ఎన్నికల్లోపు కొంతైనా పురోగతి చూపండి
- సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు సీఎం వేడుకోలు
- స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం
సాక్షి, అమరావతి: రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు పనిని వెంటనే ప్రారంభించి, వచ్చే ఎన్నికల నాటికి కొంతైనా పురోగతి చూపించాలని చంద్రబాబు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలను కన్సార్టియంను కోరారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమే ఉందన్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు మాస్టర్ డెవలపర్‌గా స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీల కన్సార్టియంను ఎంపిక చేసిన ప్రభుత్వం సోమవారం విజయవాడలో దీనిపై ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రెండేళ్లలో సింగపూర్ కంపెనీలు తమ సామర్థ్యం చూపాలని కోరారు.
అమరావతికి గుండెకాయ స్టార్టప్ ఏరియా
రాజధానికి మూడు దశల్లో మాస్టర్‌ప్లాన్లు అందించిన తర్వాత తమ సేవలను కొనసాగించాలని సీఎం చంద్రబాబు కోరారని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పారు. నాణ్యమైన నిర్మాణాలు చేపడతా మన్నారు. స్టార్టప్ ఏరియా రాజధాని అమరావతికి గుండెకాయలా మారుతుందని చెప్పారు. దీంతోపాటు మరో మూడు ఒప్పంద పత్రాలపై చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సంతకాలు చేశారు.
అమరావతిని భూతల స్వర్గంలా నిర్మిస్తాం
అమరావతిని భూతల స్వర్గంలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం రాజధాని అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి పనులకు తాళ్లాయపాలెం సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. విభజనతో నష్టపోయామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం అమెరికాకు వెళ్లి పలు కంపెనీలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
అదే విధంగా నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్ది దానికి సైబరాబాద్ అని పేరు కూడా తానే పెట్టానన్నారు. విభజన జరిగిన తరువాత ఏపీని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సింగపూర్ వెళ్లినట్లు పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ అడిగిన వెంటనే ఆ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తనకు క్యాపిటల్ రీజయన్, క్యాపిటిల్ సిటీ, సీడ్ క్యాపిటల్ ప్లాన్‌లు ఇచ్చిందన్నారు. సింగపూర్ స్ఫూర్తితో అమరావతిని నిర్మించాలని, అందులో భాగంగానే సింగపూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.