‘మాస్క్‌ లేకుండా పని చేస్తానని మాయమయ్యారు’ | CLP Leader Bhatti Vikramarka Fires On KCR Over Corona Virus | Sakshi
Sakshi News home page

కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలకు ధైర్యం చెప్పాలి: భట్టీ

Published Sat, Jul 11 2020 3:38 PM | Last Updated on Sat, Jul 11 2020 3:53 PM

CLP Leader Bhatti Vikramarka Fires On KCR Over Corona Virus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాస్క్‌ లేకుండానే కరోనా కట్టడి కోసం పోరాటం చేస్తాం అన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు.. కనిపించడం లేదు అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శనివారం ఆయన మాట్లాడారు. ‘సీఎల్పీ లీడర్ గా చాలా ఆవేదన, బాధతో మాట్లాడుతున్న. రాష్ట్రం మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. కరోనా వచ్చిన రోగులకు వైద్యం అందుబాటులో లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్స్ లేవు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాజిటివ్ వస్తే తప్ప చికిత్స లేదు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు భయంతో బతుకుతున్నారు. ధనవంతులు ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ పేదలు రోడ్డెక్కకపోతే పూట గడవడం లేదు. ప్రజలందరూ భయంతో బతుకుతుంటే సీఎం కేసీఆర్‌ చేతులెత్తేసి ఫామ్ హౌస్‌కి వెళ్లారు’ అని ఆయన ఆరోపించారు. (కేసీఆర్‌ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్‌)

ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీలో కరోనా 2.8 శాతం ఉంటే తెలంగాణలో 22శాతం ఉంది. జాతీయస్థాయిలో చూస్తే ఇది 7.14 శాతంగా ఉంది. అతి తక్కువ టెస్టులకే 22 శాతంగా ఉంది అంటే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కరోజులోనే సమగ్ర కుటుంబ సర్వే చేసే శక్తి ఉన్న రాష్ట్రానికి..  కరోనా టెస్టులు చేయడానికి కుదరడం లేదా. ఆనాడు అవసరం లేకున్నా సమగ్ర కుటుంబ సర్వే చేశారు. మరి ఇవ్వాళ అవసరం ఉన్నా కరోనా టెస్టులు చేయడం లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి 50 శాతం బెడ్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు చికిత్స అందించాలి. ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక యాప్‌ తయారు చేసి బెడ్స్ వివరాలు అందులో పొందుపరచాలి’ అని భట్టీ సూచించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘పేద, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసేలా కరోనా ట్రీట్మెంట్‌ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలి. ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి... ప్రభుత్వం వారికి ధైర్యాన్ని చెప్పాలి. హైదరాబాద్, జిల్లా హోటల్స్‌లో 50శాతం బెడ్స్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని కరోనా హోమ్ క్వారంటైన్‌ కోసం వినియోగించాలి. డెంగ్యూ,జనరల్ ఫ్లూ వ్యాధులపై ముందస్తు చర్యలు చేపట్టాలి. సీనియర్ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసి పర్యవేక్షణ చేపట్టాలి. ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుంది. కవులు, కళాకారులు, పోరాట సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం వీటి పై దృష్టి సారించాలి’ అని భట్టీ విక్రమార్క డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement