
ప్రత్తిపాటి పుల్లారావు
హైదరాబాద్: ఈ నెల 30వ తేదీ లోపు రైతుల రుణాల మాఫీపై స్పష్టత ఇస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రుణమాఫీకి వ్యతిరేకంగా రిజర్వ్ బ్యాంక్ లేఖ రాయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రుణమాఫీ అమలు బ్యాంకర్ల ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుందని, రుణాలు సక్రమంగా చెల్లించేవారికి మాఫీ అంశం అన్యాయం చేయడమే అవుతుందని ఆర్బిఐ పేర్కొంది. రుణమాఫీని నగదు రూపంలో చెల్లిస్తేనే అంగీకరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలను ఆమోదించేది లేదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
ఈ నేపధ్యంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయశాఖ, ఆర్థికశాఖ శాఖాధికారులతో సమావేశమయ్యారు. పరిస్థితులను సమీక్షించారు. అనంతరం మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ఈ నెల 22న రుణమాఫీ కమిటీ నివేదిక వస్తుందని తెలిపారు. 30వ తేదీ లోపన రుణమాఫీపై ఒక స్పష్టత ఇస్తామని చెప్పారు. కేంద్రానికి, ఆర్బిఐకి తక్షణమే లేఖలు రాస్తున్నట్లు మంత్రి తెలిపారు.