సాక్షి, కాకినాడ :‘నగరం ఘటన చాలా తీవ్రమైనది. బాధితులతో పాటు గ్రామాన్ని ఆదుకునేందుకు ఉదారంగా ముందుకు రావాలి. ఏ సాయం చేసినా ఉదారంగా ఆలోచించి, సాధ్యమైనంత ఎక్కువగా చేయాలి. బాధితులకు సాంత్వన చేకూర్చేలా జిల్లా యంత్రాంగంతో పాటు ప్రభుత్వాలు ప్రతిపాదించే ప్రతీ ప్రాజెక్టుకు సహకారం అందించాలి’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు హెచ్‌సీ సిన్హా గెయిల్ యాజమాన్యానికి సూచించారు. నగరం ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపేందుకు జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం కాకినాడ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. దేశంలోనే భారీ ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమైన ఈ ఘటన దురదృష్టకరమని సిన్హా వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సత్వరమే స్పందించే యంత్రాంగం భారీ పరిశ్రమల్లో ఉండాలన్నారు.
మోడల్ విలేజ్‌గా నగరం : కలెక్టర్
ఈ ఘటనలో ప్రాణనష్టం, పెద్దఎత్తున ఆస్తి, పంట నష్టాలు వాటిల్లాయని కలెక్టర్ నీతూప్రసాద్ గణాంకాలతో వివరించారు. గెయిల్ యాజమాన్యంతో కలిసి సహాయ, పునరావాస చర్యలు చేపట్టినట్టు చెప్పారు. మృతుల కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.5.5 లక్షల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందజేశామన్నారు. దెబ్బతిన్న గృహాలకు రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకూ, మరమ్మతులు, పునర్నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.1.25 లక్షల మేరకు అందజేసినట్టు తెలిపారు. 15 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్న 1196 కొబ్బరి చెట్లకు ఒక్కొక్క దానికి రూ.6 వేల చొప్పున అందజేశామన్నారు. నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేసేందుకు గెయిల్ ముందుకొచ్చిందన్నారు. ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వారికి రుణసాయం చేసి, స్వయం ఉపాధి కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు.
కోనసీమలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు 12 ఎకరాల భూములను గుర్తించామన్నారు. జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ మాట్లాడుతూ ఘటనపై నమోదు చేసిన కేసుల దర్యాప్తు 75 శాతం పూర్తయిందన్నారు. గెయిల్ జీఎం ఎంవీ అయ్యర్ మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు గెయిల్ ఈడీ రంగనాథన్ నేతృత్వంలో విచారణకు సంస్థ ఆదేశిందన్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్లను మార్చేందుకు రూ.800 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేశామని ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మేనేజర్ డీజీ సన్యాల్ వివరించారు. 800 కిలోమీటర్ల మేర ఉన్న పైపులైన్ వ్యవస్థను తనిఖీ చేస్తున్నామన్నారు. ఈ సమీక్షలో హౌసింగ్ డీఎం సెల్వరాజ్, డీఎంహెచ్‌ఓ పవన్‌కుమార్, అమలాపురం ఆర్డీఓ గణేష్‌కుమార్, గెయిల్, ఓఎన్జీసీ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
మరింత ఉదారంగా ఆదుకోండి
Published Wed, Sep 24 2014 12:44 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement