నంగునూరు: ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం వచ్చిన విద్యార్థులకు చుక్కెదురైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నెట్ మొరాయించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరగంట వరకు నెట్ వస్తుందంటూ అధికారులు చెప్పడంతో అక్కడే పడిగాపులు కాశారు.
వివరాల్లోకి వెళితే...
నంగునూరు మండలం రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగు రోజులుగా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 89, రెండో రోజు 144, మూడో రోజు 117 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించారు. సోమవారం గజ్వేల్, సిద్ధిపేట, దుబ్బాక మండలాల నుంచి 85 మంది విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం వచ్చి పేర్లను నమోదు చేసుకున్నారు. కౌన్సిలింగ్ కోసం సర్వం సిద్ధం చేసిన అధికారులు ఇంటర్నెట్ రాకపోవడంతో కొద్ది సేపు వేచి చూశారు. మధ్యాహ్నం వరకు కూడా రాకపోవడంతో కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ నాగేశ్వర్‌రావు, బీఎస్‌ఎన్‌ఎల్ శాఖ జేఈ, డీజీఎంలతో ఫోన్లో మాట్లాడారు. కేబుల్ సమస్య వల్ల ఇంటర్నెట్ ఆగిపోయిందని వారు సమాచారం ఇచ్చారు.
దీంతో ఉదయం 8 గంటలకు వచ్చిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు వేచి చూసిన చాలా మంది విద్యార్థులు ఇతర సెంటర్లను వెనుదిరిగి వెళ్లిపోయారు. నాలుగున్నర ప్రాంతంలో ఇంటర్నెట్ పని చేయడంతో కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంటర్నెట్ సమస్య వల్ల సాయంత్రం వరకు కౌన్సెలింగ్ నిలిచిపోయిన విషయం వాస్తవమేనన్నారు. ఉన్న 45 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.
కౌన్సెలింగ్ కోసం కరీంనగర్‌కు వెళ్లిన విద్యార్థులు
కరీంనగర్: ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ కోసం రాజగోపాల్‌పేటలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రంలో కంప్యూటర్లు మొరాయించడంతో ఇక్కడి విద్యార్థులు 50 మంది కరీంనగర్‌లోని మహిళా పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ కేంద్రానికి వస్తారంటూ అసిస్టెంట్ కోఆర్డినేటర్ కె.సాంబయ్య అధికారులకు సమాచారమిచ్చారు. కానీ, కౌన్సెలింగ్ సమయం ముగిసే సరికి 14 మంది మాత్రమే హాజరయ్యారని, వారి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశామని అధికారులు తెలిపారు. కాగా మిగతా 36 మంది కౌన్సెలింగ్ కోసం ఎక్కడికి వెళ్లారనే విషయం తేలలేదు.
కొనసాగిన ఎంసెట్ కౌన్సెలింగ్
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఎంసెట్ 4వ రోజు కౌన్సెలింగ్ కొనసాగింది. 75,001 నుంచి 1 ఒక లక్ష వరకు ర్యాంకు సాధించిన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అర్హత సర్టిఫికెట్లను పరిశీలించారు. 4వ రోజు 110 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్ వెంకటరాంరెడ్డి తెలిపారు. ఈ నెల 19న సమగ్ర సర్వే ఉన్నందున కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు తెలిపారు. తిరిగి ఈ నెల 20న లక్ష నుంచి1,25,000 ర్యాంకు సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు 2 జతల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.
మొరాయించిన ఇంటర్నెట్. .ఆగిన కౌన్సెలింగ్
Published Mon, Aug 18 2014 10:59 PM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
Advertisement
Advertisement