- తుళ్లూరులో నూతన సంవత్సర వేడుకలు
విజయవాడ/గన్నవరం : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి నగరానికి వచ్చారు. తుళ్లూరుతోపాటు నగరంలో జరిగే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 9.30 గంటల సమయంలో బందరురోడ్డులోని హోటల్ డీవీ మనార్‌కు చేరుకున్నారు. హోటల్ వద్ద మంత్రులు దేవినేని ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి నాగుల్‌మీరా తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. సీఎం గురువారం ఉదయం 6.30 గంటలకు లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. ఎనిమిది గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమ్మను దర్శించుకుంటారు.
నూతన సంవత్సర వేడుకలు తుళ్లూరులో...
అక్కడినుంచి సీఎం తుళ్లూరు బయలుదేరి వెళ్తారు. నవ్యాంధ్ర రాజధానిగా ఎంపిక చేసిన తుళ్లూరులోనే నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలని సీఎం నిర్ణయిచారు. ఈ మేరకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు తుళ్లూరు చేరుకుని అక్కడ ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఏర్పాట్లకోసం సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా అధికారులు తుళ్లూరుకు వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత సీఎం ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. అక్కడ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు. అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించే అవకాశముంది. మధ్యాహ్నం 1.30కి బయలుదేరి రెండు గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన పశ్చిమగోదావరి జిల్లా చాటపర్రుకు వెళతారు. తిరిగి సాయంత్రం 5.25 గంటలకు గన్నవరం చేరుకుని విమానంలో హైదరాబాద్‌కు వెళతారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
విమానాశ్రయంలో సాదర స్వాగతం
తొలుత విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు సాదర స్వాగతం పలికారు. సీఎంకు స్వాగతం పలికిన వారిలో డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, కాగిత వెంకట్రావ్, బొండా ఉమామహేశ్వరరావు, పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.