సాక్షి, అమరావతి: తెలుగు చలనచిత్ర పరిశ్రమను విశాఖ, అమరావతి మధ్య ఎక్కడకు తరలించాలన్న అంశంపై అన్ని వర్గాలతో సమాలోచనలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సాగర నగరం విశాఖకు సినీ పరిశ్రమను తరలించాలని ఎక్కువమంది కోరుతున్నారని, అయితే, రానున్నకాలంలో అమరావతి నగరం ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటి కానుందని, ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ ఇక్కడ ఉంటేనే సమంజసంగా ఉంటుందని ఆయన సినీ ప్రముఖులతో అన్నారు. తెలుగు పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ బడ్జెట్ చిత్రాలకు పన్ను రాయితీ ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని, పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో నిలదొక్కుకునేందుకు అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు తానే కల్పించానని, మళ్లీ ఇప్పుడు పరిశ్రమను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నానన్నారు. సహజ అందాలతో విలసిల్లే విశాఖ, గోదావరి జిల్లాలు ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాలకు ముఖ్య చిరునామాగా ఉండేవని సీఎం గుర్తు చేశారు.
విశాఖ బ్యూటీఫుల్ రెడీమెడ్ సిటీ అయితే అమరావతి ఫ్యూచర్ సిటీ అని అభివర్ణించారు. చలన చిత్ర పరిశ్రమలో ఉండేవారంతా కొత్త రాష్ట్రంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నదే తన అభిలాష అన్నారు. త్వరలో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు పూర్తిస్థాయి పాలకవర్గాన్ని నియమిస్తామన్నారు. చలన చిత్ర పరిశ్రమలో వేర్వేరు రంగాల్లో ఉన్న వారు తమ సృజనను ప్రదర్శించి రాజధాని తరహా భారీ నిర్మాణాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment