అమిత్‌షా అడిగారని బీజేపీకి ఒక సీటు
- ఏపీ రాజ్యసభ స్థానాలపై చంద్రబాబు వెల్లడి
- మిగిలిన రెండు స్థానాలకు సుజనా, టీజీ వెంకటేష్ ఎంపిక
- నాలుగో స్థానంలో పోటీపై ఏం చేయాలో అది చేస్తా
సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీ రాజ్యసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. మూడింటిలో ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. మిగిలిన రెండు స్థానాలకు గాను కేంద్ర మంత్రి సుజనాచౌదరిని కొనసాగించాలని, రాయలసీమకు చెందిన పార్టీ నేత టీజీ వెంకటేష్‌ను పోటీ చేయించాలని నిర్ణయించింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సోమవారం ఉదయం నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ వివరాలను రాత్రి మీడియాకు వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అడగడంతోనే ఒక స్థానాన్ని ఆ పార్టీకి ఇస్తున్నట్లు తెలిపారు.
అమిత్‌షా ఫోన్ చేసి తమ పార్టీకి చెందిన ఒక కేంద్ర మంత్రికి రాజ్యసభ స్థానాన్ని సర్దుబాటు చేయాలని కోరడంతో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంగీకరించినట్లు తెలిపారు. కేంద్ర రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు ఆ స్థానంలో పోటీ చేయనున్నారని, మంగళవారం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి నామినేషన్ దాఖలు చేస్తున్నారని చెప్పారు. మిగిలిన రెండు స్థానాల్లో ఒక దాన్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరిని కొనసాగిస్తున్నామని చెప్పారు. మరో స్థానానికి రాయలసీమకు చెందిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ను ఎంపిక చేశామని, తొలిసారి ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఈ అవకాశం ఇచ్చినట్లవుతుందన్నారు.
వారు పారిశ్రామిక వేత్తలు కాదు
పార్టీలో సీనియర్లను కాదని పారిశ్రామికవేత్తలకు అవకాశం ఇవ్వడం గురించి విలేకరులు ప్రశ్నించగా వారు పారిశ్రామికవేత్తలు కాదని, రాజకీయ నాయకులనిచంద్రబాబు చెప్పారు. నాలుగో స్థానంలో పోటీ చేసే విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ విషయంలో అనుభవం ఉన్నవాడిగా తాను ఏంచేయాలో అదే చేస్తానని డొంకతిరుగుడుగా సమాధానమిచ్చారు. వెనుకబడిన తరగతులు, ఎస్సీలకు భవిష్యత్తులో సర్దుబాటు చేస్తామని చెప్పారు.