
సీఎం పెద్ద కుట్రదారుడు: డిప్యూటీ సీఎం
సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ ఆదివారం ఇక్కడ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కిరణ్ పెద్ద కుట్రదారుడని ఆయన అభివర్ణించారు. సీమాంధ్రపై మీకు నిజమైన ప్రేముందా అంటూ కిరణ్ను డిప్యూటీ సీఎం సూటీగా ప్రశ్నించారు. అంత ప్రేమ ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమం చేయాలని కిరణ్కు సూచించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ఆగదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. బిల్లుపై చర్చకు గడువు పెంచమని కోరడం ద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చని కొందరు నేతలు భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
అలాంటి వారి కుట్రలు తిప్పికొడతామని దామోదర రాజనర్సింహ వెల్లడించారు. తాను సమైక్యవాదిని అని మొదటి నుంచి సిఎం కిరణ్ చెబుతున్నారు. ఆ క్రమంలో అసెంబ్లీకి వచ్చిన టి బిల్లు అసమగ్రంగా ఉందని కిరణ్ సభలో శనివారం వెల్లడించారు. దాంతో బిల్లును రాష్ట్రపతికి తిరిగి పంపాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్కు సీఎం కిరణ్ సభ నాయుకుడిగా నోటీసులు జారీ చేశారు. సీఎం కిరణ్ చర్యలపై టి.నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిరణ్ చర్యలపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం రాజనర్సింహపై విధంగా స్పందించారు.