- సీఐడీ విచారణకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పరిధిలో లేని ఖరీదైన చికిత్సలను భరించే స్తోమత లేని నిరుపేద రోగులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి అందించే ఆర్థిక సాయం దుర్వినియోగమైంది. నకిలీ బిల్లులతో ఈ సొమ్ము పక్కదారి పట్టినట్లు తేలింది. దీనిపై ఫిర్యాదులు రావటంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి కార్యాలయం పలు జిల్లాలకు మంజూరు చేసిన బిల్లులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
18 మంది రోగులకు సంబంధించిన ఫైళ్లను శాఖాపరమైన విచారణకు ఆదేశించగా అందులో నలుగురు నకిలీ బిల్లులతో సీఎం సహాయ నిధిని దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఉదంతంపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. జూన్ రెండో తేదీ తర్వాత మంజూరు చేసిన బిల్లులపై విచారణ జరపాలని నిర్ణయించింది. వీలైనంత తొందరగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించింది.
జూన్ నుంచి ఇప్పటివరకు సీఎం సహాయ నిధి నుంచి జారీ చేసిన దాదాపు ఏడు వేలకుపైగా చెక్కులకుగానూ ప్రభుత్వం దాదాపు రూ.150 కోట్లు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరిపించాలని డీజీపీ కార్యాలయానికి లేఖ రాసినట్లు సీఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ రాతపూర్వక లేఖలతో సిఫారసు చేసిన ఫైళ్లనే సీఎంఆర్‌ఎఫ్ కింద సాయం చేసేందుకు స్వీకరిస్తారు. ఈ ఫైళ్లను సీఎం పరిశీలించి ఆమోదించాక ఆయన సూచించిన మేరకు నిధులు విడుదల చేస్తారు. అయితే, ప్రజాప్రతినిధులతో తమకున్న పరిచయాలను ఆసరాగా చేసుకొని కొందరు దళారులు సిఫారసు లేఖలు సంపాదించి సీఎంఆర్‌ఎఫ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.