో గుట్టుచప్పుడు కాకుండా చలామణి చేసినట్లు సమాచారం. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న నకిలీనోట్ల చలామణిపై పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.
గుట్టుగా నకిలీనోట్ల చలామణి?
Published Tue, Jan 7 2014 4:18 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement