ఫలితం పొంది విమర్శించడమా?
అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో సీఎం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రుణమాఫీలో రూ.1.50 లక్షలు తీసుకున్నారు.. ఇప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ తీసుకున్నా రు... అయినా నన్ను విమర్శిస్తున్నారంటే చాలా బాధ కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ నేపథ్యంలో ‘రైతు కృతజ్ఞత యాత్ర’ పేరుతో చంద్రబాబు అనంతపు రం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. మొదట కనగానపల్లి మండలం ముక్తాపురంలో ఎన్టీఆర్ గృహకల్ప పేరుతో నిర్మించిన 32 ఇళ్లను ప్రారంభించారు. తర్వాత లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో రూ.24,500 కోట్ల రుణమాఫీ చేయగా.. రూ.2,728 కోట్లు అనంతపురానికి వచ్చింది. రాష్ట్రానికి ఇన్‌పుట్, ఇన్సూరెన్స్ కలిపి రూ.2,214 కోట్లు ఇస్తే రూ.1451 కోట్లు అనంతపురానికి ఇచ్చాను. ఈ ఏడాది హంద్రీనీవా ద్వారా జిల్లాలోని చెరువులను నింపుతాం. మల్యాల, ముచ్చుమర్రి నుంచి నీటిని ఎత్తిపోస్తాం. రైతులు పండ్లు విక్రయించే సమయంలో వ్యాపారులు సూట్ వసూలు చేస్తున్నారు. ఇకపై ఎవరైనా సూట్ వసూలు చేస్తే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. రాష్ట్ర బహిష్కరణ చేస్తా’’ అని సీఎం చెప్పారు.
అనాథగా మారిన బాలికకు అండ
తాడిపత్రిలో మంగళవారం తల్లీ ఇద్దరు కూతుళ్లు దారుణహత్యకు గురికాగా.. తండ్రి కూడా బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో మరో కుమార్తె ప్రసన్న అనాథగా మారింది. ఈ నేపథ్యంలో ప్రసన్నను మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ముఖ్యమంత్రి సభకు తీసుకొచ్చారు. స్పందించిన సీఎం ప్రసన్న పేరుతో రూ.20లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రసన్నను చదివించే బాధ్యతను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీసుకున్నారు.