సీఆర్‌డీఏ నిర్వహించిన సమావేశంలో రైతులు ప్రస్తావించిన ప్రతి సమస్యనూ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ శ్రీధర్ హామీ ఇచ్చారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతులకు రాజధానిలో రోడ్డు, ప్లాట్లు, జోనింగ్ నిబంధనలు తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో ఉచిత విద్య, వైద్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ల్యాండ్ పూలింగ్ అమలైన నాటి నుంచి దీన్ని వర్తింపజేసి రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలన్న ప్రతిపాదన సీఎం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. నేలపాడును నమూనాగా తీసుకుని ప్లాట్ల విభజన చేపట్టామని, ఇలాగే అన్ని గ్రామాల్లోనూ పూర్తి చేస్తామని శ్రీధర్ చెప్పారు. ప్రతి గ్రామానికీ డ్రాఫ్ట్ లేఅవుట్ ఇచ్చి దానిపై 30 రోజుల్లో రైతుల అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక లేఅవుట్ ప్లాన్‌ను ఫైనల్ చేస్తామని చెప్పారు. ప్లాట్ల విషయంలో 9.18 పత్రాలను రైతులు ఇవ్వాల్సి ఉంటుందని, ప్లాట్లు ఎలా కావాలనే దానిపై ఆ అంగీకార పత్రంలో తెలపాల్సి ఉంటుందని వివరించారు.
ఇద్దరు, ముగ్గురు, ఎంతమందైనా కలిసి ఒకేచోట ప్లాట్లు తీసుకోవచ్చని, వాటిని అమ్ముకోవచ్చని అన్నారు. లేఅవుట్‌లో రైతులకు కేటాయించిన నిర్దిష్ట కొలతలతో కూడిన ప్లాట్లు కాకుండా మిగిలిన ప్లాట్లను వేలం వేసి ఆ మొత్తాన్ని రైతులకు పంచనున్నట్లు చెప్పారు. లేఅవుట్లలో మొదటి ఏడాది 50 నుంచి 80 అడుగుల వెడల్పుతో గ్రావెల్ రోడ్డు, రానున్న మూడేళ్లలో తారు రోడ్లు వేసి అభివృద్ధి చేస్తామన్నారు. లేఅవుట్లను నార్త్ ఈస్ట్ ప్రకారం పక్కా వాస్తుతో వేస్తావని, కొన్ని సౌత్‌కు కూడా ఉంటాయని చెప్పారు. ఎకనామిక్స్ యాక్టివిటీ కోసమే కమర్షియల్ ప్లాట్లలో ప్రభుత్వం 18 అంతస్తుల వరకు నిర్మించుకోవచ్చని, రైతులు 11 అంతస్తుల వరకే నిర్మించుకోవాలనే నిబంధన పెట్టినట్లు తెలిపారు.