జిల్లా పోలీసు కార్యాలయం
జిల్లా పోలీసు శాఖలో త్వరలోనే సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎస్సైల నుంచి డీఎస్పీల దాకా స్థానచలనం అనివార్యమయ్యే సూచనలున్నాయి. జిల్లాకు కొత్త బాస్ కూడా రావొచ్చని తెలుస్తోంది. ప్రక్షాళన నేపథ్యంలో కొందరు అధికారుల్లో మాత్రం గుబులు మొదలైనట్లు సమాచారం. టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తి ‘పచ్చ’పాతంతో అత్యుత్సాహం ప్రదర్శించిన వీరు, తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని భయాందోళన చెందుతున్నారు.
అనంతపురం సెంట్రల్: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 151 సీట్లతో విజయదుందుభి మోగిం చింది. అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ శాఖల ప్రక్షాళనపై ఆయన దృష్టి సారిం చారు. కీలకమైన పోలీసు శాఖలోనూ ప్రక్షాళనకు అడుగులు పడుతున్న వేళ.. జిల్లాపై కూడా ఆ ప్రభావం పడే అవకాశముంది. సమూల మార్పులు జరిగే ఆస్కా రం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సైల నుంచి డీఎస్పీల దాకా స్థానచలనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మారనున్న సారథి?
మార్పుల్లో భాగంగా జిల్లా పోలీసు శాఖకు కొత్త సారథి వస్తారనే మాటలు విన్పిస్తున్నాయి. ప్రస్తుత ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ 2017 జూలై 3న పోలీసు బాస్‌గా పగ్గాలు చేపట్టారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఆయన జిల్లాలో పనిచేస్తున్నారు. జిల్లా పోలీసు శాఖపై తనదైన మార్క్ వేసుకున్న అశోక్‌కుమార్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ సమర్థవంతంగా పనిచేశారు. ఫ్యాక్షన్ ప్రభావితం కలిగిన జిల్లాలో ఎక్కడా గొడవలు, అల్లర్లు లేకుండా చర్యలు తీసు కున్నారు. పలు జిల్లాల్లో రీపోలింగ్ నిర్వహించినా ‘అనంత’లో మాత్రం ఆ ఆస్కారం లేకుండా చేశారు. కౌం టింగ్‌లో కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం జిల్లాలో జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం వంటి సమస్యాత్మక నియోజకవర్గాల్లోని గ్రామాలకు అదనపు బలగాలను రప్పించారు. కేవలం ఎన్నికలు మాత్రమే కాకుండా క్రికెట్ బెట్టింగ్, పేకాట, మట్కా లాంటి అసాం ఘిక కార్యకలాపాలను కట్టడి చేశారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించారు. ఫ్యాక్షన్ కట్టడి ఒకెత్తయితే రోడ్డు ప్రమాదాలు నివారణ మరో ప్రాధాన్యత అంశంగా తీసుకొని పనిచేశారు.
ప్రముఖంగా యేసుబాబు పేరు
పోలీసు శాఖలో రాష్ట్రం మొత్తం మీద ప్రక్షాళన నేపథ్యంలో అశోక్‌కుమార్ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో కొత్త బాస్ ఎవరనే విషయంపై కూడా జోరుగా చర్చలు సాగుతున్నాయి. పలు వురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అందులో ప్రముఖంగా యేసుబాబు పేరు వినిపిస్తోంది. ఈయన లేకుంటే అప్పలనాయుడు వస్తారనే ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గం కొలువుదీరిన తర్వాత ఎస్పీల బదిలీలుంటాయని తెలుస్తోంది.
‘పచ్చ’పాత అధికారుల్లో గుబులు
ఈ క్రమంలో కొందరు పోలీసు అధికా రుల్లో గుబులు మొదటైనట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అధికారపార్టీ నేతలకు అడుగులకు మడుగులొత్తిన వీరు భయాందోళన చెందుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాప్తాడు, ధర్మవరం, రాయదుర్గం తదితర నియోజకవర్గాల్లో కొంతమంది ఎస్‌ఐలు, సీఐలు, డీఎస్పీలు శృతి మించి ఏకపక్షంగా వ్యవహరించారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ తరఫున ఏజెంట్లు కూడా ఉండనీయకుండా భయబ్రాంతులకు గురి చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. కొత్త ప్రభుత్వంలో తమపై ఎలాంటి చర్యలుంటాయోననే కలవరం వీరిలో మొదలైనట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment