వేటుకు వేళాయె!
49 మంది డీలర్ల మెడపై కత్తి
⇒ 5లోగా సరుకులు పంపిణీ చేయలేదని సాకు
⇒ సమస్యలను పట్టించుకోకుండా చర్యలు
⇒ ఏకపక్ష నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత
⇒ అస్తవ్యస్తంగా పౌరసరఫరాల శాఖ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల సిఫారసులకు అనుగుణంగా ఇదివరలో వందలాది మంది రేషన్ డీలర్లపై వేటు పడింది. తాజాగా రేషన్ సరుకులను సకాలంలో పంపిణీ చేయలేదనే సాకు చూపి తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో కొద్ది మంది రేషన్ డీలర్లు సకాలంలో సరుకులు ఇవ్వకపోవడం జరుగుతోంది. అయితే అందరినీ ఒకే గాటిన కట్టి చర్యలకు సిద్ధపడటం ఏమిటనే అభిప్రాయం డీలర్లలో వ్యక్తమవుతోంది. మొత్తంగా జిల్లాలో 49 మంది డీలర్లపై కత్తి వేలాడుతోంది. మార్చి నెలలో 5వ తేదీ వరకూ 5 శాతం కూడా సరుకులను సరఫరా చేయని డీలర్లను జిల్లావ్యాప్తంగా 49 మందిని గుర్తించారు.
వీరిలో కొందరిని తొలగించడం, మరికొందరికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే, ఇప్పటికే డీలర్ల తొలగింపుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. చర్యలు తీసుకునేందుకు ఆర్డీఓలు జంకుతున్నారు. ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవాల్సిందేనని ఒత్తిడి చేస్తోంది. మరోవైపు పౌర సరఫరాలశాఖకు రెగ్యులర్‌గా ఒక అధికారి లేకపోవడం కూడా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ కాస్తా దారి తప్పేందుకు కారణమయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముగ్గురు అధికారుల మార్పు
సాధారణ బదిలీల్లో భాగంగా గత ఏడాది డీఎస్‌ఓగా ఉన్న వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. ఆ తర్వాత ఈయన స్థానంలో ప్రభాకర్‌రావు వచ్చారు. ఈయన ఉద్యోగంలో చేరేందుకు నెలన్నరకు పైగా సమయం తీసుకున్నారు. వివిధ అవినీతి ఆరోపణలతో ఈయనపైనా బదిలీ వేటు పడింది. తర్వాత కొంతకాలం రెగ్యులర్ అధికారి లేకుండానే నెట్టుకొచ్చారు. కొద్దిరోజుల క్రితం విజయరాణి బాధ్యతలు చేపట్టారు. ఈమె కూడా ఎక్కువ రోజులు పనిచేయలేకపోయారు. ప్రస్తుతం ఇన్‌చార్జిగా తిప్పేనాయక్ వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పౌర సరఫరాలశాఖ కాస్తా అధికారి లేని అనాథగా మారిపోయింది. ఈ కారణంగా మొత్తం వ్యవస్థనే గాడితప్పే పరిస్థితి ఏర్పడింది.