
అందరికీ పదవులు రావు
ఆశావహులతో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: తాను ఎన్నికల కేబినెట్‌ను తయారు చేసుకుంటున్నానని, అందరికీ న్యాయం చేయలేనని సీఎం చంద్రబాబు మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ ఖరారు కావడంతో ఆశావహులు శుక్రవారం అసెంబ్లీలోని చంద్రబాబు కార్యాలయానికి క్యూకట్టారు. ఆ తర్వాత ఉండవల్లిలోని నివాసంలోనూ బాబును పలువురు కలిశారు. విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
అందరిలోనూ ఆశ.. ఉత్కంఠ..
మంత్రి పదవులు ఆశించే వారు తమకు అవకాశం ఇవ్వాలని నేరుగా ఆయన్ను కోరడంతో పాటు తమకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లారు. పదవులు పోతాయనే ఆందోళనలో ఉన్న మంత్రులు కూడా తమను మంత్రివర్గం నుంచి తొలగించవద్దని విజ్ఞాపనలు చేసుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కేవీ నాయుడు, మీసాల గీత, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, సంధ్యారాణిలు సీఎంను కలసి తమలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరారు.
పార్టీ ఫిరాయించిన వారిని కేబినెట్‌లో చేర్చుకోవద్దని పరోక్షంగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావును ఉద్దేశించి ఆయన్ను కోరారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబీకులతో వచ్చి తనను కేబినెట్‌లో కొనసాగించాలని కోరగా చూస్తానని సీఎం సమాధానమిచ్చారు. కాగా, చంద్రబాబుకు యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్’ పురస్కారాన్ని ప్రకటించింది. మే 8 న కాలిఫోర్నియాలో జరగనున్న సదస్సులో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది.