సీఎం హామీ గాలికే..
సీఎం హామీ గాలికే..
న్వాడ మండలం మందిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు * 50 లక్షలు మంజూరు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వాగ్ధానం హామీలకే సరిపోయింది. ముఖ్యమంత్రి గ్రామాన్ని సందర్శించి 11 నెలలైనా అభివృద్ధి కార్యక్రమాల కోసం నయా పైసా మంజూరు కాలేదు. దీంతో తమ గ్రామానికి నిధులు ఎప్పుడోస్తాయోనని గ్రామస్తులు నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. -, ధన్వాడ
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2013 మార్చి 12న వ్యవసాయ శాఖమంత్రి రఘువీరారెడ్డి, సమాచార శాఖమంత్రి డీకే అరుణ ధన్వాడ మండల పరిధిలోని మందిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామం నుంచి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా గ్రామ వీఆర్వో కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి తమ గ్రామానికి వస్తే గ్రామం అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని గ్రామంలోని ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఏకమై ఆయన సమావేశాన్ని విజయవంతం చేసేందుకు సహకరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు ప్రశాంతంగా జరగడానికి ఈ గ్రామ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా సహకరించారని గ్రామాభివృద్ధి కోసం * 50 లక్షలు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. గ్రామంలో వీఆర్వో కార్యాలయ నిర్మాణం కోసం నిధులు, ఎస్సీ, ఎస్టీలను ఆదుకునేందుకు ఇందిర జలప్రభ కింద సామూహిక బోర్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ముఖ్యమంత్రి గ్రాంట్ కింద మంజూరైన నిధులతో మందిపల్లి, మందిపల్లి పాతతండా, కొత్త తండాల్లో నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు చేపట్టాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించారు. అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు కాకపోవడంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. సీసీ రోడ్లు నిర్మించిన రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీలు లేకపోవడంతో వర్షపు, ఇళ్ల మధ్య నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. గ్రామంతో పాటు పాతతండా, కొత్తతండాల్లో అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. చెరువు మరమ్మతు పనులు నిలిచిపోయాయి. హెల్త్ సబ్‌సెంటర్‌కు సొంత భవనం లేదు. ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తే ఈ సమస్యలకు పరిష్కారం లభించేది. ధన్వాడ, మరికల్ గ్రామాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ధన్వాడలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, మరికల్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేందుకు *40 లక్షలు మంజూరు చేస్తామని, రెండో విడతలో మరికల్ బహిరంగ సభలో ప్రకటించారు. ధన్వాడలో ప్రధాన రహదారిని * 20 లక్షలతో సీసీ రోడ్డుగా మార్చారు. మరికల్‌కు * 40 లక్షలు మంజూరు కాగా వాటితో డ్రైనేజీల నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కాని రాజకీయ విబేధాలకు నిలయంగా ఉండే మందిపల్లి గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి రెవెన్యూ సదస్సును విజయవంతం చేసిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించే విషయంలో ఈ గ్రామంపై సీఎం సవతి తల్లి ప్రేమ చూపించారని స్థానికులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ స్పందించి మందిపల్లి గ్రామాభివృద్ధి కోసం మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన * 50 లక్షలను వెంటనే విడుదల చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.