హైబ్రీడ్ వాహనాలపై టయోటాతో సీఎం చర్చలు
సాక్షి, అమరావతి: రాజధానిలో హైబ్రీడ్ వాహనాల ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం చంద్రబాబు టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ ప్రతినిధులను కోరారు. శనివారం చంద్రబాబును కలసిన కిర్లోస్కర్ కంపెనీ ఎండీ అకిటొ టచిబనతో కూడిన ప్రతినిధి బృందం హైబ్రీడ్ వాహనాలపై ప్రజెంటేషన్ ఇచ్చింది. బ్యాటరీలతో నడిచే ఈ వాహనాలను విద్యుత్‌తో చార్జ్ చేసుకోవాలి.
చార్జింగ్ లేని సమయంలో ఇంజన్‌తో నడిచేలా ఈ వాహనాలను తయారు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో ప్రాజెక్టును ప్రారంభించేందుకు పనులు ప్రారంభించాలని సీఎం కోరారు. రాజధాని అమరావతిలో భవిష్యత్తు రవాణా అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టును చేపట్టాలని సూచించారు. త్వరలో దీనిపై ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదించారు.