- ప్రత్యేక నిధులేవీ ?
- జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరని పరిస్థితి
- కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ప్రజలు
‘‘ విజయనగరం అమ్మలాంటింది....పేద జిల్లాగా ఉండిపోయింది. ఎంతో బాధేస్తోంది. అధికారంలోకి వచ్చాక జిల్లాకు ప్రత్యేక నిధులు ఇస్తాం’’ ఇదీ ఎన్నికల ముందు విజయనగరం అయోధ్య మైదానంలో జరిగిన ప్రజాగర్జనలో చంద్రబాబు ఇచ్చిన హామీ. అదే మైదానంలో చేసిన వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు వాగ్దానంపై ఇప్పటికీ అతీగతీలేదు. ఏడాదిలోపే తోటపల్లితో పాటు తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ బడ్జెట్‌లో కనీస నిధులు కేటాయించలేదు. ఇప్పుడా ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక, శాసన సభలో జిల్లాకు పది వరాలు ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత అమ్మలాంటి జిల్లాకు ఇచ్చిన ప్రత్యేక నిధుల హామీతో పాటు చాలా వాటిని మరిచిపోయారని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం : చంద్రబాబు...అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తోంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలన్నీ అలాగే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. హామీలు అమలు చేయకపోగా, ఇచ్చిన మాట మార్చి మడం తిప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాల బదులు ప్రైవేటు వైద్య కళాశాల మంజూరు చేస్తామని చేతులేత్తేశారు. అనుకూలమైన స్థలం లేకపోవడం వల్లే గిరిజన యూనివర్సిటీ తరలిపోతోందని తప్పించుకున్నారు. జ్యూట్ పరిశ్రమల సంఖ్యను పెంచుతామని చెప్పి, మూతపడిన జ్యూట్ పరిశ్రమల్ని తెరిపించేందుకు చొరవ చూపడం లేదు. ఇదంతా చూస్తుంటే .‘ ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా కన్పిస్తోందని జిల్లా వాసులు విమర్శిస్తున్నారు.
ఇంజినీరింగ్ పట్టుభద్రులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లాలో ఎలక్ట్రికల్స్ హార్డ్‌వేర్ పార్కు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇంతవరకు అతీగతి లేదు. కళారంగానికి ఊపిరి పోస్తానని చెబుతూ లలిత కళల అకాడమీని కేటాయిస్తూ ప్రకటన చేశారు. అయితే, అకాడమీ విషయం పక్కనెడితే ఉన్న కళాశాల ఆలనాపాలనా చూసేందుకు కూడా చొరవ చూపలేదు. జిల్లాను పారిశ్రామిక న గరంగా తీర్చిదిద్దుతానంటూ శాసన సభలో వెల్లడించారు. ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. జిల్లాలో మామిడి, అరటి, జీడి, బొప్పాయి ఉత్పత్తుల కు చెందిన విభిన్న రకాల పరిశ్రమలు తీసుకొచ్చేలా ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉపాధి బాట వేస్తామన్నారు. కానీ ఇంతవరకు అతీగతి లేదు. విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేస్తానని, జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తామని ఊపన్యాసం ఇచ్చారు. కానీ ప్రతిపాది జాబితాల్లో జిల్లాకు చోటే లేకుండా పోయింది.
రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు, డ్వాక్రా మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రైతులకు అరకొర మాఫీ చేసి మమ అనిపించేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.1390కోట్లు మేర రైతు రుణ బకాయిలుండగా మాఫీ చేసింది రూ.200కోట్లు లోపే ఉంది. ఇక, డ్వాక్రా మహిళలకు రూ.400కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటి మాఫీపై ఇంతవరకు నోరుమెదపడం లేదు. ఫీజు రియింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ ఎప్పటిలాగే అందిస్తానని చెప్పారు. కానీ 2014-15కు సంబంధించి వెనకబడిన తరగతులకు చెందిన కొత్త విద్యార్థులకు ఒక్క రూపాయీ చెల్లించలేదు. 33వేల మంది రెన్యువల్ విద్యార్థులలో 18వేల మందికి 50శాతం చెల్లించి, మిగతాది ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. ఇక, అభివృద్ధి పథకాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొత్తగా నిధులివ్వకపోగా గతంలో మంజూరైన నిధులపైనా ఆంక్షలు విధించారు. దీంతో మంచినీటి పథకాలు, పంచాయతీరాజ్ రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయని నిరుద్యోగులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జిల్లా రానున్న సీఎం ఈ హామీలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.