నాలుగు రోజులు కష్టపడండి
అధికారులకు సీఎం చంద్రబాబు సూచన
నరసాపురం అర్బన్:అధికారులంతా మరో నాలుగు రోజుల పాటు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతంగా ముగించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం ఉదయం నరసాపురం వచ్చిన ఆయన వలంధర రేవులో పుష్కరాల నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాలలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకంగా మారిందన్నారు. అన్నదానాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో సంస్థలతోపాటు ఇక్కడి వారంతా స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. ఇదిలావుండగా, సీఎం చంద్రబాబు నరసాపురం వస్తారని నాలుగు రోజులుగా ఇక్కడి ప్రజాప్రతినిధులు చెబుతూ వచ్చారు.
ఆయన వస్తే ఘాట్ల వద్ద లోటుపాట్లు, ఇతర ఇబ్బందులు తొలగుతాయని ఆశించిన భక్తులకు ఆ అవకాశం చిక్కలేదు. ఉదయం 10.45 గంటలకు టేలర్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి హెలికాప్టర్ దిగిన చంద్రబాబు నేరుగా వలంధర రేవుకు చేరుకున్నారు. అక్కడి ఆర్చ్ పైనుంచి భక్తులు స్నానాలు చేస్తున్న క్రమాన్ని 5 నిమిషాలపాటు పరిశీలించారు. తరువాత కిందకు దిగి భక్తులకు అభివాదం చేస్తూ వెళ్లి పోయారు. మార్గమధ్యంలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అన్నదాన శిబిరాన్ని సందర్శించారు. వలంధర రేవులో ఎన్‌సీసీ కేడెట్స్‌ను పలకరించి, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు, మరో నాలుగు రోజులపాటు పుష్కర నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం నుంచి ఎటువంటి ఆదేశాలు, సూచనలు రాలేదు.
భక్తుల ఇబ్బందులు
సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షల కారణంగా భక్తులు ఇబ్బంది పడ్డారు. వలంధర రేవుకు చేరుకోవడానికి మూడు మార్గాలుండగా, ఒక దారిని ఉదయం నుంచి మూసివేశారు. రేవులోకి సీఎం వచ్చిన సందర్భంలో భక్తులు స్నానాలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇదిలావుంటే ముఖ్యమంత్రి మూడు కార్ల కాన్వాయ్‌తో వలంధర రేవుకు సాదాసీదాగా చేరుకున్నారు. కాన్వాయ్‌లోని మిగిలిన కార్లను హెలిపాడ్ వద్దే నిలిపివేశారు. సీఎం వెంట మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, శాసనమండలి విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్, కలెక్టర్ భాస్కర్, ఎస్పీ భాస్కర్‌భూషణ్, నరసాపురం మునిసిపల్ చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల ఉన్నారు.