తెలంగాణను ఎవరూ.. అడ్డుకోలేరు | No body can not stop the Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణను ఎవరూ.. అడ్డుకోలేరు

Published Tue, Feb 4 2014 4:41 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

No body can not stop the Telangana

ఎన్నికుట్రలు చేసినా రాష్ట్రం రావడం ఖాయం
గుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా సాధిస్తాం
అహంకారమే సీఎం అపజయానికి నాంది
నల్లగొండ సభలో దామోదర రాజనర్సింహ

 
 నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: ఎన్నికుట్రలు చేసినా తెలంగాణను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని మరో పన్నెండు రోజుల్లో సాధించుకుంటామని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణను అడ్డుకోవడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న  కుట్రలు నాయకుడి లక్షణాలు కావన్నారు. కుట్రలు.. కుతంత్రాలకు పర్యాయపదం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
 
 ఆయన ప్రదర్శిస్తున్న ఆహం, అహంకారం అపజయానికి నాంది పలుకుతాయన్నారు. నాటి నుంచి నేటి వరకు సీమాంధ్రులు తెలంగాణ ప్రజలను అన్ని రంగాలలో అణిచివేతకు గురిచేశారని చెప్పారు. అది చాలక ఇంకా దోచుకోవడానికి సమైక్యంగా ఉందామని కోరుకుంటున్నారని విమర్శించారు. నాడు తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పందాలను తుంగలో తొక్కడంతో పాటు 610 జీఓను అమలు చేయలేదన్నారు. ఉద్యోగ, విద్య, వైద్య రంగాలతో పాటు సాగు, తాగునీటి వనరులను కొల్లగొట్టారని అన్నారు.
 
 అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చించకుండా ప్రతిపక్షంతో పాటు సీమాంధ్ర నాయకులు అడ్డుకున్న తీరు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేసిందని చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటప్రకారం తెలంగాణను ప్రకటించినందున నవతెలంగాణను ఏర్పాటు చేసుకుని రానున్న ఎన్నికలలో సోనియాగాంధీకి అండగా ఉందామని చెప్పారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో వెయ్యిమంది ఆత్మబలిదానాలకు సీమాంధ్రుల కుట్రలే కారణమన్నారు. కిరణ్ ముఖ్యమంత్రిగా కాకుండా మూర్ఖుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోనియా దయతో
 ముఖ్యమంత్రి అయిన ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడకుండా  నేడు సోనియానే ఎదిరించడం అహంకారానికి నిదర్శనమన్నారు. పార్లమెంట్ సమావేశంలో బిల్లును అమోదించుకుని 2014 ఎన్నికలలను తెలంగాణ రాష్ట్రంలోనే నిర్వహించుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ సీమంధ్రులు లక్షల ఎకరాలను కొల్లగొట్టడమే కాకుండా ఉద్యోగాలను కూడా కొల్లగొట్టారని ఆరోపించారు. పదకొండు వందల విద్యార్థుల బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ వేలాదిమంది విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని సంఘాలు చేసిన పోరాటాలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేసిన కృషి  ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు.
 
 దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట సాధన కోసం దామోదర రాజనర్సింహతో పాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా సమష్టిగా కృషి చేశామని తెలిపారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్థూపం , శ్రీకాంతాచారి విగ్రహం, పూలే విగ్రహం విగ్రహం వద్ద పుష్పగుచ్చం గుచ్చి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు ముంగి చంద్రకళ, నాయకులు గుమ్ముల మోహన్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ,వంగూరు లక్ష్మయ్య, పనస శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 
 సోనియాను మెప్పించి ఒప్పించి తెలంగాణను తెచ్చిన ఘనత దామోదర రాజనర్సింహకు దక్కుతుందని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సభలో ఆయన మాట్లాడు తూ తెలంగాణకోసం తన పదవిని త్యాగం చేయడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడిపించానన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చినందున రానున్న ఎన్నికలలో తనతో పాటు తెలంగాణ కోసం కృషి చేసిన ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు అన్ని నియోకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మూడు నెలలు మీరు కష్టపడి గెలిపిస్తే 60 నెలలు మేము కష్టపడి జిల్లాలో మిగిలిన పనులను పూర్తి చేస్తామని చెప్పారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రులు ఎన్నికుట్రలు చేసి తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని చూసినా తెలంగాణ ఏర్పాటు కావడం ఖాయమని చెప్పారు. సీమాంధ్రులు పగటిదొంగల్లా తెలంగాణను దోచుకున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement