సీఎం నియంతృత్వ పాలనపై గుంటూరు నుంచి ప్రచారోద్యమం
ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మందిరాలు, మసీదులు కూల్చివేత దారుణం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టీకరణ
విజయవాడ బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచూ తాను నిప్పులా బతుకుతున్నట్టు చెబుతుంటారని, రాజకీయ విలువలను దిగజారుస్తున్న ఆయన చేష్టల్ని చూస్తుంటే నిప్పు కాదు తుప్పు అని నిరూపిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను మారానని, మరో అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటానని నమ్మించిన చంద్రబాబు ఇప్పుడు నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్యాండెట్‌తో గెలిచిన ఎమ్మెల్యేలను అనేక ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేస్తున్న చంద్రబాబు రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్న చంద్రబాబు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. సీఎం నియంతృత్వ పోకడలను ఎండగట్టేలా త్వరలో గుంటూరు జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారోద్యమం చేపడతామని వెల్లడించారు. రాజకీయ ప్రక్షాళన కోసం చేపట్టే ఈ ప్రచార జాతాలో వామపక్ష పార్టీలతోపాటు లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ కూడా పాల్గొంటారని చెప్పారు.
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా...
విజయవాడ నగరంలో రోడ్ల వెడల్పు పేరుతో అర్ధరాత్రి గుళ్లు, మసీదులు కూల్చడం టీడీపీ ప్రభుత్వ నిరంకుశ పోకడలకు నిదర్శనమన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవలు ఎవరైనప్పటికీ సెక్యులర్ స్టేట్‌లో వారి మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. దేవాలయ భూములు హిందూవులు మాత్రమే సాగు చేయాలనే 425 జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నగరి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడులు చేసి గాయపరచడం దారుణమన్నారు. చంద్రబాబు వత్తాసుతో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు ప్రతిపక్ష పార్టీలపై దాడులకు తెగబడడంతోపాటు జన్మభూమి కమిటీల పేరుతో బ్రోకర్లుగా డబ్బులు గుంజుతున్నారని ఆరోపించారు. ఈ నెల 6 నుంచి ప్రభుత్వం చేపట్టనున్న ప్రజా సాధికార సర్వేలో సేకరించిన వివరాలను ఆయా కుటుంబ పెద్దలకు ఒక కాపీ ఇవ్వాలని, తప్పులు దొర్లితే సరిదిద్దే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన, విద్యుత్ ఉద్యోగుల సమస్యను ఇద్దరు సీఎంలు కూర్చుని పరిష్కరించుకోవాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రామకృష్ణ సూచించారు. పార్టీ నేతలు పుట్టా హరనాథ్‌రెడ్డి, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.