అందుకే వారికి మంత్రి పదవులిచ్చాను: చంద్రబాబు | cm chandrababu naidu silence break on defectors into Andhra pradesh cabinet | Sakshi
Sakshi News home page

అందుకే వారికి మంత్రి పదవులిచ్చాను: చంద్రబాబు

Published Sat, Apr 8 2017 4:27 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

అందుకే వారికి మంత్రి పదవులిచ్చాను: చంద్రబాబు - Sakshi

అందుకే వారికి మంత్రి పదవులిచ్చాను: చంద్రబాబు

విశాఖ : పార్టీ ఫిరాయింపులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు నోరు విప్పారు. పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని, అది మంచిదే అని ఆయన అన్నారు. టీడీపీ నుంచి తలసాని శ్రీనివాసయాదవ్‌ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేటప్పుడు తాను ఫిరాయింపులపై మాట్లాడానని, అయితే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని చంద్రబాబు సమర్థించుకున్నారు. ఫిరాయింపుదారుల రాజీనామాలు స్పీకర్‌ పరిధిలో ఉన్నాయని ఆయన తెలిపారు.

పార్టీ ఫిరాయించి తమ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేల్లో సమర్థులు ఉన్నారని, అందుకే వారికి మంత్రి పదవులు ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణలో అందరికి న్యాయం చేయలేకపోయామన్నారు. (కాగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో నలుగురికి చంద్రబాబు కేబినెట్‌లో స్థానం కల్పించిన విషయం తెలిసిందే) రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే మంత్రివర్గ విస్తరణ జరిగిందన్నారు. మంత్రి పదవులు రానివారు అసంతృప్తికి గురి కావద్దని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రాజకీయాలు కాదని రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమన్నారు. అలాగే మంత్రుల పనితీరుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష ఉంటుందన్నారు. ఇవాళ్టి నుంచి మంత్రుల పనితీరుపై పోటీ ఉంటుందని ఆయన తెలిపారు.

సింహాచలం పంచగ్రామల భూ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి  హామీ ఇచ్చారు. విశాఖ పర్యటనలో భాగంగా శనివారం ఆయన సింహాద్రి అప్పన్న దర్శించుకున్నారు. అంతకు ముందు సింహాచలం దేవస్థానానికి చెందిన గోశాలలో ఏర్పాటు చేసిన సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు.  స్వామివారి దర్శనం అనంతరం సీఎం... దేవస్థానంలో డార్మిటరీ కమ్‌ ఫంక్షన్‌ హాలు, తొలిపావంచా, కల్యాణమండపం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్‌ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలోనే సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో విద్యాసంస్థలు, ఆస్పత్రులు పెట్టేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారన్నారు. విశాఖను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, విశాఖలాంటి నగరం దేశంలో మరెక్కడా లేదని అన్నారు.

2019లో నియోజకవర్గాల పునర్‌ విభజన జరుగుతుందని చంద్రబాబు అన్నారు. దేశంలోని ఎన్నికలన్నీ ఒకేసారి జరగాలని, అలాగైతే అభివృద్ధికి ఆటంకం ఉండదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు వెంట మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాగా ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవిని ఆశించిన బండారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎవరికీ అందుబాటులోనికి రాకుండా అజ్ఞాతంలో ఉన్నారు. జిల్లాలో సీఎం పర్యటనకు కూడా గైర్హాజరు అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement