కిరణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: కేసీఆర్
రాష్ట్ర విభజన ప్రకటనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతిందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కిరణ్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ధ్వజమెత్తారు. చరిత్రను వక్రీకరించి సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి మాటల్లో అర్థం లేదని కొట్టిపారేశారు. సీఎం కిరణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో పుట్టి పెరిగిన వారు ఈ ప్రాంతం బిడ్డలేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కిరణ్కు ఇష్టముంటే ఇక్కడే ఉండొచ్చని సూచించారు. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు సీఎంకు లేదన్నారు. విభజన ప్రకటన వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ పరిస్థితి ఏంటని కిరణ్ ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర విభజనపై సీఎం చెప్పిన లెక్కలన్నీ తప్పని కేసీఆర్ అన్నారు. సీఎం చెప్పిన లెక్కలు తప్పని నిరూపించేందుకు సిద్ధమన్నారు. కిరణ్తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
కరెంట్ కొరతను చూపి తెలంగాణ వాసులను సీఎం కిరణ్ భయపెడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. తమ ప్రాంతానికి 6800 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, 2458 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందన్నారు. లోటును పూడ్చుకునేందుకు కేంద్రం 1000 మెగావాట్ల విద్యుత్ తీసుకుంటామన్నారు. ఛత్తీస్గఢ్ వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందించేందుకు సిద్దంగా ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడితే 10వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ఎదుగుతామని కేసీఆర్ చెప్పారు.
హైకోర్టు విషయంలో సీఎం కిరణ్ మసిపూసి మారేడు కాయ చేస్తున్నాయని కేసీఆర్ విమర్శించారు. 1919లోనే తెలంగాణలో హైకోర్టు ఏర్పడిందని, 1954లో గుంటూరులో హైకోర్టు ఏర్పడిందని తెలిపారు. హైదరాబాద్లో ఆంధ్ర అడ్వకేట్లు 5 శాతం మందే ఉన్నారని వెల్లడించారు.