ప్రశాంతంగా ఎంసెట్ కౌన్సెలింగ్ | Clear EAMCET counseling | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎంసెట్ కౌన్సెలింగ్

Published Wed, Aug 21 2013 1:07 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

Clear EAMCET counseling

గుణదల, న్యూస్‌లైన్ : విజయవాడలో జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్ రెండవరోజు ప్రక్రియ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. సమైక్యవాదులు కౌన్సెలింగ్ కేంద్రాల వద్దకు రాకపోవటంతో నిర్ణీత సమయంలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. మాచవరంలోని ప్రభుత్వ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల, గుణదల ఆంధ్ర లయోల కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

అయితే పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బంది సమైక్యాంధ్రకు మద్దతుగా రెండవరోజు కూడా విధులు బహిష్కరించటంతో ఆ కేంద్రం వద్ద కౌన్సెలింగ్ జరగలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మిగతా కేంద్రాల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర లయోల కళాశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ సక్రమంగానే జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన కౌన్సెలింగ్‌లో 355 మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలోనూ కౌన్సెలింగ్ సజావుగానే సాగింది. ఇక్కడ 313 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది.
 
మౌలిక వసతుల లేమి....
 కౌన్సెలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం తాగటానికి మంచినీరు  అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది.  దీనికితోడు ఆన్‌లైన్ ప్రక్రియకు పలుమార్లు ఆటంకం కలగటంతో ప్రక్రియ ఆలస్యం అవుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
 
నేటి కౌన్సెలింగ్ వివరాలు...
 బుధవారం జరగబోయే కౌన్సెలింగ్ ప్రక్రియలో లయోలా కళాశాలలో 25,001 నుంచి 30 వేల ర్యాంకు గల విద్యార్థులు హాజరు కావాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో 40,001  నుంచి 45 వేల  ర్యాంకు వరకూ కౌన్సెలింగ్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement